ఈ నాణేనికి ఎన్నెన్నో పార్శ్వాలు… కుడి ఎడమల పొత్తుల డాల్ కత్తులు మెరయగ… ఆయన ఢిల్లీ బయలుదేరాడు. జేబులో ఒక పొత్తు, చేతిలో ఒక పొత్తు, సంచిలో ఒక పొత్తు, చెకిన్ బ్యాగేజిలో ఒక పొత్తు. అంతా మొక్కజొన్న పొత్తులే… పొత్తులు!
చూడు! నాణేనికి ఒక వైపే చూడు!
రెండో వైపు చూస్తే తట్టుకోలేవ్!!
అంటూ సినీ ఫ్యాన్స్ భజన బాజా బజంత్రీలు మోగుతుండగా ఆయన “అయినను పోయిరావలె యమునా తీర హస్తినకు” అని అనుకుని బయలుదేరారు.
రాజకీయాల్లో వెన్ను చూపని వారి సంగతి ఇక్కడ అప్రస్తుతం. ఆయన వెన్న పూయని పార్టీల్లేవు. ఆ వెన్నతో పాటు వెన్నులో దిగిన పోట్ల బాధ తెలియని పార్టీల్లేవు. ఆయన కళ్లెప్పుడూ ఇతరుల వెన్ను మీదే ఉండడంతో ఎన్నెన్నో పార్టీలకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.
Ads
ఆయన నడిచి వస్తుంటే రెండు కళ్లు, రెండు కాళ్లు, రెండు సిద్ధాంతాలు కాస్త అనంత నేత్రాలు, అనంత పాదాలు, అనంత సిద్ధాంతాలు అయి నాలుకలు వాటంతట అవే మడతలు పడిపోతాయి. సిద్ధాంతాలు సిగ్గుతో తలలు వంచుకుంటాయి. విజన్ కళ్లు బైర్లు కమ్మి మసకబారి దృశ్యం అదృశ్యమవుతుంది. పేపర్ టైగర్లు గొంతులు విప్పుతాయి. మీడియా సింహాలు జూలు విదిల్చి జ్యోతులు పడతాయి.
బిజెపిని కరివేపాకులా వాడుకుని వదిలేసి… మళ్లీ దగ్గరికి తీసుకుని… వాడుకుని… మళ్లీ వదిలేసి… మళ్లీ కలవడానికి ఉవ్విళ్ళూరడం నాణేనికి ఒక వైపు దృశ్యమే.
కాంగ్రెస్ కు డబ్బు సాయం చేసి… కాంగ్రెస్ తో పాటు తానూ మునిగి… ఆ కాంగ్రెస్ కు చేయి ఇచ్చి… ఇప్పుడు చెవిలో కమలం పువ్వు పెట్టుకుని తిరగడం నాణేనికి ఒక వైపు దృశ్యమే.
జనసేనను వాడుకుని… ఏరు దాటి తెప్ప తగలేసి… ఇప్పుడు మళ్లీ తన పల్లకీ మోసే జనసేన బోయీల కోసం తహతహలాడడం నాణేనికి ఒక వైపు దృశ్యమే.
వామ పక్షాలను వాడుకుని… వారికి వామ హస్తం చూపిన సందర్భాలు నాణేనికి ఒక వైపు దృశ్యమే.
కేసిఆర్ తో కలిపిన చేతులు, కుమారస్వామితో ఎత్తిన చేతులు, మమత నిరాకరించిన చేతులు, అమిత్ షాకు తిరుపతిలో ఎత్తిన నల్ల బెలూన్లు, మోడీని తిట్టిన నోళ్లు, ఢిల్లీలో ప్రభుత్వ ఖర్చుతో చేసిన నల్ల చొక్కాల నిరసన ప్రహసనాలు నాణేనికి ఒక వైపు దృశ్యమే.
నాణేనికి కనీసం బొమ్మా బొరుసు రెండు పార్శ్వాలే ఉంటాయి. ప్రత్యేక ప్యాకేజీని మహదానందంగా తీసుకుని… ఆపై ప్రత్యేక హోదా కోసం బీజెపి అంతు చూడబోయానంటూ… భంగపడి… ఇప్పుడు ప్రత్యేక నాణెం పేరిట… బీజెపి గుమ్మాల్లో పునర్నిర్మాణ నినాదాన్ని జపిస్తున్న ఈ ప్రత్యేక నాణేనికి ఎన్ని పార్శ్వాలున్నాయో? చెప్పగలిగినవాడు ఆ మహానుభావుడు ఎన్ టీఆర్ ఒక్కడే. ఆయన పోయి… బతికి పోయాడు. లేకుంటే బతికి ఉండగానే నాణెమై పోయేవాడు!
Share this Article