చివరకు ఈ ప్రొమోాల పిచ్చిలో పడి బిగ్‌బాస్ టీం హోస్టు నాగార్జున ఇజ్జత్ కూడా తీసేస్తోంది… ఎస్, షోపై కొంత ఆసక్తిని క్రియేట్ చేయడానికి ప్రొమోలు పనికొస్తాయి… కానీ అంతిమంగా అవి జనం నవ్వుకునేలా ఉండకూడదు అనేది ఓ కామన్ సెన్స్ పాయింట్… ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లేదా ఓ హైలైట్‌ను కాస్త మసాలా వేసి, కాస్త సస్పెన్స్ క్రియేటయ్యేలా ప్రొమో కట్ చేస్తే మంచిదే… కానీ ఏ ప్రొమో కూడా నమ్మకూడదు, వీళ్లు ప్రొమాల్లో చూపేది ఒకటి, చివరకు పూర్తి భిన్నంగా జరుగుతుంది అని క్రెడిబులిటీ కోల్పోయేలా ఉండకూడదు… మరీ రాంగోపాల్ వర్మ విడుదల చేసే తన సినిమాల ట్రెయిలర్లలా…
బిగ్‌బాస్ టీం సభ్యులకు ఈ నిజం అర్థం కానట్టుంది… అందుకే ఈ ప్రొమోల యవ్వారంలో తొందరపడుతూ… తాము బదనాం కావడమే గాకుండా, హోస్టు నాగార్జున పరువు కూడా తీస్తున్నారు… తాజా ప్రొమోలో నాగార్జునతో చెప్పించినట్టుగా… ‘ప్రతిసారీ తప్పు చేస్తూనే ఉన్నావ్ అభిజిత్…’ అన్నట్టుగానే… ప్రతిసారీ నాగార్జునతో తప్పు చేయిస్తున్నారు…
Ads
శనివారం వీకెండ్ షోలో నాగార్జునతో అభిజిత్‌కు అక్షింతలు వేయించారు నాగార్జునతో… హారికకు కూడా పడ్డయ్… బిగ్‌బాస్ చెప్పినా సరే గ్రేవ్ యార్డులోకి మోనాల్‌ను డేటింగుకు వెళ్లను అని అభిజిత్ మొండికేయడం తను ప్రస్తావించిన తప్పు… సరే, అది తప్పే అనుకుందాం… ‘నువ్వు వరస్ట్ పర్ఫామర్’ అని ప్రకటించినప్పుడే అభిజిత్‌కు ఏదో ఒక పనిష్మెంట్ వేసి ఉండాలి కదా… తనను వదిలేసి, హౌస్ మొత్తాన్ని శిక్షించాడు బిగ్‌బాస్… దాంతో ఎండ్ అయిపోవాలి కదా…
మళ్లీ నాగార్జున వేదిక మీదకు వచ్చి, అప్పటికప్పుడు ‘నువ్వు తప్పు చేశావ్, పదే పదే చేస్తున్నావ్, ఛలో, గేట్లు ఓపెన్ చేయండి, వెళ్లిపో…’ అనిపించగానే… దాన్ని నమ్మేయడానికి బిగ్‌బాస్ ప్రేక్షకులు ఏమైనా పిచ్చోళ్లా..? ఎన్ని చూడలేదు..? ఫేక్ ఎలిమినేషన్లు, యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వంటి హైపులు ఎన్ని తుస్సుమనలేదు..? జనం నమ్మేలా ఉండి బ్రదర్… మరీ నవ్వులాట వ్యవహారంగా మార్చేస్తే ఎలా..? దీన్ని కూడా ఫన్ అనుకోవాలా..?
అభిజిత్ గ్రేవ్ యార్డు డేటింగ్ అనే ఓ పిచ్చి టాస్క్ చేయలేదు సరే, మరి కన్ఫెషన్ రూంలో స్పూన్ తెచ్చుకునే టాస్క్ ఎందుకు చేయించలేదు..? చేయిస్తే ఎందుకు చూపించలేదు..? మినహాయించారా..? అదే నిజమైతే కావాలనే అభిజిత్‌ను ఆ టాస్క్ నుంచి మినహాయించామనో, ఎలాగూ అభిజిత్ టాస్కులు చేయడు కాబట్టి వదిలేశామనో చెప్పి ఉండాలి కదా… పోనీ, హారికను ఎందుకు మినహాయించారు..?
పోనీ, అభిజిత్ ఈ షోకు పనికిరాడు అని ఫిక్సయి ఉంటే… టాస్కులు చేయడు కాబట్టి అగ్రిమెంట్ కాగితాల్ని చింపేసి, బయటికి వెళ్లగొడుతున్నాం అని చెప్పే సాహసం బిగ్‌బాస్‌కు ఉందా..? మొత్తం ఈ నాలుగు సీజన్లలో ఏ ఒక్కరినైనా చెప్పినట్టు వినడం లేదు అనే సాకుతో బయటికి పంపించారా..? గంగవ్వ, నోయెల్ అనారోగ్యం కారణంగా బయటికి రావల్సి వచ్చింది… అదేదో సీజన్లో సంపూర్ణేష్ బాబు… అదీ తప్పులు చేస్తున్నాడని కాదు… తను హౌస్‌లో ఉండలేకపోతున్నందుకు, తనే కోరినందుకు…
మరి నిజాలు ఇలా ఉంటే… నాలుగు వీడియోస్ చూపించి అభిజిత్ తప్పుల్ని, హారిక బెస్ట్ కెప్టెన్ కాదని ఇప్పుడు బలంగా ఎస్టాబ్లిష్ చేసి, ఆమెను ఏడిపించిన బిగ్ బాస్ మరి మొన్ననే ఎందుకు అభిజిత్‌ను పనిష్ చేయలేదు…? అభిజిత్ – హారిక బంధాన్ని, అభిజిత్ పట్ల హారిక పక్షపాతాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఈ టీమ్… నిజానికి మొదటి నుంచీ ఈ లవ్ ట్రాక్స్ ఎంకరేజ్ చేసింది తనేనని విస్మరించింది ఎందుకు..?
ఇప్పుడు హఠాత్తుగా… ఏయ్, నువ్వు బయటికి నడువ్, గేట్లు ఓపెన్ చేయండ్రా వంటి మాటలతో ఉత్తుత్తి బెదిరింపులు, నవ్వులాటలు గేమ్‌లో సీరియస్‌నెస్‌ను చేజేతులా చంపేయడం లేదా..? చివరకు క్షమించేసి, వదిలేసి… అసలు టాస్కులు చేయకపోయినా పర్లేదులేవోయ్ అనే మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందా లేదా..? అంటే హోస్టు నోటి నుంచి వచ్చిన మాటల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెబుతున్నట్టా..? పైగా మోకాళ్ళ మీద కూర్చుని, చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి వదిలేశాం అని కవరింగ్…
ప్రోమో చూసి, షో చూసి అభిజిత్ ఫ్యాన్స్ చివరికి నాగార్జునని కూడా భీకరంగా ట్రోల్ చేస్తున్నారు… ఫాఫం, నాగార్జున…! ఇంత ఆక్షేపించి, బెదిరించి, అదిలించి, చివరకు వదిలేస్తే… అభిజిత్ పెదవులపై నవ్వు మెరిస్తే… బిగ్‌బాస్ మరోసారి అభిజిత్ చేతిలో ఓడిపోయినట్టా..? కాదా..?!
నో, నో… ఇదంతా ఫన్… పార్ట్ ఆఫ్ ది గేమ్… కాస్త సస్పెన్స్ అనుకోమంటారా..? అదే మీ వాదన, మీ సమర్థన అయితే… అంతకుమించిన ‘‘చిల్లర కామెడీ’’ మరొకటి లేనట్టే…!! ఇంతకీ ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటారా..? Sorry… ఎవరూ లేరు… అందరూ సేఫ్…! నిన్ననే కదా ఆ ఈక్వేషన్ ఏమిటో మనం చెప్పుకున్నాం…!!
Share this Article