.
ఈ సంక్రాంతి పందేం కోళ్ల బరిలో… ఓ అండర్ డాగ్‌గా వచ్చి, మరీ పవర్ ఫుల్ పంచ్ కొట్టిన హీరో శర్వానంద్..! సోకాల్డ్ భారీ వందల కోట్ల అట్టహాసాలు, కృత్రిమత్వాల నడుమ… ఓ చిన్న హీరో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఓ రాజు’ పేరిట ఓ ఫోర్ కొడితే… శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ పేరిట ఏకంగా ఓ సిక్స్ కొట్టాడు…
అత్యంత భారీ తోపు ఎలివేషన్ స్టార్ల సినిమాల నిర్మాతలకు, దర్శకులకు… ఓ పాఠం..! వేరే దర్శకుడైతే ఈ ‘నారీ నారీ నడుమ మురారి’ కథను ఎలా డీల్ చేసేవారో చెప్పలేం గానీ… ఈ దర్శకుడు రామ్ అబ్బరాజు ఏమాత్రం అసభ్యత, అశ్లీలత లేకుండా… వినోదాత్మకంగా డీల్ చేశాడు… ప్రథమ అభినందన తనకే…
Ads
ఒక ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ పరమ నాసిరకం ప్రజెంటేషన్… మారుతే ప్రధాన బాధ్యుడు… ప్రభాస్ తప్పేమీ లేదు, మారుతిని ఎంచుకోవడం తప్ప..! జననాయకన్ నిరవధిక వాయిదా… పరాశక్తి మటాష్… ఆ సినిమా ఎందుకు తీశారో నిర్మాతకు, దర్శకుడికి, హీరోకు కూడా తెలియదేమో బహుశా… అదీ నాసిరకం…
మన శివశంకర వరప్రసాద్ గారు సినిమా కొంత మేరకు మెప్పించింది గానీ… ఎక్కువగా అనిల్ రావిపూడి మార్క్ లాజిక్‌లెస్, టీవీలు- సోషల్ మీడియా బాపతు కామెడీ… కృత్రిమత్వం ఎక్కువ… కథాకాకరకాయ ఏమీ పట్టవు తనకు… ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి పరమ నాసిరకం… అందుకే ఈ పోటీలో కొట్టుకుపోయింది… ఐనా రవితేజ మారడు…
పెద్ద స్టార్ల నడుమ మెరిసింది చిన్న హీరోలే, కాలర్లు ఎగరేసిందీ వీళ్లే… నిజానికి శర్వానంద్ చాన్నాళ్లయింది తెరపై కనిపించకె… అప్పట్లో తనూ ఏవో పిచ్చి ప్రాజెక్టుల్లో చేశాడు… నవీన్ పోలిశెట్టి కూడా చాన్నాళ్లయింది రాక… ఇప్పుడూ ఇద్దరూ విడివిడిగా వచ్చారు… బరిలో కాలర్లెగరేశారు…
నారీ నారీ నడుమ మురారి సినిమా అభినందనల్లో ద్వితీయ ప్రాధాన్యం దక్కాల్సింది సీనియర్ నరేష్‌కు… దున్నేశాడు… రీఎంట్రీ తరువాత తను ఎంచుకునే పాత్రలు, వాటితో తను ఆడుకునే తీరు చెప్పుకోదగిందే… అసలే తన వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్లు, వివాదాలు తెలుసు కదా… ఇందులోనూ కాస్త అదే టైపు పాత్ర… 60 ఏళ్ల వయస్సులో ఓ యంగ్ లేడీతో ప్రేమ, ఆమెను లేపుకొచ్చి పెళ్లి చేసే యంగ్ హీరో… నరేష్ మెంటాలిటీకి తగినట్టు పంచ్ డైలాగులు… ఈ సినిమాకు రియల్ హీరో నరేషే…

కామెడీని కావాలని ఇరికించడం కాదు… కథలోనే కామెడీ… ఎక్కడా బిగి సడలకుండా క్లైమాక్స్ దాకా నవ్వుల్ని పంచడం చిన్న టాస్క్ కాదు… అందులో దర్శకుడు సక్సెస్… నిజానికి ఇద్దరు మహిళల నడుమ నలిగే మగాడి పాత్రలతో తెలుగులోనే బొచ్చెడు సినిమాలు వచ్చాయి… మొన్నటికి మొన్న రవితేజ సినిమా కూడా అదే కదా… కానీ ఈ శర్వానంద్ సినిమాను జాగ్రత్తగా, భలేగా డీల్ చేశారు…
నటీనటుల్లో శర్వానంద్‌కు వంక పెట్టడానికి ఏముంటుంది..? నటన తెలిసినవాడు… హీరోయిన్లు సంయుక్త మేనన్, సాక్షి వైద్య ఆ పాత్రలకు సరిపోయారు… నరేష్ లవర్‌గా సిరి హన్మంతు కూటా సూటైంది… చెప్పుకోవాల్సింది కామెడీ టీమ్‌ను… వెన్నెల కిషోర్, సత్య, సునీల్… కామెడీలో తలా ఏ చేయి వేశారు… చివరలో శ్రీవిష్ణు అప్పియరెన్స్ కూడా పాత్రోచితం… పాటలు సోసో… అవీ కాస్త క్యాచీగా ఉండి ఉంటే సినిమా సక్సెస్ మరో రేంజులో ఉండేది…!!
Share this Article