Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శరత్‌బాబు అనగానే గుర్తొచ్చేది ఈ సినిమాయే… బాలచందర్ క్లాసికల్ క్రియేషన్…

May 26, 2023 by M S R

Sai Vamshi…..    ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది.. శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో తెలియని అయోమయంతో ఆ సినిమా చూస్తూ ఉంటాం! ముగ్గురికీ జాతీయ అవార్డులు రావాల్సినంత గొప్ప నటన. కానీ రాలేదు. వాళ్లకు ఎప్పటికీ రానేలేదు.

సినిమాలో శరత్‌బాబు, సుజాత భార్యాభర్తలు. వాళ్లకో కూతురు. సుజాత రచయిత్రి. సెన్సార్ బోర్డు సభ్యురాలు. తల్లి లేని, తండ్రి ఎవరో తెలియని 16 ఏళ్ల సరితను చేరదీస్తారు. కూతురిలా చూసుకుంటూ ఉంటారు. ఒకానొక వర్షం కురిసిన మధ్యాహ్నం అనుకోని ప్రమాదంలా శరత్‌బాబు, సరితల మధ్య లైంగిక చర్య జరుగుతుంది. ఆ సమయంలో ఇంటికొచ్చిన సుజాత కంట ఆ విషయం పడుతుంది. సాధారణంగా ఆ క్షణాన ఏం చేయాలి? అరిచి, గోల చేసి, కొట్టి, వీలైతే చంపేసి నానా యాగీ చేయాలి. కానీ సుజాత అదేమీ చేయకుండా మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి తేరుకుని అందర్నీ భోజనానికి పిలుస్తుంది. అసలేమీ జరగనట్టుగా నవ్వుతూ కబుర్లు చెప్తూ భోజనం చేస్తుంది.

తర్వాత పడకటింటికి వస్తుంది. భర్త మంచం మీద పడుకుని బాధపడుతూ ఉంటాడు. ‘ఎందుకు బాధపడతారు? ఏదో తెలియక జరిగిపోయింది. నేను అదంతా అప్పుడే మనసులోంచి తీసి పారేశాను. మీరూ తీసి పారేయండి. అదంతా కలలా మర్చిపోండి’ అంటుంది. మనకు ఆశ్చర్యం! కూతురు లాంటి పిల్లతో భర్త అలా చేస్తే ఈమె ఇంత సింపుల్‌గా తీసుకుంటోంది ఏంటి అని! కాసేపటికి భర్త ఆమె చెయ్యి పట్టుకుంటాడు. సుజాత కోపంతో రగిలిపోతూ చెయ్యి తియ్యమని అంటుంది. సిగ్గు లేదా అని వారిస్తుంది. మరి ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు? మర్చిపోయినన్న మాట? ‘అన్లేదు అనుకున్నాను. నోటి మాటతోనే ఏటికి ఎదురీదిన తృప్తి పొందాను. ఇలాంటి అవస్థల్లో నా నవలల్లోని ఆదర్శ కథానాయకి ఎలా ప్రవర్తించాలని రాస్తానో, నేనూ అలాగే ప్రవర్తించాలని చూశాను. ఇంత వరకూ అలాగే నటించాను. ఇక నా వల్ల కాదు. లోలోపల కుతకుత ఉడికిపోతున్న సగటు ఆడమనసు ఇప్పుడు విశ్వరూపంతో బయటపడింది’ అంటుంది. వాహ్! ఏమి సన్నివేశం ఇది. అది వాస్తవం. అదే సగటు వాస్తవం. నీటిపై నూనెలా తేలాడే వాస్తవం.

Ads

కె.బాలచందర్‌ గారి లాగా Women Charactersని డిజైన్ చేసినవారు భారతదేశంలో మరొకరు లేరేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పైన చెప్పిన సన్నివేశం ఆలోచించాలంటే ఆయనకే సాధ్యపడుతుందనిపిస్తుంది. ఆయన లోపల ఒక స్త్రీ ఉంది. లేకపోతే ఇలాంటి కథలు ఆలోచించడం, రాయడం, తీయడం సాధ్యం కాదు. ఇంత సూక్ష్మంగా స్త్రీ మనసులోని అలజడిని పట్టి చెప్పడం రానేరాదు. పురుషుడిలో స్త్రీ ఉండటం గొప్ప. కళాకారుల్లో కొలువై ఉండటం మరింత గొప్ప!

