Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పనులు చేసి పెడితేనే కదా పది మందీ వచ్చేది :: పీవీ నిర్లిప్తత

March 7, 2025 by M S R

.

Bhandaru Srinivas Rao……. అక్టోబర్ – 31, 1987… ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ ‘ఎరోఫ్లోట్’ లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. విమానంలో వాళ్ళు పెట్టిన భోజనం చూడగానే మాస్కోలో మావంటి శాకాహారులకు ఎదురు కాబోతున్న ప్రధాన సమస్య ఏమిటో అర్ధం అయింది.

మాస్కోలో వెజిటేరియన్లకు ఏమీ దొరకవు ఉప్పూ , పాలూ తప్ప, అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము, లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసుల నిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది.

Ads

ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిధాలుగా చెప్పి చూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంత కూడా అర్ధం కాని ఆ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున ‘సెర్గీ’ అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు…

కారు డోరు తెరిచే వుంచి, ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు, మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టి వుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి.

కారులో వెడుతున్నప్పుడు పీవీ గారు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. ఢిల్లీలో వీసా పనులన్నీ పూర్తయిన తరువాత అప్పుడు కేంద్ర మంత్రిగా అత్యంత ఉన్నత స్థానంలో వున్న పీవీ నరసింహారావు గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం.

కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఇంకెవ్వరూ లేరు.

పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. సందడి ఎందుకు లేదనే నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు… ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా…

‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా వుంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను…

మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీల మాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్లు వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల, పగలో రాత్రో తెలియని అయోమయావస్తలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది.

మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది… జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము.

ఇక రేడియో మాస్కో తెలుగు విభాగంలో నా సహచరులు, ముందు చెప్పిన లిదాతో పాటు, విక్టర్, గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు, నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి తెలియదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటే, పెళ్ళయి పదహారేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions