.
ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజా వ్యాఖ్యలపై మిత్రుడు Shankar G ఏమంటాడంటే..?
‘‘తను చెప్పింది కరెక్టే… పొద్దున్న లేస్తే సినిమావాళ్ళ వార్తలు, ఆ హీరో ఏం చేశాడు, ఆ హీరో దానగుణం చూస్తే కర్ణుడు కూడా సిగ్గుపడతాడు. ఈ హీరో ఏం తింటాడో తెలిస్తే కరెంట్ షాక్ కొట్టిన కోతిలా గిలగిలలాడతారు…
Ads
వాడు తోపు, వీడు తురుము, వాడు అది పీకాడు, వీడు ఇది పీకాడు… ఆ హీరోయిన్ ఆ రాత్రి ఎవరితో ఉంది. ఆ హీరోయిన్ పాయిఖానా ఫలక్‌నామా అంత వుంది. ఇవి తప్ప ఆ యూట్యూబ్ ఛానల్స్‌లో ఇంకేమన్నా వస్తున్నాయా…
ఈ సినిమావాళ్ళు లేకపోతే ప్రపంచం ఏమై పోతుందో అన్న రేంజులో ఊదరగొడతారు. ఇలాంటి నిర్మాతలు సినిమాలు తీయబట్టి సినిమా దేవుళ్లను ప్రతిరోజూ పరిచయం చేయబట్టి ఇంకా ప్రళయం రాకుండా జనాభా నిలిచి వుంది…’’
నిజమే కదా మరి… తీసుకునే కవర్ బరువును బట్టి అంతే బరువైన భజన స్టోరీలు రాసే రివ్యూయర్లు, జర్నలిస్టులు ఈ నిందలకు అర్హులే… నాగవంశీ తిట్లకు అర్హులే… సరే, ఇది స్వీయనింద… ఆత్మమథన నింద… గతంలో వేరు…, ప్రస్తుతమూ కొందరు ‘కవరే’జీ రిపోర్టర్లు రాసిందే వార్త, రాసిందే రివ్యూ…
కానీ సినిమా ఓటీటీలోకి వచ్చాక, టీవీలో వచ్చాక, సోషల్ మీడియా రివ్యూయర్లు, ప్రేక్షకులు మంచిని మంచిగా, చెడును చెడుగా విడగొట్ఠి మరీ విశ్లేషిస్తున్నారు… డొల్ల, డర్టీ, మీనింగ్‌లెస్, చీప్ టేస్టు సినిమాలను ఉతికి ఆరేస్తున్నారు… వాళ్లేమీ నాగవంశీ చెప్పినట్టు భజనరిస్టులు కాదు… ఈ బలుపు గుర్రాల మీద ఊరేగే నిర్మాతలకు దాసులూ కాదు… వాళ్లు కాస్త రక్తమాంసాలు ఉన్నవాళ్లు…
ఎస్.., హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు కొన్నాళ్లుగా బాగా డబ్బు పట్టుకుంది… రివ్యూయర్లను, రిపోర్టర్లను వెకిలి చేస్తారు, మీరేందిరా, మీ బతుకులేందిరా, మా వార్తలు రాయకపోతే రాత్రికి నీ ఇంట్లో బియ్యం ఉంటాయారా అని పెంట మీద పురుగుల్లా తీసిపడేస్తారు.,.
ఓ ఛోటా యాక్టర్ ఆమధ్య ఏదో కూశాడు కదా… పెంట మీద పురుగులు విసర్జించే అశుద్దాన్ని తినేవాళ్లు అని…! ఐనా మనకు డ్యాష్ ఏమీ ఉండదుగా… ఇదే నాగవంశీ ఇటీవల పిచ్చి కూతలు ఎన్నో రిలీజ్ చేశాడు… ఇండస్ట్రీలోని అలాంటి చాలామందిలో తనొక్కడు… తన అభిరుచి, తన సంస్కారం స్థాయి అది…
ఇంకా చెప్పాలంటే మ్యాడ్ స్క్వేర్‌లోని ఓ దరిద్రపు పాట ఉందిగా… వెగటు కామెడీ ఉందిగా… జామచెట్టుకు జామకాయలు కాస్తాయట, పచ్చి ఎండుగడ్డి భగ్గుమంటుందట… అదన్నమాట తన టేస్టు, పైగా రివ్యూయర్లు తన సినిమాలు చూడటం మానేయాలట, ఏదైనా సరే రాయడమే మానేయాలట… ఎందుకు..?
మరీ స్వాతిరెడ్డి పాటలాగే ఉన్నాయి ఈ మాటలు… ఎందుకు రాయకూడదు..? సినిమా అనేది రిలీజయ్యాక అది మార్కెట్ సరుకు… ఖచ్చితంగా దానికి జనంతో నాణ్యత పరీక్ష ఉంటుంది… థియేటర్ల నిలువు దోపిడీకి గురై సినిమా చూసినవాడికి ఈ పరీక్ష చేసే హక్కు ఉంది, అభిప్రాయాన్ని పంచుకునే హక్కూ ఉంది…
నమ్మి సినిమాకొస్తే వంచించాడు అనే ఫీలింగ్ గనుక వస్తే తిడతాడు… వాడి కడుపు మంట అది… అది అర్థమయ్యేంత జ్ఞానం ఇండస్ట్రీ ముఖ్యులకు ఉందని అనుకోలేం గానీ… ఆకాశంలో తిరగడం ఆపి, నేల మీద అడుగుపెడితే కాస్త బెటర్… రోజులు ఒకేలా ఉండవు… ఇదే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి తరువాత మట్టికొట్టుకుపోయినవాళ్లూ ఉన్నారు…
చివరగా… నీ సినిమా 70 కోట్లు కాదు, 700 కోట్లు వసూలు చేయనీ… ఐనంతమాత్రాన అదేమీ మంచి సినిమా అనిపించుకోదు… పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం కూడా వసూలు చేశాయి… అవేమైనా సమాజానికి కరదీపికలా..? ఆణిముత్యాలా..? ఏవో జబర్దస్త్ బాపతు శుష్క టీవీ షోలు… నీ మ్యాడ్ స్క్వేర్ పుష్ప-2 రికార్డుల్ని బ్రేక్ చేయనీ… ఏ రివ్యూయర్‌కు బాధ లేదు… సో, ఎంజాయ్ ది డర్టీ డస్ట్..!!
ఐరనీ ఏమిటంటే..? ఏం, మీరు రాస్తేనే జనం సినిమాలు చూస్తారా అంటున్నప్పుడు… మరి మంచి రివ్యూలు ఎందుకు కోరుకుంటున్నట్టు..? నా సినిమా ప్రమోషన్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, తొక్కలో మీ రివ్యూలు ఎవడిక్కావాలి, ఇంట్లో భార్య తిడితే కూడా నెగెటివ్ మూడ్‌లో రివ్యూలు రాస్తారు అంటున్నప్పుడు, అదీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తిడుతున్నప్పుడు ఒక్క నిరసన గొంతు వినబడకపోవడం…! అందుకే అలుసైపోయారు..! అదే చిన్న నటులో, చిన్న నిర్మాతలో, చిన్న దర్శకులో అయితే మీద పడి దాడి చేసినట్టు వ్యవహరించేవారు..!!
Share this Article