Prasen Bellamkonda….. ఫుల్ డ్రెస్ డ్ నగ్నమునీ జన్మదిన శుభాకాంక్షలు
————————–
నువు సుధవో కేశవరావువో నగ్నమునివో అయితే అయ్యుండొచ్చు కానీ అసలైతే ఏకవచనానికి బహువచన గౌరవాన్నిచ్చే హద్దుల్లేని ఆత్మీయతా ప్రవచనానివి.
Ads
నువు బూతుమాటను నీతిమూట చేసి వెర్రిగొంతుకలకు పిక్కటిల్లే శక్తినిచ్చిన ఐదు చూపుడు వేళ్ల పిడికిలివి. నువు కవివో కథకుడివో నటుడివో నాటకకర్తవో ఇంకేదో అయితే కావచ్చు కానీ లోలోపల మాత్రం చీకటి గుయ్యారంలో మిణుగురులనే నక్షత్ర దివిటీ చేసి మనిషికోసం దేవులాడిన తోటి మనిషివి.
నువు అనేకవచనంగా వినపడే సర్వనామానివి. నువు నువ్వనే చనువువి.
మానేపల్లి హ్రుషికేశవరావూ నీకు లెక్కలేనన్ని మెనీ మోర్ హాపీ బర్త్ డేస్.
నువు లగెత్తే కొయ్యగుర్రానివో రగిల్చే విలువల విలోమ కథకుడివో ఘర్మజలం ఎగేసే ఉద్యమకారుడివో రాజ్యాన్ని పిగిల్చే వైప్లవ్యగీతకారుడివో తెలియనైతే తెలియదు కానీ ఆకలి తెరువును తాత్విక చింతనలోంచి మానవీయ అన్వేషణగా చూపే కన్నువి.
ప్రత్యామ్నాయ విలువల వ్వవస్ధ అక్షరాభ్యాసం కోసం కొట్టుకులాడే మామంచి మాస్టారువి. వచన కవిత్వానికి కావ్యాత్మనిచ్చిన మా ఇరుగింటి జీన్ పాల్ సార్త్ర్ వి. లోకల్ కాఫ్కావి. కళ్లెదుటి దాస్తోవిస్కీవి.
భావ అభ్యుదయ కవిత్వాలకు భారతీయ రాజకీయాంశ అనే సారాంశాన్నిచ్చే క్లాస్ పీకిన మార్గదర్శివి. కవీ నీకు లెక్కకు దొరకనన్ని మెనీ మోర్ హాపీ బర్త్ డేస్
నువు ఆగ్రహిస్తే అది దిగంబర ఉద్యమం. నువు ధిక్కరిస్తే అది కథాత్మక ప్రతిక్షేపం. నువు కొంటెగించినపుడు అది కవితాత్మక అధిక్షేపం.
పాత మొహాల్నీ కొత్త చేతుల్నీ మార్కెట్ లో కొనుక్కునే పాత్రలూ, సిమెంటు సంతతి సమూహాలుగా తలకిందులు సంభాషించే పాత్రధారులూ,
అరూపాలే విరుపాలై పులులూ బెబ్బులులుగా మారే అత్యవసర జైళ్ల కాపలాదారులూ, జైలు లోపలి స్వేచ్చా జీవులూ నీ యెటకారానికి విషాద పరాకాష్టలు.
నువు అంతా తిరస్కరించి అన్నీ విధ్వంసించి తాజా నిర్మాణానికి తట్టమోసే శ్రామిక తత్వవేత్తవి. స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడుతున్న అమాయకులకు ఇంకా ఉద్యమించాల్సి ఉందన్న నిజాన్ని వినిపించిన తొలి అడుగువి నువు.
మునీ నీకు వేన వేల మెనీ మోర్ హాపీ బర్త్ డేస్.
వెండితెర మీద కూడా నువు నీ ధిక్కారాన్ని వదులుకోలేదు కదా. రెండు ప్రాంతాల రెండు భాషల మనసులనూ మనుషులనూ సమాజం కలవనివ్వదన్న నిజాన్ని విషాదంగా ప్రేక్షకులకు కమల్ సరితల మరోచరిత్రంటూ చెప్పావ్.
వ్యక్తిగతాంశాలే సామాజికాంశాలుగా విప్లవిస్తాయని కృష్ణంరాజు, జయసుధల త్రిశూలం లో చెప్పావ్. రాజకీయాలలో నైచ్యం, కుత్సితం, అసహ్యం, డబ్బు పిచ్చి ఎంత వెధవాయిగా ఉంటాయో దాసరి ఎమ్మెల్యే ఏడు కొండలులో చెప్పావ్. జనం ప్రభంజనమైతే ఏ తూరుపుగాలి వీస్తుందో నటశేఖరుని ఉదయం లో చెప్పావ్.
కర్టెన్ రైజర్, ఇంటర్వెల్ బాంగ్, క్లయిమాక్స్ ఏదైనా నీకు మనిషి కోసం అన్వేషణా వేదికలే కదా. వెండితెర రంగస్థలం తెల్లకాగితం రేడియో మైక్ కవిత ఏదైనా నీకు ఆయుధమే కదా.
నగ్నమునీ నీకు ఇంకా ఎన్నెన్నో మెనీ మోర్ హాపీ బర్త్ డేస్.
నువు పేరుకే నగ్నముని. నిజానికి ఇరుగు పొరుగు మిస్టర్ కారష్ ల గుడ్డలిప్పి దిగంబర కూృరత్వాన్ని అందరి కళ్ల ముందు నిలబెట్టిన ఫుల్ డ్రెస్డ్ రాజకీయ తత్వవేత్తవి నువు.
సకారాత్మక అర్దంలో నువ్వొక ఆకాశ దేవర. అకారాత్మక అర్దంలో నువ్వొక రేపటి సాహిత్య గ్రంధ పీఠిక. సుధగా నువు దాక్కునీ కేశవరావుగా తెరలు తీసీ నగ్నమునిగా రిక్షా కార్మికుడితో కలిసి రోడ్డెక్కిన రాజకీయ శాస్త్రవేత్తవి, సామాజిక తాత్వికుడివి.
సో …. ఫుల్ డ్రెస్ డ్ నగ్నమునీ జన్మదిన శుభాకాంక్షలు
దిగంబర కవుల కవిత్వాన్ని ఊగిపోతూ చదువుకున్న రోజులనుంచీ నగ్నముని అంటే అదో పిచ్చి.. ప్రేమ. ఇలా ఎలా రాస్తాడు అనే ప్రశ్నకు ఏనాడూ సమాధానం దొరకలేదు..ఇంకా వెతుకుతూనే ఉన్నా. నేను జెమిని టివిలో 2002 లో ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు రిలే అయే స్రవంతి కార్యక్రమంలో ఇప్పుడు రాజమండ్రి ఎంపి స్ధానానికి టిడిపి నుంచి పోటీ చేసిన అప్పటి నా కో-యాంకర్ మురళీ మోహన్ కోడలు రూపతో కలిసి నగ్నమునిని రెండు గంటల పాటు ఇంటర్వ్యూ చేసా.
అది రెండు వారాలు ఎయిర్ అయింది. ఒక సాహితీ వేత్తను జెమినీ లాంటి మోస్ట్ వ్యూయర్ షిప్ ఉన్న చానల్ లో ఇంటర్వ్యూ చేయడం నిజంగా సాహితీ ప్రేమికుడిగా నాకు నిజంగా ఓ గొప్ప అనుభూతి. ఆ ఇంటర్వ్యూ కాసెట్ నా దగ్గరైతే లేదు. నగ్నముని గారి దగ్గరైనా ఉందో లేదో మరి…. (ఒకానొక పాత పోస్టు)
Share this Article