తెలంగాణలో అతి పెద్ద గిరిజన పండుగ మేడారం… అక్కడికి వెళ్లలేదు కేసీయార్… పోతా పోతా అంటడు, పోడు… అదేమంటే ఏ ఎర్రబెల్లి దయాకరుడో ‘సారుకు పడిశం పట్టింది’ అని కవర్ చేసుకోవాలి… లేకపోతే ‘మీ మోడీ రాలేదేమిటోయ్, మా గిరిజనులతో ఉరికిచ్చి తన్నిస్తా, ఆయ్’ అని బీజేపీ వాళ్ల మీద ఎగరాలి… సీఎం పోకపోతే అడగొద్దట, మోడీ రాలేదేంటి అని గిరిజనం బీజేపోళ్లను తన్నాలట..!!. పోనీ, ముఖ్యమంత్రి హోదాలో ఓసారి మోడీని ప్రధాని హోదాలో జాతరకు రండి అని పిలిస్తే ఎలా ఉండేది..? అసలు తనే సమ్మక్కను లైట్ తీసుకున్నడు… తనే దేవుడు కదా, తనకు వేరే దేవుళ్లు ఎలా కనిపిస్తరు..?
సరే, నిన్నమొన్న పడిశం పట్టింది, కొంపదీసి ఒమిక్రాన్ కావచ్చు, జాతరకు పోతే బాగుండదు అనుకున్నాడేమో… మరి వెంటనే తెల్లారేసరికి పడిశం తగ్గిపోయి చలో ముంబై అంటున్నాడు… ఇదేం మిస్టరీ..? దాన్నలా వదిలేస్తే… చిన్న జియ్యర్ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ముగింపు ఉత్సవాలకు ఎందుకు పోలేదు..? ఫాఫం, పదే పదే అదే జియ్యరుడి కాళ్ల మీద పడి, ఆశీస్సులు తీసుకున్న తనే అంత కోపాన్ని ప్రదర్శించడం ఏమిటి..? సరే, మోడీ వస్తున్నాడు కాబట్టి, మోడీకి మోహం చూపించడం ఇష్టం లేదు కాబట్టి, క్యా కేసీయార్‌జీ కైసాహో అని మోడీ పలకరిస్తే ఎక్కడ అపవిత్రం అవుతానో అని భయపడ్డాడు కాబట్టి మోడీ పర్యటనకు దూరమున్నడు అనుకుందాం…, అదేమంటే జ్వరం అన్నడు…
Ads
తెల్లారే జ్వరం మాయం… రాష్ట్రపతి వస్తే ఎయిర్ పోర్టు దాకా వెళ్లగలడు, ముచ్చింతల్ మాత్రం పోడు… నిజంగానే ఆయనకు కోపం వచ్చిందా..? లేదు… లేదనే అంటున్నాడు జియ్యరుడు… కేసీయార్ కోపమొస్తే నీళ్లు కట్టయ్యేవి, కరెంటు కట్టయ్యేది, పోలీసులు వాపస్ వెళ్లిపోయేవాళ్లు, అవన్నీ జరగలేదు కాబట్టి కేసీయార్‌కు కోపమేమీ లేదట… కానీ కేసీయార్ మనసులో ఏదో ఉంది… ఏమిటది..? ఆ మిస్టరీ మాటేమిటి..? నిజంగా కోపం ఉంటే మోడీకన్నా ముందే సతీసమేతంగా వెళ్లి ముచ్చింతల్ దర్శనం ఎందుకు చేసుకుని వస్తాడు..? మరి ఈ ముగింపు ఉత్సవానికి డుమ్మా ఎందుకు కొట్టినట్టు..?
రామనుజ ప్రాజెక్టు… అనగా ముచ్చింతల్ స్మార్ట్ సిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు… కొన్ని వేల కోట్ల ప్రాజెక్టు అది… లోగుట్టు ఏమిటో కేసీయార్‌కే ఎరుక, మైహోం రామేశ్వరుడికే ఎరుక… జియ్యరుడికే ఎరుక… మైహోంకు కేసీయార్ ఆత్మీయుడే, డౌట్ లేదు, కానీ బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో మైహోం పనులూ ఉంటాయి కదా… ఏ లేటరైట్ భూముల ఫైళ్లో, మరో అవసరమో ఉంటయ్ కదా… పర్లేదు, అందరూ కలిసిపోతారు… ఈలోపు ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీలు రాసుకోవచ్చు… జియ్యర్‌కు ఝలక్ అట, యాదాద్రికి పిలవడట, అందుకే సుదర్శనయాగం వాయిదా అట… ఆల్టర్నేట్ చూస్తాడట… హవ్వ, ఒక జియ్యర్ కోసం అంతటి ఘనమైన గుడి ప్రారంభాలు వాయిదా పడాలా..? అది కాదు, ఇంకేదో ఉంది… ఏమిటది..? మిస్టరీ…
కేసీయార్ పదే పదే ఏదైనా చెబితే అది జరగదు, చేయడు… కేసీయార్ ఏ విశ్లేషకుడికీ అంతుపట్టడు, పట్టేలా వ్యవహరించడు… రాత్రి వరకూ ఏదైనా గట్టిగా చెప్పాడు అంటే తెల్లారేసరికి అది మారిపోవచ్చు… ఢాం ఢూం, బీజేపీ అంతు చూస్తా అని మూడేళ్ల క్రితం చంద్రబాబు ఎలా చిందులు తొక్కాడో సేమ్, కాస్త వికృత భాషలో కేసీయార్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ డౌటొచ్చింది… కొంపదీసి మా చంద్రబాబులాగే కేసీయార్ కూడా దారుణంగా దెబ్బతింటాడా అని… కేసీయార్‌ను మోడీ వదిలిపెట్టడు, మనసులో పెట్టుకుని కెలుకుతాడు అంటున్నాడు…
ఇంతగా యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్, మూడో శక్తిగా ప్రత్యామ్నాయ వేదిక అని కలవరిస్తున్నాడు కదా కేసీయార్… స్టాలిన్, మమత, ఠాక్రే, శరద్ పవార్ తదితరులు సరే, మరి జగన్‌ను ఎందుకు వదిలేసినట్టు..? ఈ థర్డ్ ఫ్రంట్‌కు నానా చిక్కులూ ఉన్నాయి… కానీ పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిశోర్‌ను ముందు పెట్టుకుని కేసీయార్ ఆడబోయే ఈ కొత్త రాజకీయం ఏమిటి..? చివరకు ఈ ప్రయాణాన్ని ఎక్కడ ముగించబోతున్నాడు..? అదొక మిస్టరీ..!
అగ్గిపెడతా, గత్తర లేపుతా అంటాడు… ఢిల్లీ పోతాడు, కిక్కుమనడు… పోనీ, రైతుల ధర్నా సందర్భంగా మరణించిన వాళ్లకు పరిహారం అన్నాడు కదా… ఢిల్లీలో మీటింగ్ పెట్టి, ఈ విపక్ష నాయకులందరినీ పిలిచి, చెక్కుల పంపిణీ ప్రోగ్రాం పెట్టొచ్చు కదా… పనికిమాలినోడు మోడీ అని తిట్టాడు కదా… పోనీ, ఢిల్లీలో కనీసం జాతీయ మీడియాతో ఓసారి మీడియా మీట్ పెట్టొచ్చు కదా… హైదరాబాద్ జర్నలిస్టుల మీద ఎగిరినట్టు కాదుగా, పెట్టడు… సో, ఈ జ్వరాలు, ఈ గుడి యాగం వాయిదాలు, ఈ పడిశం పట్టడాలు అన్నీ మిస్టరీలే… అంత వీజీగా సమజైతే తను కేసీయార్ ఎందుకు అవుతాడు..?!
చివరగా :: కేసీయార్ ఉడుక్కోవడం వెనుక రీజన్స్ ఏమైనా సరే, బీజేపీ ఎంచక్కా వాడుకుంటోంది… రామానుజుడి ప్రోగ్రాం పూర్తిగా బీజేపీ క్రెడిట్‌లోకి వెళ్లింది ప్రస్తుతానికి, మేడారానికి గవర్నర్, ఒకరిద్దరు కేంద్ర మంత్రులు వెళ్లి కేసీయార్ వైపు అందరూ వేలెత్తి చూపేలా చేశారు… అంతే మరి… కేసీయార్ అలిగితే ఏదైనా ఆగుతుందా..? లేదు… ఎవరో ఒకరు అందుకుంటారుగా…!! ఏమో… మార్చి పది తరువాత ఇంకేదైనా జరగొచ్చు కూడా…!!
Share this Article