తెలుగు కథలు గుర్తొస్తున్నాయి. మల్లంపల్లి సాంబశివరావు గారు ‘అయిదో మనిషి’ అనే కథ రాశారు. భర్త, ఇద్దరు కొడుకులు ఉన్న తల్లితో పక్కింటామె ‘పిల్లలు పెద్దోళ్లవుతున్నారుగా! ఇక నీ బాధలు తీరతాయిలే’ అంటుంది. ఆ అమ్మ ఆ క్షణాన ఆకాశం వంక చూసి, ఆపైన తన బిడ్డల వంక చూసి సంతోషపడినట్టు రాయొచ్చు. కానీ కథలో అలా లేదు. ఆమె ఏమన్నదో చుడండి. “అయ్యా చూశాడు ఇక కొడుకులు జూత్తారు. ఇరవై ఎకరాలు సంపాదిచ్చిన ఎంకటరెడ్డినే ఎవరూ‌ సరింగా జూడలా. ఈళ్లు నన్ను సూడకపోయినా ఆళ్ల వరకూ సుకంగా బతికితే అంతే చాలు. నాకు ఒంట్లో ఓపికున్నంత కాలం రెండు గేదెలను పెట్టుకుని బతుకుతా!’ అంది. అదీ మాటంటే! కల్తీ లేని నికార్సయిన మాట. సొంత కష్టం నమ్ముకున్న అమ్మ మాట. లోలోపల స్త్రీ లేకపోతే ఇలా రాయడం కష్టం.

మరో బీభత్సమైన కథ. నాగప్పగారి సుందర్రాజు గారు 1997లో రాసిన కథ. ‘నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద’. చిన్న పిల్ల బోడెక్కని బసివిరాలిని చేసే తంతు జామ్జామ్మని జరిగిపోతోంది. బోడెక్క ఏడుస్తూ ఉన్నా ఎవరికి పట్టింది గాక? ముహూర్తం కాగానే కర్నుము సామి ఆ పిల్ల కాలు తొక్కాడు. బయినే రామన్న దేవర్లు కట్టాడు. అయిపాయె! బోడెక్క బసివిరాలై పాయె! ఆ రోజునుంచి బోడెక్క అందరి సొత్తు. ముఖ్యంగా మగవాళ్ల సొత్తు. ఆ క్షణాన గుంతకంటి మస్తానమ్మ దీర్ఘం తీస్తూ అన్నది కదా – “బోడెక్క ఇంగా పెద్దమనిషి కూడా అయిలేదు కదమ్మా. ఈ పొద్దు బసివిరాలుని ఇడిసేర కదా. ఆ ద్యావుర్లు గట్టిన పూజారాయప్ప, కాలుదొక్కిన కర్నుము సామి, కుంకునుము గట్టిన గొరువయ్య – ముగ్గురు ముసలి నాబట్లు కలిసి, సామి కార్యుమని ఆ పిల్లని ఈ రాతిరికే వొగుడయినంక వొగుడు పక్కులో పొండుబెట్టుకుంటారంట. అన్నిము పున్నెము యెరుగని నడిమింటి బోడెక్కిని బసివిరాల్ని సేసి బజారికి యేసిడిసిరి. పెద్దమనిషి అయ్యేతలకాలే యంతమంది ముట్టుకుంటారో, పాయిము అయిపొయ్యే తలకాల యంతమంది పిల్లల్ని పుట్టిస్తారో, ముసిలిముప్పుతనానికి ఆ బగుమంతుడికే తెలల్ల తల్లోయ్.. తలుసుకుంటేనే బయిమయితాది” అనింది.

నాగప్పగారి సుందర్రాజు గారిలో స్త్రీ.. అందునా అట్టడుగు వర్గాల స్త్రీ లేకపోతే ఈ మాటలు వచ్చేవి కాదేమో! ఆ సహానుభూతి రావడం అంత సులువు కాదేమో! ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది. అవసరమైన క్షణాన బయటపడుతుంది. నిటారున నిలిచి, తన స్థాయి చూపుతుంది. అది కథలో అవ్వొచ్చు. తెరమీద కావొచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…
  • కాళేశ్వరంపై కేసీయార్ క్యాం‘పెయిన్’… ఓ పే-ద్ద కౌంటర్ ప్రొడక్టివ్…
  • ఇక్కడ సుహాసిని- విజయశాంతి… అక్కడ జయప్రద – శ్రీదేవి…
  • బాలీవుడ్‌పై అండర్ వరల్డ్ తుపాకీ నీడ… ఓ దర్శకుడి స్టోరీ ఇది….
  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions