ఫాఫం, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ల తప్పేమీ లేదు… మాంచి జోష్, ఎనర్జీ, కోఆర్డినేషన్‌తో స్టెప్పులేశారు… ఇలాంటి డాన్సులకు ఇద్దరివీ మంచి ఫ్లెక్సిబుల్ బాడీస్… అయితే ఒక కుమ్రం భీం, ఒక అల్లూరి ఎక్కడ కలుస్తారో, ఆ మోడరన్ ప్యాంట్లూ షర్టులు బూట్లేమిటో, ఈ స్టెప్పులేమిటో, వీటిని చూసి ఆ విదేశీ మహిళ ఆనందంతో పొంగిపోవడం ఏమిటో…. ఏమోలెండి, అంతా రాజమౌళి కథ, మన ప్రాప్తం… ఎక్కడికో, ఎవరికో, ఏ కాలానికో, ఏ లింకులో పెట్టేసి, జనాన్ని మాయ చేసేసి, మరో బాహుభళీ తీసేయాలని తాపత్రయం… అసలు మనం ఇప్పుడు సదరు ఆర్ఆర్ఆర్ అనబడే సినిమా గురించి చెప్పుకోవడం కాదు… ఏదో పాట వదిలారు కదా… నాటు నాటు నాటు అని… నిజంగా ఇది రాజమౌళి సినిమా పాటేనా..? అందులోనూ ఆయన గారి షడ్డకుడు గారు కీరవాణి స్వరపరిచిన పాటేనా..? అనే డౌటు రావడం అయితే సహజం…
ఐనా పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల తప్పు కూడా ఏమీలేదు… కీరవాణి చెప్పినట్టు పాడకతప్పదు కదా… బాగానే పాడారు పాపం… మంచి జోష్ ఉంది గొంతుల్లో… కీరవాణి కూడా ఓ నాటు ఓ మోటు ఓ ఘాటు ట్యూన్ కోసం ట్రై చేసినట్టున్నాడు, కానీ అది మరీ ఆ స్పైసీనెస్ లేకుండా ఉంది… చెప్పాల్సింది నిజానికి చంద్రబోస్ గురించి… రాసీ రాసీ ఎలా రాయాలో మరిచిపోతున్నట్టున్నాడు… ఎర్రజొన్నలతో రొట్టెలేమిటో, అందులో మిరపతొక్కేమిటో… కీసుపిట్ట అంటాడు, అంటే విజిల్, మనమే ఊదాలి కదా, దానంతటదే ఎలా కూస్తుంది..? వీరంగం వేస్తారు గానీ వీరంగం సేయడం ఏమిటో… హేమిటేమిటో రాస్తూ పోయాడు… అంత చంద్రబోస్ కదాని ఊరుకుంటే ఎలా..? కీరవాణి కాస్త చెప్పుకోదగ్గ పాట రాయించుకోవాలి కదా… ఎలాగూ మా అన్నయ్య చూసుకుంటాడులే అని రాజమౌళి కూడా వదిలేసినట్టున్నాడు…
Ads
నిజానికి పాట చెత్తా ఉందని కాదు… అది ఆర్ఆర్ఆర్ రేంజులో… రాజమౌళి సినిమా రేంజులో లేదని..! రాజమౌళి సినిమా అంటే కీరవాణి కాస్త శ్రద్ధ పెడతాడు… మంచి ట్యూన్స్ వెతుకుతాడు… కానీ ఇప్పుడేమిటిలా..? అప్పుడెప్పుడో చిరంజీవి సినిమా వచ్చింది… అందులో నాటుకొట్టుడు, దంచికొట్టుడు, వీరకొట్టుడు అంటూ సంగీతదర్శకుడు తెగకొట్టేశాడు… ఈ నాటునాటునాటు పాట వింటుంటే అదెందుకో యాదికొస్తోంది… ప్రత్యేకించి చంద్రబోస్ వాడిన పదాలు కొన్ని నవ్వు పుట్టించాయి… ఊర నాటేమిటో, చెడ్డ నాటేమిటో, వెర్రి నాటేమిటో, పిచ్చ నాటేమిటో… ఓహ్, ఏదిపడితే అది రాసేస్తే దాన్ని నాటు అనుకోవాలా..? వోకే, వోకే… ఈమాత్రం పాటయినా కాస్త జోష్ ఉందంటే దానికి రాంచరణ్, ఎన్టీయార్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఓ కారణం… అంతే తప్ప ఆ బీట్ కాదు, ఆ పాట కంటెంట్ అసలే కాదు… ప్రేమరక్షిత్ ఆ స్టెప్పులకు ఏదో బాగానే కష్టపడ్డాడు… ఎటొచ్చీ చంద్రబోసే…!! ఏం భయ్యా… ఏమైంది..?! అన్నట్టు రాజమౌళి భయ్యా… పాట దుమ్మురేపాలి అంటే, దుమ్ము రేగే మట్టిపై హీరోలతో స్టెప్పులు వేయించడమా..?!
Share this Article