మ్యూజిక్ షాపు మూర్తి సినిమాలో ఏముందని అసలు..? అనడిగాడు ఓ మిత్రుడు…. నిజమే కదా… ఏముంది అందులో… సగటు తెలుగు కమర్షియల్ సూపర్ హీరోయిక్ ఫార్ములాలోని ఒక్క అంశమూ లేదు… థూ, ఒక బూతు లేదు, ఒక అసభ్య సీన్ లేదు, ఎక్కడా వల్గారిటీ లేదు… ఐటమ్ సాంగ్ లేదు… చివరకు అశ్లీల కామెడీ ట్రాకు కూడా లేదు…
కుర్చీ మడతబెట్టే సాంగ్ లేదు… స్టెప్పుల్లేవు… చివరకు వయోలెన్స్ లేదు, తెర మీద నెత్తురు కారదు… ఇమేజీ బిల్డప్ వేషాల్లేవు… అసలు రౌడీలు చంద్రమండలం మీదకు ఎగిరిపోయే ఫైట్, యాక్షన్ సీన్ ఒక్కటీ లేదు… పైగా తనొక హీరో… కామెడీ, విలన్ వేషాలు అప్పుడప్పుడూ వేసుకునే అజయ్ ఘోష్ అట… హీరో పాత్రకే 53 ఏళ్ల వయస్సు… మెరిసే బట్టతల…
అసలు ఏముందని ఈ సినిమాలో..? అసలు ఇవన్నీ లేకుండా ఏ తమిళుడో, ఏ మలయాళీయో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అని తీస్తే చూస్తాం, మెచ్చుతాం… కానీ తెలుగులో వస్తే నొసలు చిట్లిస్తాం… ఐనా సరే, ఈ దర్శకుడెవరో గానీ, ఈ నిర్మాత ఎవరో గానీ రాజీపడకుండా అలాగే తీశారు… సరే, అజయ్ ఘోష్ నటన తెలిసిందే కాబట్టి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే పాత్రను అలవోకగా పోషించాడు…
Ads
చివరలో ఎమోషన్ కూడా పలికించాడు బరువుగా… ఇలాంటి పాత్రలకు ఇకపై తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈయన్ని ఆలోచించొచ్చు… మొహంలో ఎమోషన్స్ పలకడమే కాదు, డైలాగ్ డిక్షన్ కూడా బాగుంది… నిజానికి ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, పోనీ, ప్రధాన పాత్రను అంగీకరించిన చాందిని చౌదరిని కూడా మెచ్చుకోవాలి… సగటు తెలుగు సినిమా హీరోయిన్లు పోషించే పాత్ర అస్సలు కాదు…
మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపించే పాత్రలు ఇవి… సినిమా టైపు పాత్రలు కావు… చాందిని బాగానే చేసింది కూడా… తోడుగా సీనియర్ నటి ఆమని సరేసరి, పాత ఆమని కనిపించింది… చాందిని ఫాదర్‌గా భానుచందర్ ఎప్పటిలాగే సోసో… కథ విషయానికి వస్తే ఓ మ్యూజిక్ షాపు… ఏవో క్యాసెట్లు అద్దెకిస్తూ, ఫంక్షన్లలో సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటూ మూర్తి ఏదో అలా అలా నెట్టుకొస్తుంటాడు… (ఇప్పుడు అలాంటి షాపులున్నాయా..?)
అది వద్దురా మగడా, ఏదైనా మొబైల్ షాపు పెట్టు, ఈ సంసారాన్ని ఈదలేక నేనొక్కదాన్నే చస్తున్నాను అని పెళ్లాం పోరు… అలవాటైన సంగీతం, వదల్లేడు… డీజే అయిపో, బాగుంటుంది, ఇంకెన్నాళ్లు ఇలా పాత దుకాణం అని వెక్కిరించేవాళ్లు… ఈలోపు తండ్రి కోపంతో విరగ్గొట్టిన డీజే కన్సోల్ బాగుచేయించడానికి ఈ మ్యూజిక్ షాపుకి వచ్చి, ఆయన కోరిక మేరకు తనకు డీజే నేర్పిస్తుంది…
వాళ్ల నడుమ సాన్నిహిత్యం పెరిగి రకరకాల అపోహలు మన్నూమశానం… అదే కథ… అందుకే మొదట్లోనే చెప్పుకున్నట్టు… అసలు ఏమిటండీ ఈ కథ,., అసలు తెలుగు సినిమా కథ రంగు, రుచి, వాసన, చిక్కదనం ఏమైనా ఉన్నాయా ఇందులో… ప్చ్… ఎందుకు తీస్తారో తెలియదు…
ఎవడో ఓ కుర్ర హీరో, నాలుగు కొత్త తుపాకులు, ఆరేడు యాక్షన్ సీన్లు, ఓ ఐటమ్ సాంగ్, నాలుగు స్టెప్పుల పాటలు, ఓ తెల్లతోలు హిందీ పిల్లతో సరసాలు, ఇలా తీసి పడేస్తే దాన్ని తెలుగు సినిమా అంటారు గానీ… ఇది తెలుగు సినిమా అనిపించుకుంటుందా..?! ఇకపై ఇలాంటి సినిమాలు ఎవరూ తీయకుండా నిర్మాతల సంఘం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి… హమ్మా..!!
Share this Article