ఫాఫం నాగార్జున..! మళ్లీ అనిపించింది ఇలా..! ఎందుకు..? చెప్పుకుందాం… అప్పుడెప్పుడో తాతల జమానాలో వచ్చిన శ్రీరామదాసు… అప్పటి నుంచి నాగార్జున సినిమాలు బోలెడు వచ్చినయ్, ఒక్క హిట్టూ లేదు, సోగ్గాడే చిన్ని నాయనా, మనం కాస్త పర్లేదు… ఇక వర్మ అనే ఓ మెంటల్ కేసు ఉద్దరించిన ఆఫీసర్ అనే మూవీ నాగార్జునకు ఇప్పటికీ అప్పుడప్పుడూ కలలోకి వచ్చి వణికిస్తుంది… మన్మథుడు-2 ఢమాల్… మరోవైపు స్టూడియో వ్యవహారాలూ అంత బాగాలేవు… పెద్ద కొడుక్కి లవ్ స్టోరీ రూపంలో మంచి హిట్ దక్కినా, సమంత వదిలేసి వెళ్లిపోయింది… చిన్నకొడుకు పెళ్లి అప్పట్లో అర్థంతరంగా ఆగిపోయి, సినిమా కెరీర్ సరిగ్గా లేక, అదొక ఫెయిల్యూర్ స్టోరీ…
తన కుటుంబసభ్యుడే అయినా సుమంత్ మరో విషాదగాథ… సినిమాలు వస్తూనే ఉంటయ్, ఫట్‌మని పేలిపోతూనే ఉంటయ్… చివరకు నాగార్జున హోస్ట్ చేసే టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ కూడా ప్రస్తుతం తాజా ర్యాంకింగుల్లో బాగా డౌన్… సండే షోకు కూడా అయిదున్నర టీఆర్పీలు (హైదరాబాద్ బార్క్) మాత్రమే వచ్చినయ్… వయస్సు మీద పడకుండా బాడీని ఫిట్‌గా, స్లిమ్‌గా బాగానే కాపాడుకుంటున్నా సరే, ఈమధ్య మొహంలో ముసలితనం ఛాయలు పెరుగుతున్నయ్… 62 ఏళ్ల వయస్సుకు వచ్చేశాడు… ప్చ్, ఎటుచూసినా ఏదీ ఆశాజనకంగా లేదు…
Ads
తాజాగా బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తే వైల్డ్ డాగ్‌కు వచ్చిన రేటింగ్స్ ఆశ్చర్యపరిచాయి… ఆఫీసర్, మన్మథుడు-2 రిజల్ట్‌తో షాక్ తిన్న నాగార్జునకు వైల్డ్ డాగ్‌కూ మరో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే… నిజానికి ఈ సినిమా అంత నాసిరకం ఏమీ కాదు… నాగార్జున కాస్త మనసు పెట్టి చేసిన సినిమాయే… కరోనా వల్ల షూటింగుకు మధ్యలో బ్రేకులు పడినా, ఎలాగోలా తిప్పలు పడి, గత ఏప్రిల్‌లో విడుదల చేశారు… థాయ్‌లాండ్‌లో కొంత షూటింగ్ ప్లాన్ చేసినా సరే, కరోనా కుదరనివ్వలేదు… దాంతో లేహ్, మనాలి, జమ్ము ప్రాంతాల్లో మమ అనిపించేశారు… ఒక సీరియస్ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్… దియా మీర్జా, సయామీ ఖేర్ తదితరులు బాగానే నటించారు… సోకాల్డ్ కమర్షియల్ హంగులు, మసాలాల జోలికి పోకుండా కథ మీదే దృష్టి పెట్టారు… యాక్షన్ సీన్లు కూడా బాగానే వచ్చాయి… ఐనాసరే, ప్రేక్షకుడు పెదవివిరిచాడు…
బార్క్ రేటింగుల్లో దానికి దక్కిన టీఆర్పీలు జస్ట్ నాలుగు మాత్రమే… ఏడో తారీఖున జెమిని టీవీలో వేశారు… చాలా నిరాశాజనకమైన రేటింగ్స్ ఇవి… ఓటీటీ, ఓవర్‌సీస్, ఇతర భాషల ఆదాయం ఎంతో, మొత్తానికి పోయింది ఎంతో తెలియదు గానీ… టీవీకి సంబంధించి కూడా ఫ్లాప్… అనేకసార్లు టీవీల్లో వేస్తున్నా సరే కొన్ని సినిమాలకు ఇప్పటికీ ఈ రేటింగ్స్ వస్తుంటయ్… అలాంటిది ప్రీమియర్ షో వేసినా నాలుగు రేటింగ్స్ దాటకపోవడం మైనసే… అసలే గ్రహచారం బాగాలేదు… అన్నీ చిక్కులే, దానికితోడు ఇక కెరీర్ కూడా ముగింపుకొచ్చేస్తున్నదా..? వెంకటేష్‌లాగా దృశ్యం, నారప్ప వంటి కథల్ని ఎంపిక చేసుకోకుండా నాగార్జున తప్పుచేస్తున్నాడా..? లేక తన మొహమే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తోందా..? రజినీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, చిరంజీవి, రాజశేఖర్, బాలకృష్ణ తదితరులు కూడా ఎంత ఏజ్ బార్ అయిపోతున్నా ఇంకా హీరోలుగా చేస్తూనే ఉన్నారు కదా, మరి నాగార్జునకే ఎందుకిలా..? ఏదో భారీ తేడా కొడుతోంది నాగ్ భయ్యా..!!
Share this Article