అవార్డులు వచ్చాయంటే డబ్బులు వచ్చి ఉండవు . డబ్బులు వచ్చాయంటే అవార్డులు వచ్చి ఉండవు . అవార్డులు డబ్బులు ప్రాప్తం ఉన్న నిర్మాతలు , పేరు తెచ్చుకున్న దర్శకులు కొద్ది మందే ఉంటారు . 1978 లో వచ్చిన ఈ నాలాగా ఎందరో సినిమా మొదటి కోవకు చెందింది . మూడు అవార్డులు వచ్చాయి . బాలసుబ్రమణ్యానికి మొట్టమొదటి నంది అవార్డు ఈ సినిమా ద్వారానే వచ్చింది . ఆ తర్వాత కుప్పలుకుప్పలు వచ్చాయనుకోండి . ఉత్తమ చిత్రంగా నిర్మాతలకు బంగారు నంది వచ్చింది . ఉత్తమ నటుడు అవార్డు హేమసుందర్ కు వచ్చింది .
యాభై ఏళ్ల కింద మధ్య తరగతి కుటుంబాలలోని యువతుల పెళ్లి చూపులు , కట్నకానుకలు వంటి సామాజిక రుగ్మతలకు బలయిపోయిన ఓ రూప కధ . సందేశాలనయితే ఏమీ ఇవ్వలేదు కానీ , మనసున్న ప్రేక్షక మహాశయులను ఆలోచింప చేసిన సినిమా . పెళ్ళిచూపుల్లో వరసలు కలిపి , పెళ్ళి ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందని అబ్బాయి వైపు వారు అమ్మాయిని ఊహల లోకంలోకి తోయటం , అబ్బాయి వైపు వాళ్ళు చావు కబురు చల్లగా చేర్చేయటం , మళ్ళా పెళ్ళిచూపులు , అదే సైకిల్ పునరావృతం కావటం యాభై ఏళ్ళ కింద సగటు అమ్మాయిల చెప్పుకోలేని వ్యధ .
ఇలాంటి పెళ్ళిచూపులు మానసిక వ్యభిచారం కాదా అని సినిమా చివర్లో దర్శకుడు ప్రేక్షకులను ఆలోచించమని అడుగుతాడు . ఒక ప్రేక్షకునిగా ఈ ప్రశ్న 46 ఏళ్ల నుండి నా మెదడులో ఉంది . అదృష్టవశాత్తూ కాలం మారింది . ఆరోజుల్లో ఉండే హేయమైన పెళ్ళిచూపుల దరిద్రం చాలావరకు పోయింది . యువతులకు సామాజిక గౌరవం పెరిగింది .
Ads
సహజీవనాలు, ఒంటరిజీవితాలు, ప్రేమవివాహాలు సాధారణమైపోయిన ఈ కాలంలోని ఈతరం యువతుల్లో చాలామందికి ఈ జాఢ్యం ప్రభావం గురించి తెలియదు . ఈ సినిమా చూస్తే దర్శకుడు ఆనాడు సంధించిన ప్రశ్న అర్థం అవుతుంది . ఈ కధను , ఈ సినిమాలోని మాటలను తయారు చేసిన గణేష్ పాత్రోని తప్పక అభినందించాలి . దర్శకుడు ఈరంకి శర్మను , డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాత రంజిత్ కుమార్ని ప్రత్యేకంగా అభినందించాలి .
ఈ సినిమాలో కట్టుబాట్ల చట్రంలో తమను తామే కట్టేసుకునే యువతులతో పాటు , వాటిని ఛేధించి ధైర్యంగా తమ అభిమతాలకు పెద్ద పీట వేసే సాహస యువతులూ కనిపిస్తారు . ఆడవారిని శృంగార వస్తువుగా చూసే యువకులు , ఆడవారిలో అమ్మవార్లను చూసే యువకులూ ఉన్నారు .
ఈ సినిమాలో హీరోయిన్ కల్యాణి పాత్రను రూప పోషించింది . బహుశా తెలుగులో మొదటి సినిమా అనుకుంటా . తెలుగు నాట పరిచయం అక్కరలేని స్టేజి , సినీ ఆర్టిస్ట్ కల్యాణం (ఈల పాట) రఘురామయ్య కుమార్తె ఈ రూప . ఈమె తల్లి లక్ష్మీ దేవి కూడా కన్నడ సినిమా రంగంలో పాపులర్ నటి . ఈ సినిమాలో రూప నటన చాలా బాగుంటుంది .
వీణ విద్వాంసునిగా , పక్షవాతం వచ్చి కూతుళ్ళ పెళ్ళిళ్ళలకు ఆవసరమయిన డబ్బూ దస్కం ఏర్పాటు చేయలేని నిస్సహాయుడిగా , శంకరాభరణం శంకరశాస్త్రి లాగా కావలసినంత ఆభిజాత్యం కలపోసిన రూప తండ్రి పాత్రను హేమసుందర్ అద్భుతంగా పోషించారు . ముఖ్యంగా ఆయన డిక్షన్ పాత కాలం నటుల్లాగా చాలా బాగుంటుంది . ఈ సినిమాలో ఆయన నటనకు అవార్డు కూడా వచ్చింది .
మరో గొప్ప పాత్ర నారాయణ రావు వేసిన ప్రభాకర్ పాత్ర . గుడ్డివాడిగా , రూపని ఆరాధించే సైలెంట్ ప్రేమికుడిగా , తన గుడ్డితనాన్ని ఎత్తి చూపటంతో అవమానంగా భావించి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు . చక్కని పాత్ర , తగ్గట్టుగా నటన . ఇతర పాత్రల్లో లక్ష్మీకాంత్ , పి యల్ నారాయణ , పల్లవి , డబ్బింగ్ జానకి (అప్పటికి ఇంకా డబ్బింగ్ లోకి రాలేదనుకుంటా) , సీతాలత , పెళ్ళికొడుకుల పాత్రల్లో జూనియర్ ఆర్టిస్టులు చాలామంది నటించారు .
ఈ సినిమాలో మరీ మరీ మెచ్చుకోవలసింది యం యస్ విశ్వనాధన్ సంగీత దర్శకత్వం . ఆత్రేయ గారి పాటలను బాల సుబ్రమణ్యం , సుశీలమ్మ పామరులు కూడా పరవశించి పోయేలాగా ఉంటాయి . అనుభవాలకు ఆది కావ్యం అడదాని జీవితం పాట . ఈ పాటకే బాలసుబ్రమణ్యానికి మొట్టమొదటి నంది అవార్డు వచ్చింది . మరో పాట కల్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని ఎంత శ్రావ్యంగా ఉంటుందో చెప్పలేను . బహుశా ఇదేమయినా కల్యాణి రాగంలో ఉందేమో పండితులు చెప్పాలి . మిగిలిన రెండు పాటలు కూడా థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి .
వీణ విద్వాంసులకు , సంగీత ప్రియులకు , రస హృదయులకు , ఆలోచించే ప్రవృత్తి ఉన్న మనసున్న మారాజులకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది . ఇంత ఆలోచనాత్మక సినిమాను తీసిన నిర్మాత రంజిత్ కుమార్ అభినందనీయులు . 46 ఏళ్ల కింద చూసినా ఈ సినిమాలోని కధాంశం నన్ను వెంబడిస్తూనే ఉంది . సినిమా యూట్యూబులో ఉంది . పాటల వీడియాలు కూడా ఉన్నాయి . ముఖ్యంగా నేను పేర్కొన్న రెండు పాటల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి . A thought provoking , emotional , tragic and watchable movie #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article