నేషన్ వాంట్స్ టు నో అబౌట్ “బార్కింగ్”
———————-
NDTV ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మిగతా ఛానెల్స్ తో పోలిస్తే ఇప్పటికీ భిన్నమే. ఎంత సీరియస్ విషయాన్నయినా ఒక పరిమితికి లోబడే చర్చిస్తుంది. కొన్ని విలువలు, సంప్రదాయాలను పాటిస్తుంది. యాజమాన్యం రాజకీయ బంధాలు, ఛానెల్లో చైనా పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు, ఛానెల్ ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించిన కేసులున్నా- ఇప్పటికీ NDTV ముద్ర చెదిరిపోలేదు. రోజూ రాత్రి ఎనిమిదిన్నరకు అరగంటపాటు రియాలిటీ చెక్ పేరిట ఒక బర్నింగ్ ఇష్యు మీద ప్రత్యేక ప్రోగ్రాం ఉంటుంది… ఒక వార్త, ఆ వార్తకు సంబంధించిన చర్చ ఈ రియాలిటీ చెక్ స్వరూపం. పేరుకు తగినట్లు సీనియర్ టీవి జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ ఈ ప్రోగ్రాము చక్కగా నిర్వహిస్తున్నాడు.
Ads
Times Now- Republic టీవీ బాహా బాహి జుట్లు పట్టుకున్నట్లు మీడియా గొడవలకు సాధారణంగా NDTV దూరంగా ఉంటుంది. అయితే Republic టీవీ అర్ణబ్ గోస్వామి టీవీ రేటింగ్స్ కుంభకోణాన్ని NDTV రియాలిటీ చెక్ చాలా లోతుగా చర్చించింది. ముంబయ్ పోలీసులు అర్ణబ్ మీద కేసు పెట్టి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబయ్ పోలీసుల ఛార్జ్ షీట్ ఆధారంగా రియాలిటీ చెక్ పెద్ద వార్తను ప్రెజెంట్ చేసింది. టీవీలకు రేటింగ్స్ ఇచ్చే ఇదివరకటి బార్క్ అధిపతికి- అర్ణబ్ గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ మొత్తాన్ని శ్రీనివాసన్ జైన్ వర్డ్ ఆర్డర్ లో చదివి వినిపించాడు. బయటి ప్రపంచం విస్తుబోయే ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రధానమయినవి-
1. Times Now తో పాటు కొన్ని ప్రత్యర్థి ఛానెల్స్ రేటింగ్ తక్కువ చేయడానికి, Republic టీవీ రేటింగ్స్ పెంచడానికి ఒప్పందం కుదిరింది.
2 . టెలికాం రెగ్యులేటరీ అథారిటీ- ట్రాయ్ బార్క్ మీద పెత్తనం చెలాయించకుండా ప్రధాని కార్యాలయం కల్పించుకోవాలని బార్క్ మాజీ అధిపతి అడిగాడు. అర్ణబ్ సరేనన్నాడు.
3 . కేంద్ర సమాచార ప్రసార శాఖ Republic టీవీని భుజానికెత్తుకుని, ప్రత్యర్థి ఛానెల్స్ ను తొక్కేయాలి.
4. ఇలాంటి క్లిష్టమయిన విషయాల్లో AS కల్పించుకోవాలి అని బార్క్ మాజీ అధిపతి అడిగాడు. అర్ణబ్ హామీ ఇచ్చాడు. ( ఏఎస్ అంటే ఎవరో ఎవరికి వారు ఊహించుకోవచ్చు )
5 . బాలాకోట్ దాడులు ముందే అర్ణబ్ కు తెలుసు.
ఇంకా ఇలాంటి సంచలనాత్మక విషయాలు చాలా ఉన్నాయి. వీటిమీద బహుశా బార్క్ మాజీ అధిపతిని వివరణ కూడా అడిగినట్లున్నారు. ఆయన లాయర్ ఇచ్చిన సమాధానమిది- “వాట్సాప్ చాటింగ్ కు విలువ లేదు. కోర్టులో సాక్ష్యంగా నిలబడదు”. నిజమే. “మన వాళ్లు బ్రీఫ్డ్ మీ” అన్నది మీరేనా కాదా అని ఒక ముఖ్యమంత్రిని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగితే- “ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారండీ?” అని ఆయన అమాయకంగా అడిగాడు. నోట్లో మాట రాక రాజ్దీప్ తల కెమెరాకు కొట్టుకున్నాడు. నోట్ల కట్టల వీడియోలు, బ్రీఫ్డ్ ఆడియోలే నిజమని నిరూపించలేక వ్యవస్థలు దిక్కులు చూస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ వాట్సాప్ చాటింగ్!
వ్యవస్థల్లో లొసుగులు కొన్నిటిని కప్పి పెట్టవచ్చు. కానీ జనం మనసుల్లో ధర్మపీఠం ఒకటి ఉంటుంది. దాని ముందు ఎవరయినా ఒకటే.
అర్ణబ్!
వెదర్ టు బార్క్?
ఆర్ నాట్ టు బార్క్?
నేషన్ వాంట్స్ టు నో అబౌట్ బార్క్!………… By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article