.
Subramanyam Dogiparthi
…… మగోడన్నాక పెళ్ళాం కావాలి కదా ! అందరికీ పెళ్ళాం కావాలి . ఇవన్నీ విభిన్న ఆలోచనాపరుల పొలి కేకలు . నాకూ పెళ్లాం కావాలి అనే ఈ సినిమాకు స్టోరీ నేసిన యంవియస్ హరనాధరావుకు , స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన విజయ బాపినీడు గారి ఆలోచన పూర్తి వినోదాత్మకం , సరదాత్మకం .
ఓ ఊళ్ళో బుల్లెబ్బాయి (నూతన్ ప్రసాద్) గారికి వాలీ సుగ్రీవుల్లాగా ప్రతీ క్షణం కొట్టుకునే ఇద్దరు కొడుకులు ఉంటారు . పెద్దోడు చంద్రమోహన్ , చిన్నోడు రాజేంద్రప్రసాద్ . పెద్దోడిని చిన్నోడు చెవికాడ అని పిలుస్తుంటాడు . చిన్నోడిని పెద్దోడు నత్తోడు అంటుంటాడు .
చిన్నోడికి క పలకదు . మనమంతా నాకూ పెళ్ళాం కావాలి అంటాం . చిన్నోడు నాతూ పెళ్ళాం తావాలని అంటుంటాడు . దగ్గర గ్రామంలో ఒకరింటికి పెద్దోడిని పెళ్ళిచూపులకు పంపుతాడు తండ్రి . మార్గమధ్యంలో ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించేస్తాడు .
Ads
పెళ్ళిచూపుల్లో ఆ అమ్మాయే కనిపించడంతో ఎగిరి గంతేస్తాడు . ఆ అమ్మాయి కూడా ఆనందపడుతుంది . ఇంతలోనే వాళ్ళింటికి రావలసిన పెళ్ళికొడుకు అతను కాదని తెలవగానే అమ్మాయి అన్న పెద్దోడిని మర్యాదగా వెళ్ళిపొమ్మని హుకుం జారీ చేస్తాడు . అయినా పెద్దోడు , ఆ అమ్మాయి తమ ప్రేమను కొనసాగిస్తూనే ఉంటారు . ప్రేమంటే అంతే కదా !
అనూహ్య పరిణామాలతో ముందు మిస్సయిన అమ్మాయికి మాట పడిపోవడం , అయినా పెళ్ళికి బుల్లెబ్బాయి అంగీకరించడంతో పెద్దోడి లవ్ ట్రాక్ గడ్డు పరిస్థితిలో పడిపోతుంది . చిన్నోడు వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని సానుభూతి వచ్చేలా చేస్తాడు . గడ్డి మీద పడుకొన్న పెద్దోడికి తుమ్మొచ్చి అంతా ఖరాబు అవుతుంది . ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకోవటానికి ముగ్గురు పెద్దలు అంగీకరించడంతో అక్కడికక్కడే కండువాలు కూడా మార్చుకోవటంతో శుభం కార్డ్ పడుతుంది .
ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . కోట శ్రీనివాసరావు సోదరులు Sankara Rao Kota , కోట నరసింహారావులు తొలిసారిగా వెండి తెరపై పరిచయం చేయబడ్డారు . శంకరరావు గారు అప్పటికే సీనియర్ రంగస్థల నటుడు కావడం వలన సినిమా నటన ఆయనకు కొట్టిన పిండే అయింది . బాగా నటించారు .
భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ మొదటిసారిగా ఈ సినిమాలో వాళ్ళ అక్క నవ్వుతో సహా తళుక్కుమంటుంది . టైటిల్సులో మాత్రం నిషాంతి అనే పేరు వేయబడుతుంది . అలాగే పాటల రచయిత భువనచంద్రకు ఇదే మొదటి సినిమా . అలాగే అశోక్ కుమార్ కూడా . ఇదే మొదటి సినిమాయేమో !
సినిమా చూస్తుంటే విజయ బాపినీడు సినిమా అని అనిపించదు .దర్శకుడు వంశీ అనో జంధ్యాల అనో అని అనిపిస్తుంది . విజయ బాపినీడుకు కూడా హాస్యరస చిత్రాలు ఉన్నా ఈ చిత్రం మాత్రం వంశీ , జంధ్యాల వంటి దర్శకుల మార్క్ కనిపిస్తుంది .
ఈ సినిమాలో ఒక తపేళోపాఖ్యానం ఉంది . ఓ బుడ్డోడి తల తపేళాలో ఇరుక్కుంటుంది . ఆ తపేళాని ఓ శేఠుకి రాజేంద్రప్రసాద్ తాకట్టు పెట్టటం ప్రేక్షకులు నవ్వలేక చస్తారు . ఇలాంటి అవుడియాలు వంశీ , జంధ్యాల , తర్వాత కాలంలో ఇవివి వంటి వారి పేటెంట్ . అలాంటిది విజయ బాపినీడు వాడటం ఆసక్తికరమే .
వాసూరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . ఎవ్వడో అతడెవ్వడో ఒకడొస్తాడు అనే పాట హీరోయిన్ కల్పనపై చిత్రీకరణ బాగుంటుంది . చిలకా చిలకా , పుత్తడి బొమ్మా అంటూ సాగే డ్యూయెట్లు కూడా శ్రావ్యంగా ఉంటాయి .మన తెలుగు సినిమాకు మాతృక ఆనె పావం అనే టైటిలుతో 1985 లో వచ్చిన తమిళ సినిమా . ఆ తర్వాత కాలంలో కన్నడంలోకి కూడా రీమేక్ అయింది . తమిళంలో పాండియన్ , రేవతి , సీత నటించారు .
మరో విశేషం ఏమిటంటే నూతన్ ప్రసాద్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం . ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , అశోక్ కుమార్ , రమణమూర్తి , ప్రభృతులు నటించారు . కమర్సిషియల్గా కూడా సక్సస్ అయిన మన తెలుగు సినిమా యూట్యూబులో ఉంది .
హాస్య రస చిత్రాలను , వినోదాత్మక చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా కూడా బాగా నచ్చుతుంది . పైగా కల్పన , శాంతిప్రియ ఇద్దరు అందమైన హీరోయిన్లు కూడా ఉన్నారు . A complete family , comedy , feel good entertainer . #తెలుగు సినిమాల సింహావలోకనం #సినిమా కబుర్లు #తెలుగు సినిమాలు #సినిమా స్కూల్
Share this Article