నాగబాబు సొంత యూట్యూబ్ షో ‘ఖుషీఖుషీగా’ ప్రోగ్రాంలో బూతు ధారాళంగా ప్రవహించడం మీద నెటిజనం విమర్శించింది… బుల్లితెర మీద బూతును ఆయన మరో లెవల్‌కు తీసుకుపోయాడనేది విమర్శ… దానికి నాగబాబు ప్రతిస్పందన నిజంగా ఓ ‘‘స్టాండప్ కామెడీ’యే… హహహ… సేమ్, ఎంఎస్ రాజు తమ్ముడే అన్నట్టుగా… తన టేస్టుకు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే… తను ఏమంటాడంటే..?
‘‘ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకున్నదాన్ని మించిన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. ప్రపంచం ముందుకెళ్తుంటే ప్రతి పనికిమాలిన సన్నాసి ఇలాంటి మాటలే మాట్లాడతాడు కాబట్టి వాళ్లను అస్సలు లెక్కలోకే తీసుకోము. ప్రపంచ దేశాలతో పాటు హిందీ, తమిళ్లో ఎంతో ఫేమస్ స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలి, చాలామంది కమెడియన్స్‌ని వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే ఈ షో ప్లాన్ చేశాము…
Ads
స్టాండప్ కామెడీ అంటే.. మీరు చూసే రెగ్యులర్ జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ కాదిది. ప్రత్యేకమైన టాలెంట్ ఉంటేనే చేయగలిగే కామెడీ… ఓ వ్యక్తి తన సొంత అనుభవాలను జొప్పిస్తూ చేసే కామెడీ ఇది… అయితే ఇందులో కొన్నిసార్లు వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి బూతుమాటలు రావొచ్చు… అలాగని వారిని తప్పుబట్టొద్దు… వారికి స్వేచ్ఛ ఇవ్వాలి… ఇందులో రిస్ట్రిక్షన్స్ ఉండవు…
ముఖ్యంగా ఈ స్టాండప్ కామెడీని 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తుల కోసం రూపొందిస్తున్నాం. పైగా యూట్యూబ్‌లో అందిస్తున్నాం కాబట్టి చూడాలా చూడకూడదా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఈ కామెడీలో ఓ ఫ్లో ఉంటుంది. ఇది సరిహద్దులు లేకుండా చేసే కామెడీ. అంత ఇబ్బందిగా అనిపిస్తే చూడకండి. అంతేగానీ చూసి చెడు కామెంట్స్ వద్దు. మరీ వల్గారిటీ ఉంటే మేమే కట్ చేస్తాం…
చాలామంది మహానుభావులు, పవిత్రమైన వ్యక్తులు ఇలాంటి షో చేయకూడదు ఇబ్బందిగా ఉందని నాతో అంటున్నారు. వాళ్ళందిరికీ నా మనవి ఒక్కటే.. మనకు చాగంటి చాగంటి కోటేశ్వర్ రావు, గరికపాటి నరసింహా రావు గారు, చినజీయర్ స్వామి లాంటి గొప్ప వ్యక్తులు మంచి మంచి ప్రవచనాలు చెబుతుంటారు. నేను కూడా వాటిని చూస్తుంటా. ఎవరైతే బాగా ఫీల్ అవుతున్నారో అలాంటివి మాత్రమే చూడండి”
ఇదీ సారు గారి ప్రతిస్పందన… ఓహ్… ప్రపంచం ఇలా ముందుకెళ్తోందా..? అబ్బో… నీ షో చూసి బాగాలేదు గురూ అని అభిప్రాయం చెబితే వాళ్లు పనికిమాలిన సన్నాసులా… అందరూ నీ గొప్ప టేస్టు చూసి, నీ అదిరింది టీం సభ్యుల్లాగే హిహిహి, బాగుంది బాబు గారూ అని భజన చేయాలా..? బూతులుంటేనే స్టాండప్ కామెడీ అంటారా..? ఓహో… ప్రత్యేక టాలెంట్ ఉంటే తప్ప ఇలాంటి బూతు కామెడీ సాధ్యం కాదా..? ఫ్లోలో బూతులొస్తే తప్పులేదా..? మరి ఎవరైనా వాళ్లు పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఏదో ఫ్లోలో నీ షో మీద బూతులు ప్రయోగించినా ఓకేనా..? బోల్డ్ కంటెంట్ ఉంటే పర్లేదా…?
యూట్యూబ్ కాబట్టి చూస్తూ చూడండి, లేకపోతే మానేయండీ అంటే… అది పబ్లిక్ డొమైన్ కాదా..? ఎలాంటి వీడియోలనైనా పెట్టేసి, ఇష్టముండే చూడండి, లేకపోతే లేదు, అంతేగానీ విమర్శిస్తే మర్యాద దక్కదు అని ఉల్టా బెదిరిస్తే ఎలా..? పోనీ, ఈ షో కేవలం 18 నుంచి 40 ఏళ్ల లోపు వారికి మాత్రమే అనీ, బోల్డ్ కంటెంట్ ఉంటుందనీ ఓ డిస్‌క్లెయిమర్ వేయొచ్చు కదా… ఇంతకీ తమరి వయస్సు ఎంత సారూ…? సరే సార్, ఆ ప్రవచనాలు చూడాలని మీరు వెటకరించడం దేనికిలే… ఈ చాగంటి నాగబాబు ఈ ప్రవచనాలే చూసి తరిస్తాం… సరేనా..? ఇంతకీ తమరు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఏం బయటపెట్టుకుంటున్నారు సార్…!!
Share this Article