Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రఘుపతి రాఘవ రాజారాం… గాంధీమార్గం స్పూర్తితో ఓ నవభారతం…

December 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్దులు అన్న మహాకవి శ్రీశ్రీయే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అని కూడా అన్నారు . చిత్రం ఏమిటంటే ఈ మాటల్ని ఆయన ఓ ఎనభై ఏళ్ళ కింద అన్నారు . ఈ నవ భారతం సినిమా 1988 లో వచ్చింది . ఈ సినిమా వచ్చే రోజులకి యువత సమాజం గురించి బాగా ఆలోచించేవారు . బహుశా ఇలాంటి యువత 2000 దాకా అంటే ఇరవయ్యో శతాబ్దం దాకా ఉంది .

కానీ 21 వ శతాబ్దం యువత పూర్తిగా మారిపోయింది . నా ఇల్లే వైకుంఠం నా బొందే కైలాసం యుగంలోకి జారారు . ఇరవయ్యో శతాబ్దం వరకు యువత ముందు యుగం దూతలయితే ఈ శతాబ్దం యువత పుట్టుకతో వృద్దులు అయిపోయారేమో అని అనిపిస్తుంది .

Ads

ప్రకాశం జిల్లా ప్రజా నాట్యమండలి వారు 1970 s,1980 s లో తెలుగు సినిమా రంగానికి సామాజిక సినిమాలను అందించి ఎంతో సేవ చేసారు . ముఖ్యంగా టి కృష్ణ , పోకూరి వారు . 1989 జనవరిలో వచ్చిన ఈ నవ భారతం సినిమా కూడా పోకూరి వారిదే . పోకూరి బాబూరావు , పోకూరి వెంకటేశ్వరరావు ప్రభృతులు నిర్మించారు . ప్రజా నాట్యమండలి సారధులతో సాన్నిహిత్యం ఉన్న ముత్యాల సుబ్బయ్య దర్శకులు .

ప్రజా నాట్యమండలిలో మరో ముఖ్యుడయిన మరుధూరి రాజా ఈ సినిమాకు కధ , మాటల్ని అద్భుతంగా వ్రాసారు . యం వి యస్ హరనాధరావు సోదరుడే ఈ రాజా . అలాగే ప్రజా న్యాయమండలి సన్నిహితులు అయిన జాలాది , వంగపండు , అదృష్ట దీపక్ పాటల్ని వ్రాసారు . ఎర్రగానే ఉంటాయి . పాడిన వారిలో మరో ముఖ్యుడు వందే మాతరం శ్రీనివాస్ కూడా ఉన్నారు . ఆయనతో పాటు బాలసుబ్రమణ్యం మనో , జానకమ్మ , శైలజ , లలితా సాగరి పాటల్ని పాడారు .

కధ ఏంటంటే : నిరుద్యోగ యువకులయిన రాజశేఖర్ , నరేష్ , శుభలేఖ సుధాకర్లను వాళ్ళ స్నేహితురాలు జీవిత తన జీవితాన్ని నాశనం చేసిన చీకటి పల్లె అనే గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగులుగా పంపుతుంది . ఆ గ్రామంలో నరకాసుర పాలన చేస్తూ ఉంటాడు ప్రెసిడెంట్ నూతన్ ప్రసాద్ .

అమాయక ప్రజలకు చదువు , వైద్యం , పంటలకు సరయిన ధరలు ఇవ్వకుండా దోపిడీ చేస్తుంటాడు . ఈ ముగ్గురు మిత్రులు గ్రామస్తులలో చైతన్యాన్ని నింపి మోతుబరులను పోలీసులకు అప్పచెపుతారు . న్యాయమూర్తి వీరి నిస్వార్ధ సేవలను పరిగణనలోకి తీసుకుని శిక్షగా మరో గ్రామాన్ని సంస్కరించమని సామాజిక శిక్షను విధిస్తారు . నలుగురూ ఆ కొత్త గ్రామానికి తరలటంతో సినిమా ముగుస్తుంది .

సినిమాలో మహాత్మాగాంధీ పిలుపయిన Go back to villages ను న్యాయమూర్తి హైలైట్ చేస్తారు . సినిమాలో మహాత్మాగాంధీకి ఎంతో గౌరవాన్ని ఇవ్వబడింది . ముగ్గురు హీరోలకు రఘుపతి , రాఘవ , రాజారామ్ అనే పేర్లు సింబాలిగ్గా పెట్టబడ్డాయి .

