,
పరిశోధన: మందు తాగినప్పుడు మటనో లేక కాసింత కారమో తినకపోతే మందు తాగిన తృప్తే ఉండదు. కొందరు పండ్లూ, ఫలాలూ తింటూ తాగుతారాట. ఎబ్బే… అస్సలు బాగోదు. ‘బాగోపోతే తినకో… మరి మాకెందుకు చెబుతున్నట్టో…’ అనుకుంటున్నారు కదా!
బాగుంది సంబడం. మీరేమీ చెప్పక్కర్లేదు. అయితే, అది తిన్నంక కడుపులో మండుతుంది. రేత్రంతా కడుపులో పులుసు మరుగుతున్నట్టు ఉంటుంది. లోపల పొయ్యి ఉంది అని చెప్పడానికా అన్నట్టు నిద్రలో కూడా ఆ పులుసు నోటినుండి, ముక్కునుండి బయటకే వస్తుంది.
Ads
ఇగ ఆ రేత్రంతా కూసోని వేడి నీళ్లు తాగుతూ ఉండడమే. ఇంకా కడుపులో మంట చల్లారకపోతే అటు ఇటు తిరుగుతూ ఉండడమే. మందు బందు చేయమని కొందరు మిత్రులు చెప్పారు. సరే… బందు చేద్దామనే అనుకున్నాను. ఇలా ఎన్నిసార్లు బంజేయలేదని.
మన నిర్ణయాన్ని కొన్ని ప్రకృతి శక్తులు అడ్డుకుంటాయి. అందులో భాగంగా ఇయ్యాల అనుకోకుండా ‘హొలీ’ పండుగ వచ్చింది. కొందరు మిత్రులేమో ధూమ్ ధామ్ చేస్తూ వెక్కిరిస్తున్నారు. “హొలీ నాడు కూడా తాగని బతుకెందుకు లోకంలో” అని సాంగ్ అందుకుంటున్నారు.
అందుకని, నేను దీర్ఘంగా ఆలోచించాను. నాకు రేత్రి మంట అనేది మందు వల్ల వస్తుందా? లేక కారం వల్ల వస్తుందా? అనే ధర్మ సందేహం వచ్చింది. కారం వల్లనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అనిపించింది. అంటే…మందు వల్ల రావడం లేదేమో అనుకున్నాను.
కానీ, నేనేమీ డాక్టర్ ను కాదు కదా!. నాకై నేను వైద్య నిర్ణయం తీసుకుంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒప్పుకోదు కదా!. ‘మరేం చేయాలి?’ అని లోతుగా ఆలోచించాను.
‘మందు బందు’ అనే నిర్ణయాన్ని కాసేపు పక్కన పెట్టి మందు బాటిల్ ముందు పెట్టుకున్నాను. నా నిర్ణయం మెడికల్ అసోసియేషన్ ముందు నిలబడాలంటే నాకు బలమైన ఆధారం ఉండాలి. అందుకు ఒకటే మార్గం ఉంది. ప్రాక్టికల్ గా నిరూపించాలి.
అందుకే బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోశాను. అందులోకి కేవలం పల్లీలు, పిస్తా మాత్రమే తినాలి అని నిర్ణయించుకున్నాను. దీంతో ఈ రాత్రి గనక గడబిడ లేకుంటే నా సూత్రీకరణ నిజం అయినట్టు. ఈ ప్రయోగం వల్ల ఇటు హొలీ పండగ గ్రాండుగా చేసుకున్నట్టూ ఉంటుంది, అటు ఒక వైద్య పరిశోధన చేసినట్టూ ఉంటుంది.
కొన్ని త్యాగాలూ, సాహసాలూ చేయకపోతే సమాజం ముందుకు వెళ్లదు. ప్రతి మనిషీ ఈ సమాజాన్ని అంతో ఇంతో ముందుకు తోయాలి. లేదంటే సమాజమే మనని అవతలికి తోసేస్తుంది. పరిశోధనా ఫలితాలతో మళ్ళీ రేపు కలుద్దాం. ఈ మందు ప్రయోగాలను సభ్య సొసైటీ అలియాస్ పాపిష్టి లోకం తొలుత అంగీకరించకపోవచ్చు, కానీ అంతిమంగా గుర్తించకతప్పదు… హొలీ శుభాకాంక్షలతో…. మీ మిత్రుడు పోలీస్ గోపిరెడ్డి…
Share this Article