Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!

November 16, 2026 by M S R

.

కాసేపు టెస్లా కారును ఎఫ్‌ఎస్‌డీ‌తో నడిపించాను… ఆహా.,. మస్క్ అంటే ఏమిటో అర్థమైంది… సింపుల్‌గా చెప్పాాలంటే… ఫాంటసీ కలల్ని కంటారు అందరూ. కానీ మస్క్ ఆ కలల్ని సైతం కళ్ల ముందు ఉంచుతాడు… తన టెస్లా సాధారణ మోడలే ఇలా ఉంటే… ఒక్కసారి ఫుల్లీ ఆటోమేటెడ్ కారును ఊహించండి… గాలిలో ఎగిరే కారును (రోడ్‌స్టర్) ఊహించుకొండి… ఆటో మొబైల్ మాత్రమే కాదు… రేపటి ప్రపంచాన్ని మస్క్ ఇప్పుడే నిర్మిస్తున్నాడు…

అసాధ్యమనిపించే ఆలోచనల్ని తీసుకుని, వాటి కోసం ప్రయోగాలు చేస్తాడు. కొన్నిసార్లు విఫలమవుతాడు. మరికొన్నిసార్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు. అతడి ఆలోచనలకు హద్దులు లేవా అనిపిస్తుంది. అంతరిక్షంలో వందల ఉపగ్రహాలు, అక్కడి నుంచే భూమ్మీదకు కమ్యూనికేషన్ సేవలు, రాకెట్లను తిరిగి భూమిపైకి తీసుకొచ్చి మళ్లీ ప్రయోగించడం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ చిప్ తయారీ వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టెరాఫ్యాబ్! వీటికి తోడు పూర్తిగా డ్రైవర్ అవసరం లేని సైబర్ క్యాబ్!

Ads

ఓసారి ఊహించండి… ఇండియాలో ఓ డొక్కు మారుతి 800 పాత కారు నడిపే వ్యక్తి రేపు సైబర్ క్యాబ్‌లో ప్రయాణించడం కాదు.. ఏకంగా దానికి యజమాని కావడం! నిజానికి అతడు కారు నడపాల్సిన అవసరమే ఉండదు. రండి.. డోర్ పైకి తెరుచుకుంటుంది. లోపల కూర్చోండి. నో గేర్స్.. నో బ్రేక్ పెడల్స్.. నో స్టీరింగ్.. నో టెన్షన్!

జస్ట్ గ్రోక్‌ను పిలిచి మీరు వెళ్లాల్సిన గమ్యస్థానం చెప్పండి. అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. గమ్యస్థానంలో దానంతట అదే పార్క్ చేసుకుంటుంది. మీ పని పూర్తయ్యాక ఫోన్‌లో మళ్లీ పిలిస్తే చాలు.. మీ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇదీ భవిష్యత్తులో పూర్తి స్థాయి స్వయంచాలక ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పే ఊహాచిత్రం…

.

ఇంతకాలం డ్రైవర్ లేకుండా కారు నడవడం అనేది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే దృశ్యం. ఇప్పుడు దాన్ని వాస్తవం చేసేశాడు… తన సైబర్ క్యాబ్‌కు స్టీరింగ్ వీల్ లేదు, సంప్రదాయ డ్రైవర్ కంట్రోల్స్ లేవు. ఇద్దరు ప్రయాణికులు కూర్చునేలా రూపొందించిన ఈ వాహనం పూర్తిగా స్వయంచాలకంగా పనిచేయాలన్నది లక్ష్యం. (13 ఏళ్లపై వయస్సున్నవారికి) 2024లో ఆవిష్కరించిన ఈ కారును ఇప్పుడు కస్టమర్లకు విక్రయించే ప్రక్రియను కూడా టెస్లా ప్రారంభించింది.

నవంబర్ 14న ఎంపిక చేసిన కస్టమర్లకు వ్యక్తిగత వినియోగం కోసం సైబర్ క్యాబ్ ఆర్డర్ చేసే అవకాశం కల్పించింది. ధర 29,990 డాలర్లు. అంటే సంప్రదాయ హైఎండ్ కార్లతో పోలిస్తే కూడా పోటీ పడగల ధరలో డ్రైవర్ లేని కారు అందించాలన్నది మస్క్ ప్రయత్నం. అయితే ప్రారంభంలో కొన్ని ప్రాంతాలకే డెలివరీ, వినియోగం పరిమితం. అమెరికా అంతటా విస్తరించాలన్నది కంపెనీ లక్ష్యం. రాష్ట్రాలవారీగా నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉంటుంది.

cybercab

ఇక్కడో చిన్న మెలిక ఉంది. కారు కొంటే సరిపోదు. దాని పూర్తి స్వయంచాలక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి నెలవారీ ఆటోనమీ సబ్‌స్క్రిప్షన్ కూడా చెల్లించాలి. తొలుత ఈ చార్జీ నెలకు 299 డాలర్లుగా నిర్ణయించారు. అయితే మస్క్ స్వయంగా ఈ ధర ఎక్కువేనని, భవిష్యత్తులో ఇతర టెస్లా వాహనాల్లోని FSD, కనెక్టివిటీ సదుపాయాల ధరకు దగ్గరగా అంటే సుమారు 115 డాలర్లకు తగ్గించాల్సి ఉంటుందని సూచించాడు. అంటే భవిష్యత్తులో కారు కొనడంతో పాటు దాని తెలివితేటల కోసం కూడా నెలనెలా చెల్లించాల్సిన పరిస్థితి!

ఇప్పటికే టెస్లా రోబోటాక్సీ సేవలను అమెరికాలోని పలు నగరాలకు విస్తరిస్తోంది. నవంబర్ 9 నాటికి ఎనిమిది నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ నగరాల విస్తరణ రోబోటాక్సీ సేవలకు సంబంధించినది. కస్టమర్లు సొంతంగా కొనుగోలు చేసే సైబర్ క్యాబ్‌కు మాత్రం ప్రస్తుతం ప్రత్యేక ప్రాంతీయ పరిమితులు ఉన్నాయి. రేపు ఈ సాంకేతికతకు అనుమతులు విస్తృతంగా లభిస్తే, వ్యక్తిగత రవాణా వ్యవస్థే మారిపోవచ్చు.

.

ఇదంతా ఒకవైపు ఉంటే మస్క్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. అదే టెరాఫ్యాబ్. ఏఐ, రోబోటిక్స్, అంతరిక్ష కంప్యూటింగ్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే కోట్ల ఎఐ చిప్స్‌ను తామే తయారు చేసుకోవాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా చేపడుతున్న ఈ భారీ సెమీకండక్టర్ తయారీ వ్యవస్థలో చిప్స్ తయారీతో పాటు ప్యాకేజింగ్, టెస్టింగ్ వంటి ప్రక్రియలన్నీ ఒకే చోట నిర్వహించాలనుకుంటున్నారు.

ఏడాదికి ఒక టెరావాట్ కంప్యూటింగ్ సామర్థ్యానికి సరిపడే చిప్స్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. 2028 మూడో త్రైమాసికం నుంచి భారీ స్థాయి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళిక. ప్రారంభ పెట్టుబడిగా 16.8 బిలియన్ డాలర్లను ప్రకటించారు. భవిష్యత్తులో విస్తరణతో మొత్తం పెట్టుబడి మరింత భారీ స్థాయికి, దాదాపు 120 బిలియన్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి.

spacex

ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక చిప్స్ తయారీలో కొన్ని కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, తమ అవసరాలకు తామే చిప్స్ తయారు చేసుకోవాలన్నది మస్క్ వ్యూహం. భూమ్మీద ఏఐ కంప్యూటర్లకే కాదు.. అంతరిక్షంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కంప్యూటింగ్ వ్యవస్థలకు కూడా చిప్స్ అవసరం. ఆ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టెరాఫ్యాబ్ రూపుదిద్దుకుంటోంది.

ఇక స్టార్‌లింక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భూమ్మీద ఎక్కడైనా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాడు. మారుమూల ప్రాంతాలు, సముద్రాలు, విమానాలు.. ఎక్కడైనా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఒకప్పుడు అంతరిక్షం అంటే ప్రభుత్వాల పరిశోధనలకు మాత్రమే పరిమితమైన రంగం. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు అక్కడ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తున్నాయి. అందులో స్పేస్‌ఎక్స్ పాత్ర కీలకం.

starlink

రాకెట్ల విషయంలోనూ మస్క్ ప్రయోగాలు అసాధారణమైనవే. ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడం ఒక ఎత్తయితే, తాజాగా మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. నవంబర్ 14న స్టార్‌షిప్ పైభాగం అంతరిక్షం నుంచి తిరిగి వచ్చి ప్రయోగ కేంద్రంలోని భారీ యాంత్రిక చేతులకు చిక్కింది. ప్రయోగ టవర్ చేతులతో అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన స్టార్‌షిప్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే దిగువ బూస్టర్ మాత్రం విఫలమైంది. అంటే ప్రయోగం పూర్తిగా విజయవంతం కాకపోయినా, పునర్వినియోగ అంతరిక్ష నౌకల ప్రయాణంలో కీలకమైన సాంకేతిక ముందడుగు పడింది.

ఈ ప్రయోగాలన్నింటినీ విడివిడిగా చూస్తే అవి వేర్వేరు వ్యాపారాలుగా కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే వాటి వెనుక ఒకే పెద్ద ఆలోచన కనిపిస్తుంది. భూమ్మీద రవాణా నుంచి అంతరిక్ష ప్రయాణం వరకు, కమ్యూనికేషన్ నుంచి కంప్యూటింగ్ వరకు, ఏఐ నుంచి రోబోటిక్స్ వరకు.. ప్రతి రంగంలోనూ సొంత సాంకేతిక వ్యవస్థను నిర్మించుకోవాలన్నది మస్క్ వ్యూహం. ఒక రంగంలో సాధించిన విజయం మరో రంగానికి ఉపయోగపడేలా ఈ వ్యవస్థలను అనుసంధానించాలన్నది అతడి ప్రయత్నం.

ఒక విషయం మాత్రం స్పష్టం. ఈరోజు అసాధ్యమని అనిపించే ఆలోచనను రేపటి పరిశోధన అంశంగా మార్చగలడు మస్క్. మనలో చాలామంది భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహిస్తారు. మస్క్ మాత్రం ఆ భవిష్యత్తును నిర్మించే ప్రయత్నంలో ఉంటాడు. అందుకే అతడి కలలు కొన్నిసార్లు ఫాంటసీని కూడా మించిపోతాయి. వాటిలో ఎన్ని నిజమవుతాయో కాలమే చెప్పాలి. కానీ ఆ కలల వెంట ప్రపంచం పరుగెత్తడం మాత్రం మొదలైపోయింది!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…
  • ఈతరం పిల్లలకు మైసూరు ‘కాస్మోస్’ ఎందుకు చూపించాలి..?
  • ఎక్కడ రాకెట్ వదిలాడో, అక్కడే పట్టేసుకున్నాడు… మస్క్, నువ్వు తోపు..!!
  • కింగ్ ఆఫ్ స్లో మోషన్ – ఈ ‘క్రాక్రోయాక్స్’ ఇప్పుడు మేఘనాథుడు..!!
  • సినిమాల ‘నరుకుడు’ రోగానికి సెన్సార్ చికిత్స..! భోగితో స్టార్ట్..?!
  • ‘కుర్చీ’ విలువ – అధికారాంతమున చూడవలె అయ్యవారి అవస్థలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions