Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది…
అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన ఛాయలు…
ఆ సమయానికి పురుషులు పెద్దగా లేరు గానీ ప్రతి ఇంటా పిల్లలు, పెద్దలు, మహిళలూ- ధాన్యపు రాశుల మధ్య దైనందిన జీవన సంబురం. ఏదో ఒక పని చేసుకుంటూనో, పిల్లలకు స్నానం చేపిస్తూనో లేదా రొట్టెలు చేసుకుంటూనో చిరునవ్వుతో వాళ్ళు. కానీ వచ్చింది సంభాషించడానికి కావడంతో, కంటికన్నా చెవొగ్గి వినడం ముఖ్యం గనుక కెమెరాకు పని చెప్పకుండా ఎవరితో మాట్లాడాలా అని చూస్తూ ఇంకో వీధి మొదలులోకి అడుగు పెట్టేటప్పటికి ఒక్కపరి ఆ వీధిలో నిశ్శబ్ధం ఆవరించి ఉన్నది…
Ads
మనుషులెవ్వరూ లేరు. గాలి ఆత్మ మరేమీ లేదు. చూడగా ఒక ఇంటిముందు ఆ వీధిలోని వారంతా ఒకే చోట ముంగాళ్ళ మీద కూచుని ఉన్నారు. మధ్యలో ఒక మంచం. ఆ మంచంపై ఒక వృద్ధురాలు. ఆ పెద్ద మనిషిని ఒళ్ళోకి తీసుకుని ఆమె కూతురో లేదా కోడలో మౌనంగా విచారంగా ఉన్నది. ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది…
గమనిస్తే బోధపడింది. ఆ ఇంటి చెట్టు వయోభారంతో కృంగిపోయినది, నేడో రేపో రాలిపోతున్నది. ఇంత బలగాన్ని కనీ పెంచీ ఏమీ చేయనట్లు కాలగర్భంలో కలిసిపోనున్నది. మృత్యు శీతలంలోకి ఆ తొంభై ఏళ్ల వృద్ధురాలు వెచ్చగా జారిపోనున్నది.
నగరం తాలూకు అజ్ఞానం వల్ల అడిగాను, “డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళరా?” అని… వాళ్ళు విచిత్రంగా చూశారు నా వైపు…
నిండు జీవితం గడిపి వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడి సంప్రదాయం చికిత్స కాదు, ఆ అమ్మ సమక్షంలో బిడ్డలంతా నిర్వ్యాపారంగా గడపడం. సదరు మనిషిని వారి పరివారం మధ్యన ఒడిలోకి తీసుకుని ప్రతి సాయంత్రం గంటా రెండుగంటలు మౌనంగా కూచోవడం.
మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చే సంధ్యా సమయం అది. ఏ రోజు కాలం చేస్తే ఆ రోజును చివరి రోజుగా అంగీకరించడం. అంతే.
జీవన్మరణాలు తెలిసిన పెద్దలూ ఉన్నారు. ఏమీ తెలియని బాల్యమూ ఉన్నదక్కడ. అమాయకత్వం అనుభవమూ చేరుకున్న ఒక స్థితీ స్థాపకత.
ఆ అద్బుత సన్నివేశాన్ని ఆ అపురూప సాంగత్యాన్ని సహజ సుందరమైన జీవన బాంధవ్యాన్ని, మృత్యువు ప్రియత్వాన్నీ కళ్ళారా చూసి మెల్లగా తప్పుకున్నాను, మనస్పూర్తి అభివాదంతో..
అన్నట్టు, వీళ్ళ గిరిజనులు. కానీ మన ప్రభుత్వం వెనుకబడిన తరగతులుగానే గుర్తిస్తున్నది. షెడ్యూలు తెగలలో తమని కలపనందుకు ప్రస్తుత ప్రభుత్వంపై వీరంతా ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికల్లో బుద్ది చెప్పనున్నారని నేనొక వ్యాసం రాశాను. (https://muchata.com/angry-of-kaithi-lambadi-group/…) అదిప్పుడు చదవకపోవడమే మంచిది. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. జీవితాలే ఉండవు…
Share this Article