.
ఆరోజు ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్షణమొక యుగంగా గడిచింది. ముప్పయ్యేళ్ళు గడిచినా ఇంకా ఆ రోజు నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు నేను హిందూపురంలో విలేఖరిని. ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసులో కూర్చోగానే కార్లు, జీపులు ఒకటే హడావుడి. ఒక రాజకీయనాయకుడు, అతడి అనుచరులు రెండొందల మంది వచ్చారు. ఆ రాజకీయనాయకుడు సిగరెట్ వెలిగించి పొగ నా మొహమ్మీదికి వదులుతూ…
“ఏంది! నా మీద ఏందేందో రాసినావు? ఇట్లే ఒకాయప్ప రాస్తే ఆ చేతిని జీపు మీద పెట్టి ఎవురో నరికేసినారు…తెలుసు కదా!” అన్నాడు. అయితే మరికొన్ని క్షణాల్లో నా ఊడిన కుడి చేతిని నా ఎడమచేతిలో పట్టుకుని కింద గ్రవుండ్ ఫ్లోర్లోనే అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి అతుకుపెట్టుకోవడానికి వెళ్ళాలేమో అనుకుని నోట మాట రాక…అలా మౌనంగా ఉండిపోయాను.
Ads
మళ్ళీ నా మొహం మీదికి రింగులు రింగులుగా సిగరెట్ పొగ వదులుతూ “ఏమి చేయాల్నో చెప్పు!” అన్నాడు. తడారిన గొంతులో నుండి అతి కష్టం మీద మాటలు ఏరుకుని, కలుపుకుని…అన్నా! నువ్వేదన్నా వివరణ ఇస్తే రాస్తాను-అని చెప్పాను. “ఏంది! నేను నీకు వివరణ ఇయ్యాలా? నువ్ ఈ ఊళ్ళో ఎట్లుంటావో చూస్తాను…” అంటూ లేచి వెళ్ళిపోయాడు.
అంతే. ఇక నాకు పరామర్శలు మొదలయ్యాయి. కుడి చేయి లేకుండా ఎలా బతుకుతావో? అని ఒక మిత్రుడు కన్నీళ్ళు కారుస్తుంటే అప్పటికే నా కుడి చేయి లేని ఫీలింగ్ తో ఎడమచేత్తో అతడి కన్నీళ్ళు తుడిచాను. మరికొందరు నా శ్రేయోభిలాషులు వచ్చి ఉన్నపళాన ఊరొదిలి ఎక్కడైనా కర్ణాటకలో ఎవరికీ తెలియని మారుమూల పల్లెకు వెళ్ళి తలదాచుకోమని సలహా ఇచ్చారు. మరికొన్ని గంటల్లో నేను లేకుండా పోతానని మరికొందరు సోదాహరణంగా భయపెట్టారు.
“లావొక్కింతయు లేదు…” అని గజేంద్రుడు ఏడుస్తూ అభ్యర్థించినట్లు టెలిఫోన్ బూత్ కు వెళ్ళి అనంతపురంలో నాపై ఉద్యోగి అయిన యాధాటి కాశీపతికి ఫోన్ చేశా. సార్ ఊరొదిలి వెళ్ళనా? ఇక్కడే ఉండి కుడి చేతిని ఇచ్చేయనా? అని అడిగాను. “ఏంపా! ఇట్లయిపోతివి? నా చెయ్ తెగినాకే నీ చెయ్ తెగేది! నాకొదిలేయ్!” అని ఆయన ధైర్యం చెప్పినా… ఇద్దరికీ కుడి చేతులు ఉండవేమో అని భయం రెట్టింపు అయ్యిందే కానీ… తగ్గలేదు.
అర గంట గడిచింది. టెలిఫోన్ బూత్ పక్కన మెడికల్ షాపులో పనిచేసే అబ్బాయి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇందాక వచ్చిన అన్న లైన్లో ఉన్నాడు… బిరీన రాన్నా! అన్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బూత్ లోకి వెళ్ళి…హలో! అన్నాను. బయట వందలమంది నన్ను అదోలా జాలిగా చూస్తున్నారు.
“ఏమి! నేను నిన్నేమన్నా అంటినా? తిడితినా? కొడితినా? దీనికే కాశీపతి సార్ కు చెప్పాల్నా? నేను నీ జోలికి రానుగాక రాను. ఎప్పటిలా కుడి చేత్తో నీ ఇష్టమొచ్చింది రాసుకో! అర్జంటుగా కాశీపతి సార్ కు ఫోన్ చేసి… నేను ఫోన్ చేసి సారీ చెప్పినానని చెప్పు. మళ్ళీ అయిదు నిముషాల్లో ఫోన్ చేస్తాను”- అని పెట్టేశాడు.
వెంటనే కాశీపతి సార్ కు ఫోన్ చేసి- సార్! నా కుడి చేతిని కాపాడారు. ఈ చేయి మీకే అంకితం అని ఉక్కిరిబిక్కిరిగా చెప్పాను. ఇలా ప్రతిసారీ నీ చేతిని, కాళ్ళను, వేళ్ళను ఎవరు కాపాడతారప్పా ? జాగ్రత్త- అన్నారు. నిన్ను ఇదంతా రాయమని వివరాలన్నీ ఇచ్చినవారు కూడా నిన్ను ఓదార్చినవారిలో ఉండి ఉండాలే! అన్నారు. అవును సార్ అన్నాను. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారో కూడా వాడికి తెలుసు. వాళ్ళనెవరు కాపాడతారో! పాపం! అన్నారు.
నిజంగానే అందులో కొందరు కొన్ని నెలలపాటు కర్ణాటకలో ఏవో పనులు పెట్టుకుని…హిందూపురంలో కనిపించేవారు కాదు. ఊరొదిలి వెళ్ళిపోయినవాళ్ళగురించి ఈ లీడర్ పట్టించుకోడని కలియుగ పదహారు కాళ్ళ ధర్మమేదో ఉన్నట్లుంది!
సార్! ఇంతకూ ఆయనకు మీరంటే ఎందుకంత వణుకు? ఈ ట్రేడ్ సీక్రెట్ చెప్తారా? అని అడిగాను ఇక నా కుడి చేతికి వచ్చిన ప్రమాదమేమీ లేదన్న ధీమాతో. అది తెలిస్తే… తట్టుకోలేవ్ లే. నీ పని చూసుకో! అన్నారు నవ్వుతూ. అది నాకు తెలుసని ఆయనకూ తెలుసు. కానీ అది బయటికి చెప్పకూడదు- అంతే.
ఏటా సత్యసాయి జయంతులప్పుడు పుట్టపర్తిలో నాలుగయిదు రోజులు కాశీపతితో కలిసి ఉండేవాడిని. సార్! కుడి చేతిమీద ఎప్పుడైనా పచ్చబొట్టు పొడిపించుకుంటే మీ పేరే రాయించుకోవాలి- అనేవాడిని. ఏంపా! దాని తరువాత ఏ నాయకుడి మీదా రాయడం లేదు? అని సీరియస్ గా అడిగారు. సార్! ఒక్కో వార్తకు ఒక్కో వేలు, కాలు పోతే శరీరంలో ఏ అవయవం మిగిలి ఉంటుంది? అని సీరియస్ గానే నా ప్రాణభయాన్ని వివరించాను.
తరువాత ఒకసారి అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ బయట చెట్టు కింద కాశీపతి- నేను నిలుచుని ఉన్నాం. ఆయన సిగరెట్ వెలిగించారు. ఈలోపు నా కుడి చేయి తీసేస్తానన్న నాయకుడు వచ్చాడు. ఏమిరా! నీ దెబ్బకు మావాడు ఎవరిమీదా రాయడం లేదు! సిగ్గులేదురా నీకు? జర్నలిస్టునే బెదిరిస్తావా? నువ్వెంత? నీ బతుకెంత? పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా? అని దులిపి పారేశారు.
సార్! కావాలంటే అడగండి… నామీద నీ ఇష్టమొచ్చినట్లు రాయి… నేను నీకు ఫోన్ కూడా చేయను… మా వాళ్ళెవరూ నిన్నడగను కూడా అడగరు- అని చెప్పినానో లేదో- అని వినయంగా వివరణ ఇచ్చుకున్నాడు. ఛీ పో! నా కంటి ముందు కనపడినావంటే మర్యాదగా ఉండదు- అని తిట్టారు. అతను భయం భయంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.
సార్! మీకేమిచ్చినా నా రుణం తీరదు- అని కలిసిన ప్రతిసారీ కాశీపతికి కృతజ్ఞత చెప్పేవాడిని. ఏమీ ఇయ్యద్దులేప్పా… విద్వాన్ విశ్వం పెన్నేటి పాట పద్యాలు పాడు… చాలు అనేవారు. నాలుగు పద్యాలు పాడగనే ఏదో లోకంలోకి వెళ్ళిపోయేవారు.
ఆరోజునుండి కుడి చేతిని జాగ్రత్తగా కాపాడుకోవడంలో భాగంగా రాసేప్పుడు నాయకుల గతచరిత్ర తెలుసుకుని రాయడం మొదలుపెట్టాను. తరువాత ఒక మీడియా హెడ్ దయవల్ల శాశ్వతంగా జర్నలిజాన్ని వదిలి… మీడియా వ్యాపారంలో పడ్డాను.
కాశీపతి సార్ ఇప్పుడు లేరు. కానీ ఆయన దయవల్ల మిగిలిన నా కుడిచేయి మాత్రం రాస్తూనే ఉంది. ఆయనకు నేను కుడి భుజం కాలేకపోయాను కానీ… ఆయన మాత్రం నాకు అక్షరాలా కుడిభుజమే అయ్యారు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article