నాగేశ్వర్ అభిప్రాయాలతో ఏకీభవించాలని ఏమీ లేదు… వ్యతిరేకించకూడదని కూడా ఏమీ లేదు… జీవితాంతం సీపీఎం భావజాలాన్నే అంటిపెట్టుకున్నాడు కాబట్టి తన మాటలు, తన అడుగులు, తన ఆలోచనలు ఆ రంగు, ఆ రుచి, ఆ వాసనే కలిగి ఉంటయ్… బాగా అధ్యయనం చేస్తాడు, అన్ని విషయాలపై జ్ఞానం పెంచుకుంటాడు… సంస్కారం విడిచి మాట్లాడడు… వ్యక్తిగా నాగేశ్వర్ డబుల్ వోకే కేరక్టర్… కాకపోతే ఎర్ర వోట్లే గాకుండా తటస్థుల వోట్లు కావాలనే భావనతో తటస్థుడిగానే రేప్పొద్దున ఎమ్మెల్సీ బరిలో దిగబోతున్నాడు… అందుకని తన ప్రస్తుత మాటల్ని, అడుగుల్ని కాస్త చెప్పుకోవాల్సి ఉంటుంది… పైగా అయోధ్య రాముడి గుడికి విరాళాలు అంశాన్ని సంఘ్ పరివార్ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తోంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తన తిక్క వ్యాఖ్యలతో బీజేపీకి చాయిస్ ఇచ్చాడు… ఈ స్థితిలో నాగేశ్వర్ భద్రాద్రి అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి వీడియోలు వదులుతున్నాడు… వోకే, తన రాజకీయ ప్రయత్నాలు తనవి… కానీ ఎందుకో తన వాదన ఇప్పుడు, ఈ అంశంపై పేలవంగా, అసత్యాలతో కూడి, అసందర్భం అనిపిస్తోంది… ఎలాగంటే..?
బేసిక్‌గా భద్రాచలానికి అన్యాయం జరుగుతున్నదీ అనేది వేరే సబ్జెక్టు… అయోధ్య వ్యవహారం వేరు… పూర్తిగా వేరు… రెండింటినీ కలిపేసి, ముడేసి, భద్రాద్రికి మోడీ అన్యాయం చేస్తున్నాడు కాబట్టి అయోధ్యను మనం పట్టించుకోనక్కర్లేదు అన్నట్టు పరోక్షభావనల్ని వ్యక్తీకరించడం దండుగ… ఇష్యూను వక్రీకరించడం… సాధారణంగా సీపీఎం చాలా విషయాల్లో అవలంబించే టాక్టిసే ఇది… ఒకసారి ఆయన వీడియో చూడండి…
Ads
మోడీ రైలు వేయలేదు, భద్రాచలం గుడి భూముల్ని ఏపీలో కలిపారు అంటూ ఏవేవే ప్రస్తావించాడు… భద్రాచలానికి రైలుమార్గం అవసరమని మోడీ దగ్గరకు తీసుకెళ్లంది ఎవరు..? అసలు బుల్లెట్ రైలుకూ భద్రాచలం రైలుకూ లింకేమిటి..? మీరే చెబుతున్నారు కదా ఒక్కసారి తప్ప కేసీయార్ మళ్లీ ఎప్పుడూ ముత్యాల తలంబ్రాలు తీసుకుపోలేదు, భద్రాద్రి రాముడికి అగౌరవం అన్నట్టుగా విమర్శిస్తున్నారు కదా… అవును, రాష్ట్రం ఎప్పుడైనా అక్కడికి రైలు మార్గం కావాలని అడిగిందా..? పోనీ, నాగేశ్వర్ ఎప్పుడైనా అడిగాడా..? గతంలో చట్టసభల సభ్యుడే కదా తను..? నిజమే వందల కోట్లతో యాదాద్రిని పునర్నిర్మించే ప్రభుత్వం భద్రాద్రికి రూపాయి కూడా ఇవ్వదు, ప్రపంచంలోకెల్లా ఉగ్ర హిందువు కేసీయార్ అసలు తను విధిగా నిర్వర్తించాల్సిన ముత్యాల తలంబ్రాలనే ఖాతరు చేయడు… మరి ఇక్కడ బీజేపీని తిట్టిపోయడం దేనికి..? బీజేపీ శుద్ధపూస అని కాదు… కానీ దాన్ని తిట్టడానికి భద్రాద్రిని ముందుపెట్టాల్సిన పని లేదు… భద్రాచలం ఒక్కసారైనా ఎందుకు రాలేదు అని ఆక్షేపించడం ఏమిటో… ప్రతి పుణ్యస్థలిని ప్రధాని లేదా హోం మంత్రి సందర్శించాలా ఏం..?
మరొకటి… భద్రాచలం సమీపంలోని పర్ణశాలలో సీతారాములు నివసించారు, జటాయువు రెక్క నరికింది ఇక్కడే అంటాడు… అది ఓ స్థలపురాణం మాత్రమే… నవ్వొచ్చేది ఏమిటంటే..? రాముడికి శబరి పళ్లు తినిపించింది కూడా ఇక్కడేనట… హేమిటో… నిజానికి రామాయణ బాష్యకారులు చెప్పేది ఏమిటంటే… రాముడు దక్షిణాదిలోకి అడుగుపెట్టింది దేశానికి పడమర వైపు నుంచి… ఇప్పటి కర్నాటకలోకి… తుంగభద్ర నదీతీరాల్లోని ఇప్పటి హంపి అప్పటి కిష్కింధ అంటారు… అక్కడే రుష్యమూక పర్వతాలున్నయ్… దాన్ని కాదని రామాయణాన్ని భద్రాచలం వైపు ఎందుకు లాక్కొస్తున్నట్టు..? భద్రాద్రి రాముడి భూములు ముంపునకు గురికావని ఎవరు చెప్పారు అసలు..? ఇప్పటి ప్రతిపాదిత కెపాసిటీతో గనుక పోలవరం కడితే గుడికే ముంపు ముప్పు… ఇక భూములదేముంది..? దీన్ని నివారించడానికి టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఏముంది..? జగన్ తన జాన్ జిగ్రీ దోస్తే కదా, ఇద్దరూ కలిసి ప్రాజెక్టులు కట్టుకోవాలని ప్లాన్లు కూడా వేశారు కదా, మరి ఆ భూములు మళ్లీ దేవుడి గుడికి ఎందుకు వచ్చి చేరలేదు..? ఐనా అయోధ్య చందాలు ఎక్కడ బీజేపీకి ఉపయోగపడతాయో అనే భావన ఉంటే దాన్నే ప్రస్తావించి, ఆక్షేపించొచ్చు కదా… మధ్యలో భద్రాచలం ఇష్యూకు ముడేసి, వక్రీకరించడం..?! అక్కడ ఆల్రెడీ రామనారాయణ వివాదంలో అర్చకులే పిలకలు పట్టుకుంటున్నారు… ఆ పంచాయితీలు ప్రస్తుతానికి చాలు..!! చివరగా :: సీపీఎం దేవుడు లేడనే పార్టీ, డీఎంకే కూడా అంతే… కానీ డీఎంకే స్ట్రెయిటుగా రామాయణం ఉత్త కల్పన, అది చరిత్ర కాదు అని కొట్టిపారేస్తుంది… సీపీఎంకు ఆ కమిటెడ్ ఐడియలాజికల్ లైన్ కూడా లేదు…!!
Share this Article