.
శిథిలాల నుండి శిఖరాలకు… అవును… ఆలోచనే జీవితాన్ని మార్చింది
సినిమా హీరో అయిదో పెళ్ళిలో ఆయన నలుగురు మాజీ భార్యల పిల్లలే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించిన అమందానంద కందళిత హృదయారవింద లోకోత్తర వార్తలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు వార్త లోకానికి పెద్దగా అవసరం లేనిది.
Ads
హీరోగారి గారాల ముద్దుపట్టి తెలుగువారికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగపూట ప్రత్యేకంగా ఇంగ్లీషులో అనుగ్రహభాషణం చేసిన చిలకపలుకులతో పోలిస్తే- మున్నూరు నాగరాజు మాటలు వినాల్సినవి కావు.
ఇంగ్లీషులో బాగా పాపులర్ అయిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలను కాపీకొట్టి విజయానికి మూడు “సి”లు, నాలుగు “డి”లు, అయిదు “ఏ”లు లాంటి పడికట్టు పదాలతో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాసి రంపాన పెట్టి కోట్లు వెనకేసుకున్న తెలుగు రచయితలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు పుస్తకం పెద్దగా చదవాల్సిందేమీ కాదు.
నాగరాజెవరో మొన్న మొన్నటివరకు నాకు తెలియదు. ఒకరోజు ఫోన్ చేసి… తనను తాను ఒక పాఠకుడిగా పరిచయం చేసుకున్నాడు. నా వ్యాసాలను చాలాకాలంగా ఫాలో అవుతున్నానని చెప్పాడు. నా అడ్రస్ అడిగి తన అనుభవాలతో రాసిన “ఆలోచన మారితే జీవితం మారుతుంది” పుస్తకం పంపాడు. బహుశా రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడి ఉంటాను.
తన పుస్తకం చదివాక బాగుంటే బాగుందని; బాగాలేకపోతే బాగాలేదని ఒక చిన్న సమీక్ష రాద్దామనుకున్నాను. తీరా చదివాక నాగరాజు ఒక పుస్తకం కాదని; పూటగడవని ఒక నిరుపేద పెద్ద పెద్ద కలలు కని… దీక్షగా వాటిని సాకారం చేసుకున్న విజయగాథ అని తెలిసి పొంగిపొయాను. నాగరాజు ఇప్పుడు కోటీశ్వరుడు. ఎవరైనా నాగరాజులు కావచ్చు- అదే పట్టుదల ఉంటే.
“నేను నిమిత్తమాత్రుడిని. నా అనుభవాలు ఇంకొకరికి ఏమాత్రం ఉపయోగపడినా ధన్యుడిని” అన్న నాగరాజు మాటలు నాకు నచ్చి ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.
తెలంగాణ సదాశివపేటలో లారీ డ్రయివర్ కొడుకు నాగరాజు. వయసు 41 ఏళ్ళు. తండ్రి వెంట లారీ క్లీనర్ గా కూడా తిరిగాడు. తండ్రికి లారీ డ్రయివర్ ఉద్యోగం కూడా పోయాక తల్లి పాచి పనులు చేస్తూ ఇంటిని పొదివి పట్టుకున్నప్పుడు నాగరాజు ముందు ఎన్నెన్నో ప్రశ్నలు మెదిలాయి. ఆ ప్రశ్నల్లో నుండే తనకు తాను వెతుక్కున్న సమాధానమే ప్రస్తుత నాగరాజు విజయగాథ.
ముప్పయ్యేళ్ళుగా ఎన్నో పుస్తక సమీక్షలు రాశాను. కానీ ఈ పుస్తకానికి సమీక్ష ఎలా రాయాలో త్వరగా తేల్చుకోలేకపోయాను.
“నేను మా ఇంటికి పెద్దవాడిని అవ్వడం వలన ఇల్లు ఊడవడం, సర్కారు నల్లా నుండి నీళ్ళు మోయడం, బోరింగ్ పంపు కొట్టి నీళ్ళు పట్టుకుని రావడం, కట్టెల పొయ్యిలో బూడిద ఎత్తిపోసి జాజుతో పొయ్యి అలకడం, పొయ్యిలోకి వంట చెరకు కోసం సర్కారు తుమ్మ ముళ్ళ కట్టెలు కొట్టి నెత్తిన పెట్టుకుని మోసుకొని రావడం, దారెంబడి వెళ్ళే గేదెలు, ఆవుల వెంట వెళ్లి గంపలో పేడ ఎత్తుకొచ్చి పిడకలు చేయడం, రేషన్ డీలర్ వద్ద నుండి రేషన్ బియ్యం, కిరోసిన్ తీసుకు రావడం వంటి పనులన్నీ చేసేవాణ్ణి.
మా ఇంటి నుండి స్కూలుకు వెళ్లే దారిలో మాణిక్ ప్రభు మందిర్, బసవేశ్వర మందిరం, ప్రభుత్వ శాఖా గ్రంథాలయం, ఆ గ్రంథాలయాన్ని ఆనుకునే కన్యకా పరమేశ్వరీ గుడి ఉన్నాయి. మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు రోజూ ఉదయం, సాయంత్రం ఇదే దారెంబడి వెళ్లే వాడిని.
ఇంట్లో మేము తినేది రేషన్ దొడ్డు బియ్యం అన్నం కావడం వలన మంచి భోజనం చేయాలంటే ఈ గుళ్ళలో జరిగే పెళ్ళిళ్ళకు వెళ్లేవాడిని. పెళ్లివారు ఎవరో మనకు తెలియకపోయినా, నేను చిన్న పిల్లాడిని కాబట్టి నన్ను ఎవరూ ఏమీ అనరు అని నా నమ్మకం.
ఒకరోజు కన్యకాపరమేశ్వరీ గుడిలో పెళ్లి జరుగుతుంటే భోజనం చేయడానికి వెళ్ళాను.. అన్నం తిన్న ప్లేటును పాత్రలు కడిగే గచ్చు దగ్గర పెట్టడానికి వెళ్ళాను. అక్కడ ముగ్గురు ఆడవాళ్లు ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నారు. అందులో ఒకరు మా అమ్మ.. పిలవని పెళ్లిళ్లకు, పంక్షన్ లకు వెళ్లి భోజనం చేస్తే ఎప్పుడూ తప్పనిపించలేదు నాకు కాని పెళ్ళిలో ఎంగిలి ప్లేట్లు కడుగుతున్న మా అమ్మను చూసి నా గుండె ముక్కలయ్యింది.
మా అమ్మ వ్యవసాయ కూలీగా పెసర, మినప చేనులో కలుపు తీయడానికి, మిరప చేనులో మిరపకాయలు ఏరడానికి కూలీ పనికి పోతే అప్పుడప్పుడు నేను కూడా వెళ్లేవాణ్ణి. పొలంలో కూలీగా పనిచేస్తే ఎప్పుడూ బాధ అనిపించలేదు కాని మా అమ్మ ఎంగిలి ప్లేట్లు కడిగే పనికి వెళ్తే బాధ కలిగింది.. కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నేను అన్నం తిన్న ప్లేట్ అక్కడ పెట్టేసి గబగబా ఇంటికి వచ్చేశాను..
సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మను పెండ్లిలో గిన్నెలు కడిగే పనికి ఎందుకు వెళ్ళావు అని అడిగాను.. నాన్నకు లారీమీద దెబ్బలు తగలడంతో పనికి పోవడం లేదని, చేను కూలికి పోయి సంపాదించే డబ్బులు ఇల్లు గడవడానికి సరిపోవడం లేదని, ఈరోజు చేను కూలీ పని లేకపోవడంతో పెండ్లిలో గిన్నెలు కడగటానికి వెళ్లానని చెప్పింది అమ్మ..
ఆరోజే మొదటిసారి తెలిసింది సమాజంలో గౌరవంగా బతకాలంటే డబ్బులు సంపాదించాలని. డబ్బు సంపాదించాలంటే బాగా చదువుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇక ఆరోజు నుండి నేనెప్పుడూ పిలవని పెళ్లిళ్లకు వెళ్లి భోజనం చేయలేదు. కానీ సిగ్గు, మొహమాటం, ఎదుటివారు ఏదో అనుకుంటారు అనే లక్షణాలు నాలో లేవని, ఆ లక్షణాలే భవిష్యత్తులో నేను సేల్స్ ఉద్యోగం చేయడానికి ఉపయోగపడతాయని నాకు తెలియదు”…
పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటి అంశం “ఆలోచనకు బీజం పడినరోజు” లో ఈ బడికి వెళ్ళే చిన్న పిల్లవాడు నాగరాజును చూసిన తరువాత గుండె బరువెక్కి పుస్తకం పక్కన పెట్టేశాను. తరువాత కొంత కుదుటపడ్డాక మొత్తం చదివాను.
ఇందులో సగటు కవులు కలలుకనే ఉత్ప్రేక్షలు, ఉపమలు, అతిశయోక్తి అలంకారాలు లేవు. ఆధునిక కవులకు అత్యంత ఇష్టమైన గంభీర ప్రతీకలు లేవు. చివరి అక్షరం ప్రాస పేర్చగల ప్రతివాడూ కవి అనుకుని రాసే అంత్యప్రాసలు లేవు.
తెలుగనుకుని సంస్కృతం నింపే పండిత భాష లేదు. వాక్యంలో కనీసం కర్త కర్మ క్రియ అన్వయం కూడా ఉందో లేదో తెలియకపోయినా రాసి రాచి పాఠకులను రంపాన పెట్టే ఇనుపగుగ్గిళ్ళ భాష లేదు. వర్ణనలు లేవు. సుదీర్ఘసమాసాల్లేవు.
ఉన్నది ఉన్నట్లు సదాశివపేట నేర్పిన భాషలో చెప్పుకున్న సంగతులివి. కన్నీటి అలలు ఈది… పన్నీటి తీరం చేరిన జీవితమిది. పేదరికంలో మునిగి… నిరాశానిస్పృహల్లో కుంగి… తిట్టుకుంటూ చీకట్లలో కూర్చోవడంకంటే… తమను తామే తీర్చి దిద్దుకుని రేపటి వెలుగులవైపు ఎలా పరుగులు తీయాలో;
గుండెకు తగిలిన ఒక్కో దెబ్బను భవిష్యత్ సౌధానికి పునాదిరాయిగా ఎలా మలచుకోవాలో తెలుసుకోవాల్సినవారికి నాగరాజు మాటలు తప్పకుండా ఉపయోగపడతాయి.
(నాగరాజు మున్నూరు ఫోన్ నంబర్-
99489 35484)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article