మొత్తం దేశం దృష్టీ అయోధ్య ప్రాణప్రతిష్ఠపైనే ఉంది… చారిత్రక సందర్భం కాబట్టి సహజం… కానీ అదే అయోధ్య ఉద్యమ సేనానుల్లో ఒకడైన ఒక వ్యక్తి బయోపిక్ నిశ్శబ్దంగా రిలీజైపోయింది… బజ్ లేదు, హైప్ లేదు, అసలు అదొకటి రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు… రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడే చిత్రంగా మొదట్లో చెప్పుకోబడిన ఆ సినిమా పేరు మై అటల్ హూ… అవును, అటల్ బిహారీ వాజపేయి బయోపిక్…
19న రిలీజైంది కదా… దీని వసూళ్లు ఎలా ఉన్నాయని చూస్తే, జస్ట్ 4 కోట్లు మాత్రమే… అంత అనామకంగా ఉండిపోయింది ఈ సినిమా… అదీ ఆశ్చర్యమేస్తోంది… ఎక్కడా రైట్ వింగ్ యాక్టివిస్టులో, సానుభూతిపరులో దీన్ని ప్రమోట్ చేస్తున్నారేమో అని పరిశీలిస్తే అదీ లేదు… పైగా దీన్ని కేవలం నార్తరన్ స్టేట్స్‌కు మాత్రమే పరిమితం చేశారు, నిజంగా దేశవ్యాప్తంగా కాస్త ఉపయోగపడాలీ అనుకుంటే బీజేపీ క్యాంపు దీన్ని ఇతర భాషల్లోకి కూడా డబ్ చేసి, పాన్ ఇండియా లెవల్ రిలీజ్ చేసి ఉండాల్సింది కదా… అదీ లేదు…
పోనీ, అల్లాటప్పా టీం కూడా ఏమీ కాదు… ప్రస్తుత నటుల్లో చెప్పుకోదగిన పంకజ్ త్రిపాఠీ ఈ సినిమాలో వాజపేయి పాత్ర బ్రహ్మాండంగా పోషించాడు… వంక పెట్టే పనే లేదు… జాతీయ అవార్డు గ్రహీత రవి జాదవ్ దీనికి దర్శకుడు… ఎస్, సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ ఉన్న మాజీ ప్రధాని వాజపేయి జీవితచరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే… కానీ సరైన స్క్రిప్ట్ వర్క్ జరిగితే సాధ్యమే… 9 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న గాంధీ సినిమా సంగతి తెలుసు కదా…
Ads
నిజమే, వాజపేయి కథలో కొద్దిగానైనా విమర్శనాత్మక ధోరణి లేదు… రాబోయే సమస్యలపై దర్శకనిర్మాతలకు ఏవో సందేహాలు పీడించినట్టున్నయ్… అంతెందుకు అద్వానీతో తన దోస్తీ మీద సరైన చిత్రీకరణ లేదు… పేరుకు కలాం, సుష్మా, ప్రమోద్ మహాజన్ వంటి పాత్రలు ఉన్నా పెద్ద ఎపెక్టివ్ కావు… తన ప్రేమికురాలు రాజకుమారితో సాన్నిహిత్యం మీద కొంతమేరకు బాగానే బ్యాలెన్స్‌డ్ వైఖరి తీసుకున్నా సరే, ఆ మిస్టరీ ప్రేమని సరిగ్గా చెప్పలేకపోయారు, పైగా తన పెంపుడు కుమార్తెకు సంబంధించి కూడా పెద్దగా ఎలాబరేషన్ లేదు…
అంటే… వాజపేయి కథను ఎక్కువ శాతం రాజకీయం కోణంలో మాత్రమే చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు… అఫ్‌కోర్స్, గొప్ప నాయకుడే… కానీ వ్యక్తిగత జీవితం, పెరుగుదల, ఘర్షణలు లేకపోతే బయోపిక్ సంపూర్ణం ఎలా అవుతుంది… ఒక మనిషి అసలైన వ్యక్తిత్వాన్ని పట్టించేవి అవే కదా… నిజానికి ఆర్కైవల్ ఫీడ్ కూడా ఎక్కడా చూపకూడదు… అలా చేస్తే డాక్యుమెంటరీ లుక్ వస్తుంది… అందుకే వీలైనంత వరకూ చెప్పదలుచుకున్న కథాంశాల్ని రీక్రియేట్ చేయాల్సిందే…
కార్గిల్ యుద్ధానికి ముందు ఆయన పాకిస్థాన్‌ను నమ్మి భంగపడిన వైనం సరిగ్గా ఎస్టాబ్లిష్ కానట్టు అనిపించింది… బస్సు యాత్ర ఎట్సెట్రా… ఎంతసేపూ తను సాధించిన విజయాల్ని ఏకరువు పెట్టడానికే దర్శకుడి ప్రయత్నం… పోఖ్రాన్ అణుపరీక్ష, కార్గిల్ విజయం, ఐరాస ప్రసంగం వంటివి… కవిత్వాన్ని బాగా ప్రేమించే ఓ భావుకుడు క్రూరమైన రాజకీయాల్లో ఉన్నత స్థానం దాకా ఎలా వెళ్లగలిగాడు, ఏ పరిస్థితులు తనకు అనుకూలించాయనే అంశాల్లోకి దర్శకుడు లోతుగా వెళ్లలేకపోయాడు…
ఆర్ఎస్ఎస్ కూడా పలుసార్లు వాజపేయి కార్యాచరణ తీరును, ఉదారవాద భావజాలాన్ని వ్యతిరేకించింది… అది కొంత టచ్ చేయగలిగారు సినిమాలో… అయోధ్య ప్రసంగాల ప్రస్తావన ఉంది గానీ ఆ సీన్లలో సీరియస్‌నెస్ లేదు… బీజేపీ బలంగా నమ్మే మెజారిటీవాదంలో వాజపేయి ఎలా ఇమడగలిగాడో చెప్పగలిగితే బాగుండేది… బీజేపీ ఇతర అగ్రనేతలతో పోలిస్తే వాజపేయి వివాదరహితుడిగా ముద్రపడ్డవాడు… సినిమాను కూడా సేఫ్ జోన్‌లో, వివాదరహితంగా ఉంచడానికే వీలైనంత ప్రయత్నం జరిగింది…
గాంధీ అనంతర కాలంలోని దేశ ప్రసిద్ధ రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా వాజపేయి పాత్ర తక్కువేమీ కాదు, కానీ సినిమాలో ఆ చిత్రణ బలంగా లేదు, అందుకే సినిమా పెద్ద పాజిటివ్ మౌత్ టాక్‌కు కూడా నోచుకోలేదు… అలాగని సినిమా బాగాలేదని కాదు… ఇంకా బాగా తీసే అవకాశం ఉంది.., వాజపేయి గురించి మనకు తెలియని కథని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగే ప్రయత్నం ఇంప్రెసివ్‌గా జరగలేదు… అంతే…
Share this Article