కరోనా ప్రబలితేనే… రోగనిరోధకశక్తిని పెంచే మన పోపులపెట్టె గొప్పతనం అర్థమైంది మనకు…! మన మసాలాల ఉపయోగమూ బోధపడింది..! మధుమేహానికి విరుగుడు ఏమిటో, దేహానికి శక్తి దేనివల్ల లభిస్తుందో మళ్లీ ఇప్పుడు సిరిధాన్యాల వాడకం చెబుతోంది… మన జొన్నలు, సజ్జలు, రాగులు ఎందుకు మేలో ఇప్పుడు తెలుస్తోంది… మన తొక్కులు, మన పొడులు సహా భారతీయ ఆహారం ఆరోగ్యాన్నే బోధించింది… భారతీయ వంటకాల్లో ప్రధానంగా కనిపించే పోపు, తిరగమోతకూ కారణాలున్నయ్… ఎటొచ్చీ మనం అవన్నీ వదిలేశాం, మళ్లీ ఇప్పుడు వెనక్కి వెళ్లి వెతుక్కుంటున్నాం… పళ్లు తోమడానికి తరాల తరబడీ మీరు వాడిన బొగ్గు, ఉప్పే భద్రంరా బాబూ అని మళ్లీ కోల్గేట్ వాడు చెబితే తప్ప మనకు సమజ్ కాదు… సేమ్, చద్దన్నం మంచిదిరా నాయనా అని నోవాటెల్ వాడు చెబితేనే మనవాళ్లలో చర్చ… వాడు ఇంగ్లిషులో ప్రొబయాటిక్, ఫర్మెంటెడ్ రైస్ అని, గూబ గుయ్యిమనే రేటు పెట్టి వాయిస్తే తప్ప చద్దన్నం గొప్పదనం తెలియదు మనకు… ఇది చూడండి…
నోవాటెల్ వాడిని మెచ్చుకోవాలి నిజానికి… మనకు పాత మనల్ని గుర్తుచేస్తున్నాడు… అవునూ, ఇప్పటితరంలో ఎందరికి చద్దన్నం తెలుసు..? తెలియదు..! చాలామందికి ఓ అపోహ ఉంది, ప్రత్యేకించి యూట్యూబ్ చానెళ్లు చూసి అదే నిజం అని అనుకోవద్దు సుమా… పెరుగన్నం వేరు, చద్దన్నం వేరు… అలాగే చద్దన్నం వేరు, తరువాణి వేరు… రాత్రి అన్నం మిగిలింది అనుకొండి, ఓ కుండలో పెట్టి, గోరువెచ్చని పాలు పోసి, కాసేపాగి, కాస్త మజ్జిగ కలిపి అలా ఉంచేస్తారు… తెల్లవారాక పులిసిన ఆ అన్నంలోకి పచ్చి ఉల్లిపాయ, మిరపకాయ లేదా ఊరగాయ నంజుకుని కుమ్మేయడమే… అది చద్దన్నం… పెరుగన్నం వేరు, అన్నంలో పెరుగు కలిపి, పోపు పెట్టేస్తే చాలు, అది పెరుగన్నం… అలాగే వార్చిన గంజినీళ్లకు కాస్త మజ్జిగ కలిపి, రాత్రంతా అలాగే ఉంచేస్తే, అది పులుస్తుంది… అదీ చద్దన్నంలాగే రుచి, శ్రేష్టం…
Ads
అసలు ఇప్పుడు గంజి వార్చడం ఎక్కడిది..? జస్ట్, కుక్కర్లో పడేయడం, కాసేపాగి వడ్డించుకోవడం..! అసలు సుగర్లు, బీపీలు పెరిగాక రాత్రిళ్లు అన్నం వండే ఇళ్ల సంఖ్యే వేగంగా తగ్గిపోతోంది… నిజానికి భారతీయ ఆహారం విశిష్టత ఇప్పుడిప్పుడే వేరే దేశాలకూ అర్థమవుతోంది… ప్రత్యేకించి పులిసిన ఆహారం… చద్దన్నం, తరువాణిలకు ఆ శ్రేష్టత వచ్చేదే అది పులియడం వల్ల… మనకు మేలు చేర్చే బ్యాక్టీరియా చేరడం వల్ల… అదే ప్రొబయాటిక్ అంటున్నాం… మలబద్ధకం నుంచి ఒబేసిటీ, సుగర్, బీపీ, అజీర్ణం దాకా అనేక రుగ్మతల ఉపశమనం కోసం చద్దన్నం వైపే చూస్తున్నాం అందుకే..! అనేక కోణాల్లో పులిసిన తిండి దేహానికి మంచిది… సరిగ్గా వాడితే…! అసలు భారతీయులకు ఏది పులిసినా ఇష్టమే… చివరకు నీరా పులిస్తేనే కదా కల్లు… పిండి పులిస్తేనే కదా… ఇడ్లి, దోశ, అప్పం, ఇడియాప్పం, ఊతప్ప ఎట్సెట్రా… పులియనిదే ఇండియన్ ఫుడ్ లేదు, ఇక్కడ పులియడం అంటే పులుపు అనే రుచి కాదు… విదేశాల్లో ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్ మీద బోలెడు రీసెర్చులు సాగుతున్నయ్… వాళ్లు ఫలానా ఫలానా ఉపయోగాలు అని రాస్తుంటారు, అప్పుడు మన మీడియా వాటిని అచ్చేసి, మనం మరిచిన మన పాత గొప్పదనాల్ని అర్జెంటుగా నెమరేసుకుని, ఆచరణలోకి పెడదాం… ఏమంటారు..?!
Share this Article