సింపుల్ ప్రశ్న… మక్కీకిమక్కీ అంటే… ఓ జిరాక్సు కాపీలా… ఓ కట్ అండ్ పేస్ట్ ప్రక్రియలా… వేరే భాష సినిమాను రీమేక్ చేస్తే… అసలు ఆ రీమేక్ ఎందుకు..? డబ్బింగ్ బెటర్ కదా..! మనం ఎన్ని తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్‌ను ఆస్వాదించలేదు గనుక..! పల్లెల్లో అగ్రవర్ణాల వివక్షపై, ఓ నిమ్నవర్ణుడి తిరుగుబాటుపై, ప్రతీకారంపై అద్భుతంగా ఎమోషన్స్ పలికించిన ఆ అసురన్ సినిమానే డబ్ చేస్తే సరిపోయేదిగా..! నిజానికి ఓటీటీయే కాబట్టి అదీ అక్కర్లేదు… చాలామంది అసురన్ తమిళ సినిమానే ఓటీటీలో ఆ సబ్ టైటిల్స్‌తోనే చూసేశారు… చప్పట్లు కొట్టేశారు… కానీ ఏదో ఓ శాటిలైట్ కోసం డబ్బింగ్ చేయించి ఉంటే సరిపోయేది… అదే ధనుష్ ఓ రేంజ్ నటన… అదిరిపోయేది కదా… పైగా సూర్య, కార్తి, కమల్, రజినీ వంటి హీరోల్లాగే ధనుష్ కూడా మన హీరో ఎప్పుడో అయిపోయాడు, తెలియని హీరో అనే ఫీల్ కూడా ఉండేది కాదుగా… ఫాఫం, వెంకటేష్ బాబు గారిని ఇంత కష్టపెట్టడం అవసరమా..? ఆమాత్రం దానికి థియేటర్లా, ఓటీటీయా అంటూ రచ్చ, ఇంత జాప్యం… అక్కడికి ఓటీటీ రిలీజ్ అంటే అదేదో ఇజ్జత్ పోయే వ్యవహారం అన్నట్టుగా ఫీలింగు…
‘‘రీమేకు కథతో రిస్క్ ఎక్కువ… మంచి క్లాసిక్ కెలకొద్దు… నాలోని మాస్ కోణం చూస్తారు…’’ ఇలా మస్తు మాట్లాడిండు ఈ దర్శకుడు అడ్డాల శ్రీకాంత్… ఇందులో నీ దర్శకత్వ ప్రతిభ ఏముంది..? యాజ్‌ఇట్‌ఈజ్‌గా దింపడమే కదా… నిజానికి ఈ సినిమాకు శాపం ఈ శ్రీకాంతే… కానీ వేరేరకంగా… సినిమాలో మాటల రచయిత తనే… అసురన్ సినిమాలో తిరునల్వేలి ప్రాంత యాసను ఆ విరుపు, ఆ ఒరిజినాలిటీ దెబ్బతినకుండా వాడుకున్నారు, అలాగే బొట్టు పెట్టుకునే దళితులు కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తారు అని ఓ తమిళ మిత్రుడు చెబుతున్నాడు… కానీ ఈ సినిమాకు వచ్చేసరికి కాసేపు అనంతపురం రూరల్, ఇంకాసేపు చిత్తూరు రూరల్ యాసను తీసుకుని, ఆ మాటలు ఇక చేతకాక… మళ్లీ కాసేపు మామూలు సినిమా భాష పదాలు చేర్చి… మళ్లీ ఇంకేదో భాషాపదాలు కలిపి… ‘‘చిత్రవధ’’ చేశాడు… ఒక్కసారి ఊహించండి… తెలంగాణ గట్కను, రాయలసీమ సంకటిని, కోస్తా ఉప్మాను ఒక్కచోట కసాపిసా కలిపేస్తే ఎలా ఉంటుంది… సినిమా హీరోయిన్ ప్రియమణికి రాసిన మాటలు మరీ ఘోరం…
Ads
