ప్రతినిధి-2 సినిమా హిట్టయింది కదా… ప్రతినిధి-3 ఏమైనా తీసే ఆలోచన ఉందా..? అనడిగాడు జర్నలిస్టుడు… ఎక్కడ హిట్టయిందండీ బాబూ.. నాకూ తెలియదు..? అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు నారా రోహితుడు…
అదేమిటండీ, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదాని ఇంకేదో చెప్పబోయాడు జర్నలిస్టుడు… అదొకటి వచ్చీపోయిందని తెలుసో లేదో తెలియదు గానీ, మీరన్నిసార్లు అడుగుతుంటే ఓహో నిజంగానే ఆ సినిమా వచ్చిందనిపిస్తుంది అని నవ్వుతూనే బదులిచ్చాడు రోహితుడు…
అందరూ ఫక్కున నవ్వారు అక్కడే… ఈ వీడియో బిట్ చూసిన సోషల్ మీడియా జనం కూడా పకపకా నవ్వారు… వార్తలు చదివిన పాఠకులు, ప్రేక్షకులు కూడా బాగా నవ్వారు… కానీ నిజానికి ఈ ప్రశ్న వేసి నవ్వులపాలైంది ఎవరు..? ఇక్కడ రెండంశాలు గుర్తించాలి…
Ads
ఇండస్ట్రీ, ప్రేక్షకులు కూడా మరిచిపోతున్న దశలో మళ్లీ సుందరకాండ సినిమాలో హీరోగా వస్తున్నాడు నారా రోహిత్… చంద్రబాబునాయుడి తమ్ముడి కొడుకు… (లావుగా కనిపిస్తున్నాడు ప్రెస్‌మీట్‌లో…) సరే, తన పాత్ర ఏమిటో తెలియదు గానీ, ఓ ప్రధానపాత్రలో శ్రీదేవి విజయకుమార్… ఒకప్పటి హీరోయిన్… ఒకప్పుడు ప్రభాస్ హీరోయిన్…
22 ఏళ్లయింది తెరమరుగు… మళ్లీ తెర మీదకు ఇన్నేళ్ల తరువాత వస్తోంది… (మధ్యలో కొన్ని టీవీ షోలలో కనిపించేది…) విశేషమే… ఏమో, హీరోహీరోయిన్ల పాత్రలు కూడా బహుశా ముదురు మూలా నక్షత్రాలేమో…
ప్రెస్‌మీట్‌లో నారా రోహిత్ ఎక్కడా ఏ హిపోక్రసీ లేకుండా, నిజాయితీగా నిజాన్ని చెప్పాడు… నవ్వుతూనే ఆ సినిమా ఫ్లాప్‌ను స్వీకరించాడు… జోక్స్ కూడా వేయగలిగాడు… అరుదైన లక్షణం… మరీ సినిమా ఇండస్ట్రీలో ఆశ్చర్యపరిచే రేర్ క్వాలిటీ ఇది… 2009 నుంచీ ఫీల్డులో ఉంటే పడ్డ హిట్లు అరకొర… 2018 నుంచి చాలా గ్యాప్ తరువాత ఒక సినిమా, అదీ ఫట్ అని తనే అంగీకరిస్తున్నాడు… ఇన్నేళ్లు ఫీల్డులో ఉంటే కృత్రిమమైన మాస్ హీరో ఇమేజీ కోసం ఎప్పుడూ ప్రయత్నించినట్టు కనిపించలేదు…
పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి కాస్త బెటర్ మూవీ… ఆ తరువాత ఏవో వస్తున్నాయి, పోతున్నాయి… రోహితే చెబుతున్నట్టుగా కొన్ని వచ్చీపోయినట్టు కూడా ప్రేక్షకులకు గుర్తులేదు… సరే, ఇక్కడ మరో విషయం ఏమిటంటే..?
అసలు సినిమా టీమే నిరాశతో పెదవి విరిచేసిన ప్రతినిధి-2 హిట్టు, బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదానే ప్రశ్న ఆ జర్నలిస్టు ఎలా అడగగలిగాడు..? పైగా దానికి సీక్వెల్ ఉంటుందాని ప్రశ్న… తోటి జర్నలిస్టులు కూడా నవ్వుకునే ఆ ప్రశ్నను తనే అడిగాడా..? ఎవరైనా అడిగించారా..? ఏదో అడగబోయి, ఇలా మనమే నవ్వులపాలు కావడం దేనికి..? అసలే వేణుస్వామి వ్యవహారంలో తమకు సంబంధం లేనిది పూసుకుని, రాసుకుని వుమెన్ కమిషన్ వద్దకు వెళ్లి అంతులేని అప్రతిష్ట మూటగట్టుకున్న తరుణంలో ఇంకా ఇంకా ఇలాంటి ప్రశ్నలతో నవ్వులపాలు కావడం అవసరమా అధ్యక్షా..?!
Share this Article