అనేక వార్తలు… లక్షల బిల్లులు… కార్పొరేట్ దోపిడీ… సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ, చుట్టుపక్కల అమ్మలక్కల ముచ్చట్లలో గానీ, ఫోన్ల సంభాషణల్లో గానీ…. చుట్టూరా ఇవే వార్తలు డిస్టర్బ్ చేస్తున్నయ్… భయాన్ని పెంచుతున్నయ్… మరీ కొందరు మూర్ఖులు వాట్సపులో వేక్సిన్లు వేసుకుంటే చస్తార్రోయ్ అనే మెసేజులను ఫార్వర్డ్ చేస్తున్నారు… ఏ భయం లేకపోవడం కరోనాను గెలుస్తుందో, ఆ భయాన్నే కృత్రిమంగా ఇంజక్ట్ చేస్తున్నారు అందరూ… ఈ స్థితిలో సోషల్ మీడియాలో వేల మందికి పరిచితుడైన డాక్టర్ విరించి విరివింటి పెట్టిన స్వీయానుభవం పోస్టు ఇంట్రస్టింగుగా ఉండటమే కాదు, సమాజంలోకి పాజిటివిటీని ఇంజక్ట్ చేసేలా ఉంది… అందుకే యథాతథంగా షేర్ చేయాలనిపించింది… ఇదీ…
మిత్రులారా..
పధ్నాలుగు రోజుల హోం క్వారంటైన్ తర్వాత ఈ రోజు బయటకు వచ్చాను.
కరోనా నాకు కూడా దర్శన భాగ్యం కలిగించింది.
ఐతే నాకు జలుబు దగ్గు రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. కారణం వాక్సినేషన్.
నాకు జ్వరమూ వొళ్ళునొప్పులూ వంటివి లేవు. కారణం వాక్సినేషన్.
ఏడవ రోజు పదకొండవ రోజూ inflammatory markers crp,d dimer, ferritin, ldh వంటి టెస్టులు చేయించాను. చేసిన రెండు సార్లూ పూర్తిగా నార్మల్ గా ఉన్నాయి.
అంటే వాక్సినేషన్ వలన కరోనా యాంటీబాడీలు కరోనాని కనీసం నా రక్తం లోకి కూడా రానీయలేదు. కరోనాని కేవలం గొంతువరకే పరిమితం చేశాయి. ఊపిరితిత్తులకు అసలు చేరనే లేదు. కారణం వాక్సినేషన్.
పారాసిటమాల్ రెండు పూటలా ఓ రెండు రోజులు, సిట్రిజిన్ ఒక్కపూట ఓ రెండు రోజులూ వాడాను. అంటే నాకు మందులకు వచ్చిన ఖర్చు ఇరవై రూపాయలు కూడా మించి ఉండదు. కారణం వాక్సినేషన్.
రోజూ పధ్నాలుగు గంటలు పడుకున్నాను. తినడం పడుకోవడం తప్ప వేరే పని చేయలేదు. ఆల్రెడీ ఆన్లైన్ లో ఉండే కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్ కోసం రోజూ మాట్లాడటం సలహాలు ఇవ్వడం తప్ప చేసిన వేరే పనులు లేవు. తగినంత రెస్ట్ తీసుకుంటే శరీరం సులువుగా పుంజుకుంటుంది. అందుకే నాకు అసలు వీక్నెస్ ఎప్పుడూ అనిపించలేదు.
మంచి ఆహారం తీసుకున్నాను. డ్రైఫ్రూట్స్, శనగలతో పెసులతో చేసిన గుగ్గిళ్ళు, సున్నుండలు, ప్రోటినెక్స్ తో పాలు తీసుకున్నాను. మజ్జిగన్నం తిన్నాను రెండు పూటలా. ఇక ఏ విటమిన్లు వాడలేదు. కషాయాలూ, ఆవిరి పట్టడాలూ చేయనేలేదు. ఏ స్టిరాయిడ్లూ..బ్లడ్ థిన్నర్స్ వాడలేదు. కారణం వాక్సినేషన్.
సీటీస్కానూ ఎక్స్ రే ల అవసరం రాలేదు. నాకసలు దగ్గు పెద్దగా వచ్చిందీ లేదు. కారణం వాక్సినేషన్.
చాలామందికి వాక్సినేషన్ చేసే అద్భుతాలు అర్థం కావడం లేదు. గతంలో నేను రాసినది మళ్ళీ చెబుతున్నాను. కరోనా గొంతు వరకు మాత్రమే వ్యాధిని కలిగిస్తుంది. న్యూమోనియా అనేది కరోనా వలన వచ్చే కాంప్లికేషన్. వాక్సినేషన్ అనేది కరోనా వలన కలిగే సకల కాంప్లికేషన్లను అడ్డుకుంటుంది. కరోనాను కేవలం గొంతువరకే కట్టడి చేయగలుగుతుంది. నాతో పాటు కరోనా తెచ్చుకున్న ఎందరో డాక్టర్ మిత్రుల అనుభవమూ ఇదే. ఎవరికీ రెండు రోజుల మించి సింప్టమ్స్ లేవు. Lung involvement (pneumonia) లేదు. Cytokine storm లేదు. కారణం వాళ్ళంతా వాక్సినేషన్ తీసుకుని ఉండటమే.
కాబట్టి కరోనా వాక్సినేషన్ పై అనుమానాలూ అపోహలూ వీడండి.
మీరు నమ్మినా నమ్మకున్నా..సైన్సు కాపాడుతుంది.
సైన్సు మాత్రమే కాపాడుతుంది.
డాక్టర్ విరించి విరివింటి…
Share this Article