అసలు రీమేక్ అంటే… మన నటులతో యథాతథంగా మన భాషలోకి దింపుకోవడమా..? తమిళ సినిమాలో మొహాల్ని కత్తిరించి, మన మొహాల్ని అతికించుకోవడమా..? ఆ కథ మూలాన్ని తీసుకోవాలి… నిజానికి అసురన్ సినిమాకు మూలకథ పూమన్ రాసిన వెక్కై… అంటే వేడి… సెగ… దాన్ని ఏదేని తెలుగు ప్రాంతంతో నేటివైజ్ చేసుకోవాలి… ఈ నారప్ప సినిమాలో అనంతపురం నేపథ్యాన్ని తీసుకున్నారు… ప్చ్, ఏ కారంచేడో, ఏ చుండూరో గుర్తొచ్చే ప్రాంతాల్ని నేపథ్యాలుగా తీసుకుంటే బాగుండు..! అసలు కులవివక్ష లేని ప్రాంతమేది..? అన్నట్టు కులవివక్ష అంటే గుర్తొచ్చింది… అదేమిటో గానీ అసురన్ చూస్తుంటే కులవివక్ష, ఆధిపత్యధోరణులు గట్రా మనల్ని తాకుతూ వెక్కై (వేడి) ఫీలవుతాం… కానీ నారప్పలో ఆ ప్రధానమైన ఫీల్ లేదు… ఓ పేదవాడి భూమి, ఓ పెద్దవాడు కాజేసే ప్రయత్నం, మధ్యలో కంచె గొడవలు, ఆవేశాలకు గురయ్యే హీరో కొడుకు, స్పందించి చంపేసే విలన్ కొడుకు, పగ, ప్రతీకారం కథే కనిపిస్తుంది ఎక్కువగా… యంగ్ పాత్రలో వెంకీ, తన లవ్వు అస్సలు సూట్ కాలేదప్పా…
గతంలో అయితే ఏదో భాషలో హిట్టయిన సినిమా రైట్స్ తెచ్చుకుని, మనకు తగినట్టు రీమేక్ చేసుకుంటే సరిపోయేది… అసలు ఒరిజినల్ ఏమిటో కూడా తెలిసేది కాదు… కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఒరిజినల్ సినిమాల్ని ఆ భాష రాకపోయినా సరే, సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు… వాటి రివ్యూలు కూడా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నయ్… ఇక వాటి రీమేకులంటే కచ్చితంగా పోలిక తప్పదు, తేడాల గురించీ రాసేస్తారు… అందుకని బొచ్చెడు తెలుగు కథలు దొరుకుతయ్… తీయొచ్చుగా… తీయరు, ఎందుకంటే రిస్క్… ఆల్‌రెడీ హిట్టయిన సినిమా దొరికితే రీమేక్ చుట్టేస్తే రిస్క్ ఉండదు కదా అనే సేఫ్టీ ఫీలింగు… కానీ కాపీ ఎప్పుడూ కాపీయే… ఒరిజినల్ ఒరిజినలే…
అసురన్‌తో పోల్చకుండా, ఆ సినిమా చూడకుండా, నారప్పను చూసి విశ్లేషించుకున్నా సరే, మరీ మనసుల్ని పట్టేసే, మదికి కట్టేసే సినిమా ఏమీ కాదు… జస్ట్, వోకే… యథాతథంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దింపడానికి మణిశర్మ వంటి ఘనాపాఠీ ఎందుకో అర్థం కాదు, ఆ పాటలూ ఎవరికీ అర్థమయ్యేలా లేవు… సినిమాలో కాస్త బాగున్నది కెమెరా వర్కే… హింస ఎక్కువ… ఎక్కువ నెత్తురు కనిపిస్తే ఎక్కువ యాక్షన్ అనే భ్రమల్లో ఉన్నట్టున్నాడు దర్శకుడు పాపం… హీరో పెద్ద కొడుకు మణికన్నా పాత్ర మరో మైనస్… చిన్న కొడుకు సిన్నప్ప పాత్రధారి ఎక్కువ మార్కులు కొట్టేశాడు… ప్రియమణి సోసో… అసురన్ సినిమాలో మంజు వారియర్‌తోపాటు మరో ఫిమేల్ లీడ్ పాత్రకు సాయిపల్లవిని తీసుకున్నారు మొదట్లో… తరువాత తీసేసి అభిరామిని తీసుకున్నారు… ఈ నారప్పలో కూడా ఆమే… పర్లేదు… ఇంకా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదప్పా..!!
Share this Article