.
నందాదేవి మిస్టరీ…: హిమాలయాల్లో నిశ్శబ్దంగా ఉన్న అణు పరికరం – భయపడాలా? ధీమాగా ఉండాలా?
హిమాలయాల్లోని మంచు శిఖరాల మధ్య 60 ఏళ్లుగా ఒక రహస్యం ప్లస్ ఒక ముప్పు దాగి ఉంది… 1965లో చైనా అణు పరీక్షలపై నిఘా ఉంచేందుకు భారత్- అమెరికా చేపట్టిన ఒక మిషన్ విఫలమై, ఒక అణు పరికరం మంచులో కూరుకుపోయింది… దీనిపై తరచూ రాజకీయ రచ్చ జరుగుతుంటుంది కానీ, దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలు తెలిస్తే మనం భయపడాలా లేక ధీమాగా ఉండాలా అనేది అర్థమవుతుంది…
Ads
మొన్నటి నుంచీ ఇండియన్ మీడియా అపరమిత ప్రాధాన్యం ఇస్తోంది కదా… మనం అసలు నిజంగా మనం భయపడేంత ముప్పు ఉందా అనే కోణంలో నిజాలు చెప్పుకుందాం… మనకు భరోసానిచ్చే కొన్ని సాంకేతిక నిజాలూ తెలుసుకుందాం… ముందుగా అసలు కథ ఏమిటో కింద లింకులో చదవండి…
…… (ఈ అణుముప్పు సమగ్ర కథనం కావాలంటే ఇదీ లింక్)….
మిషన్: ఆపరేషన్ హార్ట్ బ్రేక్
1964లో చైనా అణుబాంబు పరీక్ష చేయడంతో, భారత్, అమెరికా అప్రమత్తమయ్యాయి… చైనా క్షిపణి ప్రయోగాలను పసిగట్టడానికి 25,643 అడుగుల ఎత్తున్న నందాదేవి శిఖరంపై ఒక శక్తివంతమైన రేడియో సెన్సార్‌ను అమర్చాలని CIA, IB నిర్ణయించాయి…
అణు బ్యాటరీ (RTG): అసలు కథ ఇక్కడే ఉంది
ఆ నిఘా పరికరానికి ఏళ్ల తరబడి పవర్ సప్లై ఉండాలి… అక్కడ బ్యాటరీలు పని చేయవు కాబట్టి, అమెరికా RTG (Radioisotope Thermoelectric Generator) అనే అణు జనరేటర్‌ను వాడింది… ఇందులో సుమారు 3.5 కిలోల ప్లుటోనియం-238 నింపిన ఆరు ఇంధన గుళికలు ఉన్నాయి… ఇది అణుబాంబు కాదు, కేవలం వేడిని ఇచ్చే ‘అణు బ్యాటరీ’ మాత్రమే…
మన అసలైన ధీమా: ఇరీడియం కవచం
చాలామంది వార్తల్లో ప్లుటోనియం గురించి వినే భయపడతారు, కానీ శాస్త్రవేత్తలు ధీమాగా ఉండటానికి కారణం ఆ పరికరం చుట్టూ ఉన్న ఇరీడియం (Iridium) కవచం…
-
తుప్పు పట్టని లోహం..: ఇరీడియం అనేది భూమిపై ఉన్న అత్యంత అరుదైన, బలమైన లోహం… ఇది ఎంతటి శక్తివంతమైన ఆమ్లాలకైనా, సముద్రపు ఉప్పు నీటికైనా, గడ్డకట్టే మంచుకైనా లొంగదు… దశాబ్దాల కాలం గడిచినా ఇది తుప్పు పట్టదు…
-
సిరామిక్ రూపం…: లోపల ఉన్న ప్లుటోనియం పొడిలా ఉండదు… అది ఒక ‘సిరామిక్’ (పింగాణీ లాంటి గట్టి పదార్థం) రూపంలో ఉంటుంది… ఒకవేళ పొరపాటున కవచం పగిలినా, అది నీటిలో కరగదు, గాలిలో కలవదు…
-
అంతరిక్ష ప్రమాణాలు..: ఈ పరికరాలను ఒకవేళ రాకెట్ పేలిపోయి అంతరిక్షం నుండి భూమిపై పడినా చెక్కుచెదరకుండా ఉండేలా తయారు చేస్తారు… కాబట్టి హిమాలయాల మంచు ఒత్తిడి దీనికి పెద్ద సమస్య కాదు…

అదృశ్యం: ఆ రాత్రి ఏం జరిగింది?
1965 అక్టోబర్‌లో పరికరాన్ని శిఖరం పైకి తీసుకెళ్తుండగా భారీ మంచు తుఫాను వచ్చింది… ప్రాణాలు కాపాడుకోవడానికి బృందం ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారు… మరుసటి ఏడాది వెళ్లి చూసేసరికి, భారీ మంచు చరియలు (Avalanche) విరిగిపడి ఆ పరికరం మొత్తం అదృశ్యమైపోయింది…
రేడియేషన్ ముప్పు ఎంత?
-
ఆల్ఫా రేడియేషన్..: ప్లుటోనియం-238 విడుదల చేసే ఆల్ఫా రేడియేషన్ చాలా బలహీనమైనది… అది గాలిలో కనీసం రెండు అంగుళాలు కూడా ప్రయాణించలేదు… ఒక చిన్న కాగితం ముక్క దాన్ని ఆపగలదు… ఆ ఇరీడియం కవచం లోపల ఉన్నంత కాలం బయట ఉన్న మంచుకు గానీ, నదికి గానీ ప్రమాదం లేదు…
-
60 ఏళ్ల తర్వాత స్థితి..: ప్లుటోనియం-238 అర్థ జీవిత కాలం 87.7 ఏళ్లు… అంటే 1966 నుండి ఇప్పటివరకు సుమారు 60% రేడియోధార్మిక శక్తి ఇంకా అందులో మిగిలే ఉంది… ఇది వేల ఏళ్ల పాటు శక్తిని వెలువరిస్తుంది కానీ, దాని తీవ్రత తగ్గుతూ వస్తుంది…
ఆందోళన ఎప్పుడు?
వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి… ఆ పరికరం తన సొంత వేడి వల్ల మంచును కరిగించుకుంటూ హిమానీనదం లోతుల్లోకి వెళ్లి ఉండవచ్చు… ఒకవేళ వందల ఏళ్ల తర్వాత ఆ ఉక్కు కవచం దెబ్బతిని, ప్లుటోనియం కణాలు గంగా నది ఉపనదుల్లో కలిస్తే మాత్రమే అది ఆరోగ్య ముప్పుగా మారుతుంది…

ముగింపు: భయం వద్దు.. పర్యవేక్షణ చాలు!
నందాదేవి అదృశ్య పరికరం అనేది ఒక అణు విపత్తు కాదు, అది ఒక నిశ్శబ్ద పర్యావరణ సవాలు... ఆ ఇరీడియం కవచం భద్రంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి ముప్పు లేదు… ప్రభుత్వం న్యూట్రాన్ డిటెక్టర్లు, థర్మల్ సెన్సార్ల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉంది… అలాగే గంగా నది నీటిని నిరంతరం పరీక్షిస్తోంది…
నో రేడియేషన్ ఇండికేషన్స్... ప్రస్తుతానికి ఆ పరికరం మంచు గర్భంలో క్షేమంగానే ఉంది, మనం కూడా ధీమాగా ఉండవచ్చు...
Share this Article