ఓ వార్తను సీపీఎం వారి నవతెలంగాణ పత్రిక మరీ కనీకనిపించనట్టుగా… వేద్దామావద్దా అన్నట్టుగా… సర్లె, వేసిచూద్దాంలే అని సాహసించినట్టుగా పబ్లిష్ చేసింది… అదేమిటయ్యా అంటే..? ప్రముఖ వ్యాపారి మైహోం జూపల్లి రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నాడు… ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేస్తున్నారు అనేది ప్రధాన సారాంశం… నిజానికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు రాష్ట్రాల్లో ధనిక సెక్షన్ మాత్రమే బీజేపీకి కావాలి… రాకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ అని బెదిరించగలదు కూడా… బీజేపీకి కార్పొరేట్లే కావాలి… అవును, వాళ్లే కావాలి, వాళ్ల ప్రయోజనాలే కావాలి…
వార్తా కథనంలో చెప్పినట్టుగా… బెంగాల్ టీవీ9 చానెల్ పెడుతున్నారు… ప్యూర్ బీజేపీ ప్రచారం కోసమే… అవును మరి, బీజేపీ వాళ్లు చెప్పగానే ఒక ప్రఖ్యాత మీడియా సంస్థ సాగిలబడడమేనా అంటారా..? భలేవారే… అలా పడేలా చేసుకుంటుంది బీజేపీ…! ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్ వంటి జననేతలే బీజేపీ చెప్పినట్టు నడుచుకోవడం లేదా ఏం..?
Ads
ఇక్కడ సందేహం ఏమిటంటే…? నిజంగానే కేసీయార్‌కు, రామేశ్వరరావుకూ చెడిపోయిందా..? నమ్మొచ్చా..? అసలు కేసీయార్, చినజియ్యర్, రామేశ్వరరావు… వీళ్లు ఒకరికి ఒకరు… తెర వెనుక జరిగే అనేకానేక లావాదేవీలు, యవ్వారాలు, మంతనాలు… అసలు వాళ్లు విడిపోవడం ఏమిటి..?
చంద్రబాబు కావాలని కొందరిని బీజేపీలోకి పంపిస్తే… వాళ్లు టీబీజేపీ (పచ్చ బీజేపీ) అన్నట్టుగా, కాషాయఅంగీ ధరించిన చంద్రబాబులాగే మాట్లాడుతూ ఉంటారు… సో, తెలంగాణలోనూ ఓ టీబీజేపీ..? అనగా గులాబీ బీజేపీ..? మనవాడు ఆ పార్టీలోనూ ఉండాలి… ఉంటే తప్పేముంది..? ఎన్నో రకాలుగా లాభం..? గతంలో కేసీయార్ సన్నిహితుడు విద్యాసాగర్ రావు ఉండేవాడు… అదేనా తాజా ఈక్వేషన్..?
రాజ్యసభ సీటు గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది..? అంతా డబ్బులున్న మారాజుల యవ్వారం అది… ఇచ్చిపుచ్చుకోవడాలు, లావాదేవీలు బోలెడు… అంతటి జగనుడే ముఖేష్ అంబానీ చెప్పగానే ఓ రాజ్యసభ సీటు ఇచ్చేయలేదా..? అదేంటి, ఆయన మన పార్టీలోనే లేడు కదా అన్నారా ఎవరైనా..? అనకూడదు… రాజ్యసభ సీట్ల లెక్కలు అంటేనే వేరు… అవి మామూలు ఎక్కాలకు అందవు… వావ్, బాగుంది… రామేశ్వరరావును సవాల్ చేసి, సై అన్నా పాత టీవీ9 రవిప్రకాష్ బీజేపీ క్యాంపులోనే… వాళ్లకోసమే రాజ్ న్యూస్ నడిపిస్తాడు… మరో రెండోమూడో చానెళ్లనూ రెడీ చేస్తాడు… ఆ రవిప్రకాష్‌ను ఆ టీవీ9 నుంచి శంకరగిరి మాన్యాలు పట్టించిన రామేశ్వరరావు కూడా అదే బీజేపీ క్యాంపులోకి..? ఆయన బీజేపీ కోసమే ఓ చానెల్ రెడీ చేస్తాడు… బాగుంది… ఇప్పటికే వీ6, వెలుగు, రాజ్ న్యూస్ ఎట్సెట్రా… ఇక త్వరలో టీవీ9 ఎట్సెట్రా… కాషాయ మీడియా బలపడుతోందా..? ఐనా ఇదెంత లెండి… టీఆర్ఎస్సే బీజేపీ వైపు వొంగిపోతుంటే…!!
అన్నట్టు రవిప్రకాష్ గురించి తాజా సోషల్ వార్త ఏమిటంటే..?
రవిప్రకాష్ సారధ్యంలో మరో టీవీ చానల్.. ? కొత్త ఛానల్ పేరు ‘FORE SIGHT’. ప్రస్తుతం 6 tv పేరుతో నడుస్తున్న ఛానల్ ను రవిప్రకాష్ తీసుకొని పేరు మార్చుతున్నట్టు సమాచారం! కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ త్వరలో FORE SIGHT ఛానల్ ను ప్రారంభించనున్నారు. రవిప్రకాష్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్టు తెలియవచ్చింది.
Share this Article