పూర్తిగా కొట్టిపారేయలేం… రాజకీయ పరిణామాల ఊహాగానాల కథనాలు ఏదో ఒక్క పాయింట్ మీద ఆధారపడి సాగుతుంటయ్… నిన్నోమొన్నో చంద్రబాబే అన్నాడు కదా,.. టీటీడీపీ బలోపేతం కోసం నేను వారానికోరోజు వస్తా, లోకేష్ మరోరోజు, అవసరమైతే బ్రాహ్మణి, భువనేశ్వరి, అండగా బాలయ్య అని… గతంలో కూడా బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చినట్టు గుర్తు…
సరే, అప్పట్లో అచ్చెన్నాయుడిని ఆంధ్రాకు అధ్యక్షుడిని చేసినట్టు… (చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ కార్యదర్శి కదా) ఎవరైనా తెలంగాణ నాయకుడిని టీటీడీపీ అధ్యక్షుడిని చేయలేరా అనడక్కండి… అది కుటుంబ పార్టీ, వాళ్లిష్టం… ఐనా జాతీయ పార్టీ కదా, ఆంధ్రా తెలంగాణ అనే తేడా ఏముంది అని బదులివ్వగలరు… ఏమో, ఇప్పుడూ ఎవరినో అలా కుర్చీ మీద కూర్చోబెట్టి, వర్కింగ్ ప్రెసిడెంటుగా అసలు పగ్గాలు బ్రాహ్మణికి ఇవ్వాలనే ఆలోచన కావచ్చు…
ఏ ఆశలూ లేనప్పుడు బీసీలకు మా ప్రాధాన్యం అనే మాటలు చెప్పి ఎవరో ఒకరిని టీటీడీపీ అధ్యక్షుడివి నువ్వేపో, పగ్గాలూ నీవేపో అంటారు… కానీ ఇప్పుడు ఆట మారింది, ఆశ పెరిగింది కదా… కోడలిని తీసుకొస్తున్నారు అనే విమర్శ మాత్రం చంద్రబాబు మోయాల్సి ఉంటుంది… నిజంగా ఆట మారిందా..? ఆశ పెరిగిందా..?
Ads
పెరిగిందని చంద్రబాబు భావిస్తున్నాడు… బీజేపీ, జనసేనతో కూటమి… మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు… చంద్రబాబులో ఆశలు పెంచుతున్నాయి… కాంగ్రెస్ అంతఃకలహాలు తనకు తప్పకుండా చాన్స్ కల్పిస్తాయనే ఆశ కూడా..! ఏమో, నాకూ ఓ షిండే దొరక్కపోడు అనే ఆశ కావచ్చు బహుశా… అలవిమాలిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేదేమో, జనంలో వ్యతిరేకత రాకపోదేమో, బీఆర్ఎస్ ఇంకా ఇంకా పతనం కాకపోదేమో… ఇవేనా ఆశలు..?
సరే, బ్రాహ్మణి విషయానికి వస్తే… ఆమె బాగా చదువుకున్నది, ఆలోచనల్లో క్లారిటీ ఉంటుంది, కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్‌ను ఆమే మేనేజ్ చేస్తోంది… గుడ్, ఐతే తెలంగాణ జనంలో, అక్కడక్కడా మిగిలిపోయిన పార్టీ కేడర్‌లో యాక్సెప్టెన్సీ వస్తుందా..? అదీ అసలు ప్రశ్న… ఏమో, వారస హీరోలను రుద్దినట్టే రుద్దితే సరి, ఆమోదించక ఏం చేస్తారనే ధీమా కూడా కావచ్చు…
తెలంగాణవ్యాప్తంగా ఉన్న సెటిలర్లు, ప్రత్యేకించి కమ్మ సామాజికవర్గం బీఆర్ఎస్‌ను వీడి ఇక తమ వైపు నిలుస్తారనే ఆశ కూడా ఉండే ఉండవచ్చు… కానీ కమ్మ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ క్యాంపులోకి జారిపోతున్నారు… చేరిపోతున్నారు… అప్పట్లో నందమూరి సుహాసిని అనే కుటుంబ అభ్యర్థిని నిలిపితే, చివరకు ఆమె సోదరులు కూడా ప్రచారం చేయలేదు… సో, అన్నీ అనుకున్నట్టే జరగాలని ఏమీ లేదు…
మొన్నమొన్నటిదాకా నేను రాజన్న బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణను మస్తు ఉద్దరిస్తాను అని ఊరూరూ తిరిగింది కదా షర్మిల… ఏమైంది..? జనం నుంచి జీరో యాక్సెప్టన్సీ… వెంటనే ఇక్కడ దుకాణం క్లోజ్ చేసేసి, కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసి, ఆంధ్రాలో తేలింది ఆమె… అక్కడ ఫలితమూ తెలిసిందే కదా…
అందుకని బ్రాహ్మణిని టీటీడీపీ అధ్యక్షురాలిని చేసి, ఆమె నాయకత్వాన్ని సక్సెస్ చేయడం అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదు… అవునూ, చంద్రబాబుకు ఈమాత్రం తెలియదంటారా..? ఐనా ఎందుకిలా..!! మొన్న ఓ మిత్రుడు ఓ విచిత్రమైన ప్రశ్న వేశాడు… ఆమె నందమూరి సుహాసిని అయినప్పుడు, ఈమె నారా బ్రాహ్మణి ఎందుకవ్వాలి అని..!!
Share this Article