వామపక్ష భావజాలం కల ప్రజా నాట్యమండలి వారు గ్రామాలలో చదువు , వైద్యం , మూఢాచారాల నిర్మూలన వంటి అంశాలపై ఫోకస్సుతో ఈ సినిమాను నిర్మించారు . ఈనాడు ఆ పరిస్థితులు లేకపోయినా ఇంకా దోపిడీ జరుగుతూనే ఉంది .

గ్రామీణాభివృద్ధి మంత్రి Pawan Kalyan గ్రామాల మీద ప్రత్యేక శ్రధ్ధ చూపుతున్నారు . ఆయన ఒక యువ సైన్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న మారు మూల గ్రామాలకు నిస్వార్ధ వలంటీర్లుగా పంపితే దేశానికే ఆదర్శం అవుతుంది . ఈ పోస్ట్ చదివిన వారిలో ఎవరయినా పవన్ కళ్యాణ్ కు సన్నిహితులు ఉంటే వారికి చేరవేయమని నా మనవి .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగుంటాయి . గ్రామంలో పిల్లల్ని స్కూలుకు రప్పించే ప్రయత్నంలో పాడే పాట బాగుంటుంది . ఎర్ర గులాబీ తోటల్లో ఎదిగే నవ్వుల పాపాయీ చాచా నెహ్రూ బాటల్లో జాతికి వెలుగే మీరోయి అంటూ సాగుతుంది . కట్టండి కట్టండి కాడి జోడెద్దు , ఘల్లుమందిరో , సిగ్గు సిగ్గంటవ్ సిగ్గేందిరో అంటూ సాగే పాటల చిత్రీకరణ బాగుంటుంది .

ప్రధాన పాత్రల్లో ముగ్గురు హీరోలతో పాటు జీవిత , కల్పన , నూతన్ ప్రసాద్ , నర్రా , సుత్తి వేలు , వాసుజీ , చలపతిరావు , మహర్షి రాఘవ , రాళ్ళపల్లి , పి యల్ నారాయణ , నిర్మలమ్మ , సంజీవి , కె విజయ , పి జె శర్మ , సాయికుమార్ , మరెంతో మంది ఔత్సాహికులు నటించారు .

ఒంగోలు , ధేనువుకొండ , మల్లవరం , పేర్నిమిట్ట పరిసరాలలో షూటింగ్ చేయబడింది . పోకూరి వారి జిల్లా కదా ! చక్కటి సందేశాత్మక , యువతని ఆలోచింపచేసే ఈ సినిమా యూట్యూబులో ఉంది . నేటి యువత , ఉపాధ్యాయులు తప్పక చూడాలి . వృద్ద యువకులను ముందు యుగం దూతలుగా ప్రేరేపించాలి .

నేను పరిచయం చేస్తున్న 1200 వ సినిమా . కరోనా సమయంలో కాలక్షేపానికి ప్రారంభించిన ఈ పాత సినిమాల పరిచయం నాకు ఎంతో మంది ఆప్త స్నేహితులను అందించింది . ధన్యోస్మి .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రఘుపతి రాఘవ రాజారాం… గాంధీమార్గం స్పూర్తితో ఓ నవభారతం…
  • ఛావా, పుష్ప2 బలాదూర్… ‘ధురంధర్’ అన్ని రికార్డులూ పగలగొడుతున్నాడు…
  • Bhavana… ఈ కుళ్లు వ్యవస్థతో పోరాడుతున్నఓ రియల్ స్టార్…
  • మాయాబజార్… మరికొన్ని చెప్పుకునే సంగతులిలా మిగిలిపోయాయ్…
  • పల్లెపై బీసీ బావుటా..! తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న విశేష మార్పు..!!
  • రేవంత్ ఆరోపణకు నో కౌంటర్..! ఎన్డీయేలోకి బీఆర్ఎస్..? సంకేతాలన్నీఅవే..!!
  • * మి లార్డ్… దయచేసి మా కొడుక్కి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి… *
  • ఒరిజినల్ ఎడిటర్ కిడ్నాప్… ఆ ప్లేసులోకి ఓ ఫేక్ ఎడిటర్… తర్వాత..?!
  • మరో మెగా ఈవెంట్ చేస్తారు సరే… మరి తెగిన పాత పతంగుల మాటేంటి..?
  • వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions