… మీ ఊళ్లో స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మగపిల్లలకు సమాన సంఖ్యలోనో, కాస్త తక్కువగానో ఆడపిల్లలూ ఆడుతుంటారు. బోలెడన్ని మెడల్స్, కప్పులు వచ్చి ఉంటాయి. అందులో కొందరు జాతీయ స్థాయిలోనూ ఆడి ఉంటారు. వాళ్లంతా పెళ్లయ్యాక ఎందుకు ఆడరనేది ఎప్పుడైనా ఆలోచించారా? 130 కోట్ల దేశంలో పి.టి.ఉష, అశ్విని, మల్లీశ్వరి, సానియా, మేరీకోమ్, పి.వి.సింధు, మిథాలీ, బబిత, జరీన్.. గట్టిగా చెప్పుకుంటే వంద లోపు పేర్లు. S.ఇలవళగి అనే క్యారమ్ క్రీడాకారిణి రెండు సార్లు Carrom World Cup గెలిచింది. ఈ సంగతి ఎంతమందికి తెలుసు?
… పొద్దున్నే లేచి ఇల్లు ఊడుస్తూ, రాత్రుళ్లు అంట్ల గిన్నెలు తోముతూ, మధ్యాహ్నం బట్టలు ఉతుకుతూ, పిల్లలకు పాలు పడుతూ మనకు కనిపించే ఆడవాళ్లు ఒకప్పుడు ఆటల్లో రారాణులుగా పేరు పొంది ఉండొచ్చు. మైదానంలో చిరుతల్లా దూసుకుపోయి ఉండొచ్చు. పతకాలు, షీల్డులతో ఇల్లు నింపి ఉండొచ్చు. కానీ మనకు తెలిసినదంతా ఆమె ఓ ఇంటి ఇల్లాలు. బిడ్డల తల్లి. మనం మర్చిపోయినట్టే ఆమె కూడా తన గత జీవితాన్ని మర్చిపోయి పనుల్లో పడిపోతుంది.
… ‘సివరంజనియుం ఇన్నుం సిల పెన్‌గలుం’ (శివరంజని మరికొందరు మహిళలు) సినిమా చూశాను. కె.బాలచందర్ గారి దగ్గర సుదీర్ఘ కాలం సహాయకుడిగా పనిచేసిన వసంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళ రచయితలు అశోకమిత్రన్, ఆదవన్, జయమోహన్ రాసిన మూడు కథలతో తెరకెక్కిన Anthology Film ఇది. చివరి కథ నాకు చాలా నచ్చింది. అందుకు ప్రధాన కారణం శివరంజని పాత్ర చేసిన నటి ‘లక్ష్మిప్రియ చంద్రమౌళి’.
Ads
… లక్ష్మిప్రియ చంద్రమౌళి ఒకప్పుడు జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారిణి. Human Resource Managementలో పీజీ చేశారు. ఆపై సినిమాల్లో చేరి 2010 నుంచి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక అథ్లెట్ కావడం కాకతాళీయమైనా, ఆమెకు సరిగ్గా సరిపోయే పాత్ర. జాతీయ స్థాయిలో ఆడాలని ఆశ ఉన్నా పెళ్లి కారణంగా దానికి దూరమై, గృహిణిగా ఇంటిపనుల్లో పడిపోయిన తీరును చక్కగా తన నటనతో చూపించారు. ఎక్కువ భాగం కథంతా కిచెన్‌లో నడుస్తుంది. భర్త ఆఫీసుకు, బిడ్డ స్కూలుకు వెళ్లేదాకా యంత్రంలా పనిచేయాల్సిన గృహిణుల స్థితిని ఆమె అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా సినిమా ఆఖరులో బస్సు వెనుక పరిగెత్తే సన్నివేశం చాలా టచింగ్‌గా ఉంటుంది.
… లక్ష్మిప్రియ చంద్రమౌళిని చూస్తే నటి అర్చన గుర్తొస్తున్నారు. తన నటన చాలా సహజంగా ఉంటుంది. పాత్రలో ఒదిగిపోయే తత్వం. ఇటీవల సూర్య, అజయ్ దేవగన్, అపర్ణా బాలమురళి జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న తరుణంలో అదే వేదికపై ‘సివరంజనియుం ఇన్నుం సిల పెన్‌గలుం’ సినిమాకుగానూ జాతీయ ఉత్తమ సహాయ నటిగా లక్ష్మిప్రియ రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్నారు… విశీ
Share this Article