Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ దేశపు ఇరుకు గృహాల లోపల ఎన్నెన్ని వ్యథలున్నాయో తెలుసా?

August 13, 2024 by M S R

ఇంతకుముందు బాలీవుడ్ అంటే ఖాన్‌ల కాలం. ఇప్పుడు కపూర్‌ల కాలం. అయితే బాలీవుడ్‌లో దర్శకుల కాలం ఒకటి నడిచింది. శాంతారాం, గురుదత్, రాజ్‌కపూర్.. ఆ తర్వాత కాలంలో బాసు చటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, యష్‌చోప్రా.. ఇంకా నాకు తెలియని ఎంతోమంది. నటీనటులు ఎవరైనా కానీ, ఈ దర్శకుల పేరు చెప్పుకొని జనం థియేటర్లకు వచ్చేవారు. ఇప్పటికీ కొందరి పేరిట ఆ అభిమానం కొనసాగుతూ ఉంది.

బాసు చటర్జీ గురించి చెప్పాలి. ఆయన్ని బాలీవుడ్ కె.బాలచందర్ అనొచ్చు. జిగేలుమనే తారలు, పెద్ద పెద్ద సెట్టింగ్‌లతో మెరిసిపోతున్న హిందీ సినిమాల మధ్య మధ్యతరగతి జీవితాన్ని ప్రభావవంతంగా చూపించిన ఘనత ఆయనది. రాజస్థాన్‌లో పుట్టిన బెంగాలీ బాబు ఆయన. 1969తో మొదలుపెట్టి, 2011 దాకా సినిమాలు తీస్తూ ఉన్నారు.

బాలీవుడ్‌లో నేటికీ చెప్పుకునే ‘రజనీగంధా’, ‘చిత్‌చోర్’, ‘చోటీ సి బాత్’, ‘కట్టా మీటా’, ‘మంజిల్’ లాంటి సినిమాలు, వీటికి అతి భిన్నమైన ‘ఏక్ రుకా హువా ఫైసలా’.. అన్నీ ఆయన తీసినవే. ఆయన రెండో సినిమా ‘పియా కా ఘర్’ (1972). నాతోసహా చాలామందికి ఫేవరేట్. మరాఠీ సినిమా ‘ముంబయిచా జవయ్’ ఈ సినిమాకు మూలం. జయబాధురి, అనిల్ ధావన్ ప్రధాన పాత్రధారులు.

Ads

ముంబయి మహానగరంలో ఇరుకైన అద్దె ఇంట్లో భర్తతో జీవనం సాగించలేని కొత్త కోడలి కథ అది. ఎంతమంది ఊహించగలరు ఆ అంశం? ఎంతమందికి అర్థమవుతుంది ఆ విషాదం? అరే.. కొత్తగా పెళ్లయిన వాళ్లకు కాసింత జాగా ఇస్తే సరిపోతుందా? ఇంట్లో అడ్డంగా ఓ పరదా కట్టి అది మీ గది, ఇది మా గది అంటే చెల్లుతుందా? మనసు విప్పి మాట్లాడేందుకు భూగోళమంత, ఆకాశమంత స్థలం కావాలి వాళ్లకి. కానీ ఎలా? మహానగరంలో సాధ్యమేనా? మధ్యతరగతి మనుషులు అందుకోగలిగేదేనా?

ఏ మహానగరమైనా అదేగా పరిస్థితి. ఉమ్మడి కుటుంబాలు గొప్పవంటూ ప్రసంగాలిచ్చే వారికి ఈ సమస్యను ఎలా విప్పిచెప్పడం? ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లలో గదికొకరు చొప్పున గురక పెట్టే నిదురించేవారికి ఎలా అర్థం చేయించడం?

‘పియాకా ఘర్’ కాదు కానీ, తెలుగులో కూడా ఆ ఛాయలు తీసుకొచ్చిన సినిమా ఒకటి ఉంది. పేరు ‘సగటు మనిషి’. 1988లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. చంద్రమోహన్, సీత ప్రధాన పాత్రధారులు. సినిమా పేరులోనే కథ అర్థమైపోతుంది. మునిసిపాలిటీలో గుమాస్తా ఉద్యోగం చేసే చంద్రమోహన్‌కు ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు పెళ్లి చేశాడు. మరో చెల్లి పెళ్లికి ఉంది. అతనికి పెళ్లయింది. చిన్న ఇల్లు. ఒకటే గది. గుమాస్తా జీతానికి అంతకంటే పెద్ద ఇల్లు దొరికేదెలా? మరి కొత్త పెళ్లికొడుకు, పెళ్లికూతురు కలిసేదెలా? సంసార జీవితం గడిపేదెలా?

అందుకే చంద్రమోహన్ తల్లి నిర్మలమ్మ ఓ ఉపాయం ఆలోచిస్తుంది. గుళ్లో హరికథ అంటూ ప్రతి రాత్రీ చిన్న కూతుర్ని తీసుకుని బయటకు వెళ్తుంది. ఆ దంపతులకు ఏకాంతం అందించడం కోసం ఆ ఏర్పాటు. కూతురికిదంతా అర్థం కాదు. అర్థమయ్యే వయసూ లేదు. విసుక్కుంటున్న కూతురికి ఇదీ సంగతి అని ఆ తల్లి చెప్పలేదు. అందుకే ఓ రోజు హరికథ, ఇంకో రోజు బుర్రకథ అంటూ గుళ్లకు తిప్పుతుంది. అక్కడ ఏ కథా ఉండదు. కానీ గుడికొచ్చాక కొంతసేపు కూర్చోవాలంటూ కూతుర్ని కూర్చోబెట్టి ఆ రాత్రంతా అక్కడే గడుపుతుంది. సగటు మనిషి జీవితంలో అవన్నీ తప్పవు.

సినిమాలే కాదు, తెలుగు సాహిత్యం కూడా ఈ పరిణామాన్ని చాలా అరుదుగా పట్టుకుంది. మధురాంతకం నరేంద్ర రాసిన ‘చోటు’ అనే బీభత్సమైన కథ ఇందుకు ఉదాహరణ. మద్రాసు నగరానికి పనికోసం వెళ్లిన రాయలసీమ యువకుడు మద్దులేటి. అక్కడ ఓ చిన్న గదిలో ముడుచుకొని పడుకునే ఇద్దర్ని చూసి అతనికి ఆశ్చర్యం.‌ ఆ గది పక్కనే శ్మశానం. చితిమంటల వెలుగు. కట్టెలు కాలుతున్న శబ్దాలు. గది నిండా కిరోసిన్ వాసన.

‘శ్మశానం పక్కనే గది ఎందుకు తీసుకున్నావ్?’ అని అడిగాడు. నవ్వేసిన ఆ ఫ్రెండు ‘అవన్నీ అనుకుంటే ఇక్కడ ఉండలేం. పైగా పక్కనే శ్మశానం అని అద్దె తక్కువ పడింది’ అని అన్నాడు. పక్క రూములో ఓ కుటుంబం. నలుగురు పడుకునేందుకు అందులో చోటు చాలదు. అందుకే ముసలాయన్ని బాత్రూంలో పడుకోబెట్టారు. బాత్రూంలో మనిషి పడుకోవడమా? మద్దులేటి గుండెల్లో కలుక్కుమంది. మరి అగ్గిపెట్టెలాంటి ఆ ఇంట్లో వంటే చేసుకోవాలా? సామాన్లే దాచుకోవాలా? మనుషులే ఉండాలా? అందుకే ఈ ఏర్పాటు. బాత్రూంలోనే ఆయన పడక. దానికి కప్పు లేదు. వానొస్తే ఆ ముసలాయన పాలిథన్ కవర్ కప్పుకొని వణికిపోతూ గడపాలి.

ఎట్లా? ఎట్లాంటి జీవితాలు ఇవి? ఎవరి దృష్టిలో నిలిచే బాధలివి? ఈ దేశపు ఇరుకు గృహాల లోపల ఏముందో ఎప్పుడైనా ఆలోచించామా? విశాలమైన మైదానాలు చుట్టేస్తున్న మనం ఆ ఇరుకు ద్వారాల అవతల ఎంత మథనం జరుగుతుందో గమనించామా? కర్నూల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రులు ఇంటికి వస్తుంటే కొంతమంది పిల్లలు ఎదురయ్యేవారు. నిండా 15, 16 ఏళ్లు ఉండేవి. సైకిల్లో, స్కూటీలో వేసుకుని తిరిగేవారు. మొదట్లో చిరాకేసేది.

కానీ వాస్తవం అర్థమయ్యాక జాలేసింది. ఇళ్లల్లో చోటు లేక, ఉన్న చోటు చాలక, అక్కాబావలు, అన్నావదినలు ఉన్న కుటుంబాల్లో వాళ్లకు ఏకాంతం అందించడం కోసం కొందరు రాత్రిళ్లు ఇలా బయటకు వస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇలా కూడా ఉంటుందా అని భయపడ్డాను. ఇలా తిరిగేవాళ్లను దొంగలంటూ ముద్రేసి కొన్నిసార్లు పోలీసులు బలవంతంగా స్టేషన్లకు ఈడ్చుకెళ్తారు. దెబ్బలు కొడతారు. చీకటి అలవాటైన పిల్లలు అందులో జరిగే వ్యాపారాలకు అలవాటు పడతారు. అవన్నీ బయటకు రావు. మనకు తెలియవు.

ఎంత కాలం పోయినా ‘పియా కా ఘర్’లు, ‘సగటు మనిషి’లు ఇంకా సజీవంగానే ఉంటాయి. ఇవి ఇప్పుడప్పుడే తీరని సమస్యలు. ఈ దేశపు ఇళ్లల్లో ఇరుకుతనం పోయేదాకా, మనుషులు తమ కాళ్లు బార్లా చాపుకుని తృప్తిగా నిద్రపోయేదాకా పరిస్థితి ఇలాగే ఉంటుంది. తప్పదు. – విశీ (వి.సాయివంశీ) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions