.
Subramanyam Dogiparthi …. సోషలిజం , విప్లవం , సెంటిమెంట్ , ఎమోషన్ , ఏక్షన్ , ఫైట్లు , ఓ డేషింగ్ హీరో , ఓ హీమేన్ , ఇద్దరు అందాల భామలు , వెరశి సూపర్ డూపర్ హిట్ ఈ ముందడుగు సినిమా .
సురేష్ ప్రొడక్షన్స్ బేనరుపై రామానాయుడు కె బాపయ్య దర్శకత్వంలో నిర్మించిన ఈ ముందడుగు ఫిబ్రవరి 1983 ఇరవై అయిదున పడింది . ఫుల్ మసాలా సినిమా . పూర్తి వినోదాత్మక చిత్రం . మొదటి రిలీజయిన ప్రతీ సెంటర్లోను యాభై రోజులు ఆడింది . 20 సెంటర్లలో వంద రోజులు , రెండు సెంటర్లలో గోల్డెన్ జూబిలీ ఆడింది .
Ads
సినిమా ఘన విజయానికి ప్రధాన వ్యక్తులు పరుచూరి బ్రదర్స్ . కధను బాగా నేసారు . వాళ్ళు వ్రాసిన డైలాగులు బాణాల్లాగా దూసుకువస్తుంటాయి . బాపయ్య బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను పరుగులు పెట్టిస్తుంది .
అక్కినేని , యన్టీఆర్ల తర్వాత తెలుగు చిత్రరంగంలో అప్పట్లో టాప్ హీరోలు కృష్ణ , శోభన్ బాబులు . ఇద్దరికీ కావలసినంత అభిమానగణం . ఈ సినిమా , సినిమాలోని డ్యూయెట్లు అభిమానులకు పండగే పండగ .
వేటూరి పాటలు హుషారు హుషారుగా ఉంటాయి .
చిలకలూరిపేట కాడ చిలకో శోభన్ బాబు , శ్రీదేవిల మీద డ్యూయెట్ . వేటూరి వారికి చిలకలూరిపేట , చిలకలూరిపేట చిలక ఎందుకు గుర్తుకొచ్చాయో ! పైకెళ్ళినప్పుడు అడగాలి . శోభన్ బాబు , శ్రీదేవిల మీద ఈ పాట కన్నా మరో పాట ఇంకా పాపులర్ . శ్రీదేవిని టీజ్ చేసే పాట . నాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలి . చాలా బాగుంటుంది . వీరిద్దరి డ్యూయెట్లు ఇవి .
వారిద్దరు అంటే కృష్ణ , జయప్రదల మీద కూడా రెండు డ్యూయెట్లు ఉన్నాయి . మరి ఇద్దరు హీరలకూ సమానంగా ఉండాలి కదా ! పోరా కంత్రీ మామా , ఏ తల్లి కన్నదో నిన్ను డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి . శ్రీదేవి మీద ప్రేమకు నేను పేదను కాను పాట శ్రావ్యంగా , హృద్యంగా ఉంటుంది . పాటలో ప్రభాకరరెడ్డి భిక్షాటన చేయడం హృద్యంగా ఉంటుంది .
సినిమాకు వినోదపరంగా హైలైట్ క్లైమాక్సులో ఇద్దరు అందాల భామల డాన్స్ . వేయి పడగల మీద కోటి మణుగుల నేల మోసి అలసిన స్వామి మోపిదేవి స్వామి పాట చిత్రీకరణ చాలా బాగుంటుంది . ఈ పాటలో మణుగుల అనే పదాన్ని ఉపయోగించాడు వేటూరి .
1980s కు ఈ మణుగు అనే మాట పూర్తిగా మరుగున పడిపోయిన పదం . మా చిన్నప్పుడు బరువుని చెప్పేందుకు బారువు/పుట్టి , మణుగు , వీశె , శేరు వంటి పదాలు ఉండేవి . తర్వాత కాలంలో కిలోగ్రాములు , టన్నులు వచ్చాయి . అలాగే ఈ పాటలో మోపిదేవి స్వామి అని వస్తుంది .
వేటూరి వారి స్వస్థలం పెద కళ్ళేపల్లి పక్కన ఉంటుంది ఈ ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం . సినిమా కధకు బాగా సెట్టయింది . మఛిలీపట్నంకు దగ్గరలో ఉంటుంది మోపిదేవి . సందర్శించి ఉండకపోతే తప్పక సందర్శించండి .
సామ్యవాద సాధన విప్లవకారుడిగా శివకృష్ణ బాగా నటించాడు . మంచి పాత్ర వచ్చింది అతనికి . అలాగే బాగా నటించే అవకాశం వచ్చిన మరో పాత్ర అన్నపూర్ణకు దొరికింది . చాలా బాగా నటించింది . విలనాసురులుగా రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , చలపతిరావులు , వాళ్ళ సున్నప్పిడత పుత్రరత్నాలుగా సత్యనారాయణ , నూతన్ ప్రసాద్ , గిరిబాబు , గుమ్మడి , రాధాకుమారి , ప్రభాకరరెడ్డి , ప్రభృతులు నటించారు .
తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా హిందీలో కూడా మక్సద్ అనే టైటిలుతో రీమేక్ చేయబడింది . హీరోల పాత్రల్ని రాజేష్ ఖన్నా , జితేంద్రలు పోషించగా ఇద్దరు అందాల భామలు శ్రీదేవి , జయప్రద తమ పాత్రల్ని తామే వేసారు . అక్కడా కనక వర్షమే కురిసింది .
ఈ చక్కటి వినోదాత్మక సినిమా యూట్యూబులో ఉంది . ఇద్దరు హీరోల అభిమానులు , ఇద్దరు అందాల భామల అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . 100% entertainment guaranteed . Feel good movie .
జనం మరచిపోయిన సామ్యవాద కేకలు ఉన్న సినిమా . 1958 లో కూడా జగ్గయ్య హీరోగా ఇదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . అదీ ఇలాగే సామ్యవాద వాసనలతో ఉంటుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article