కొన్ని పత్రికలయితే మరీ అప్రధానంగా కవర్ చేశాయి… కొన్ని పర్లేదు… అదేమిటంటే..? నక్సలైట్లు ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నారనే వార్త… చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా పోలీసుల ఆరోపణ ఇది…
సరే, అనేకసార్లు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, బదనాం చేయడం కోసం పోలీసులు నక్సలైట్ల మీద పలు ఆరోపణలు చేస్తుంటారు… ఇదీ అలాంటిదే కావచ్చు, కాకపోవచ్చు… కానీ నిజమే అయితే మాత్రం..? ఇన్నేళ్ల వేనవేల త్యాగాల, రక్త పోరాటాల చరిత్రకు మకిలి పట్టినట్టే… కఠినంగా ఉన్నా నిష్ఠురసత్యమే…
నక్సలైట్ల పోరాటం ఉగ్రవాదం కాదు, అది రాజ్యం మీద తిరుగుబాటు… అంతిమ లక్ష్యం అధికారమే కావచ్చు గాక, కానీ తన చుట్టూ కొన్ని నైతిక పరిమితులు కూడా గీసుకుని మరీ సాగించే పోరాటం… రాజ్యం మీద పోరాటానికి ఎన్ని ఎత్తుగడలైనా ఉండవచ్చుగాక… దాడులు, రక్తపాతం, హింస లేకుండా పోరాటాలు ఉండవు… కానీ..?
Ads
నిజంగానే పోలీసులు చెబుతున్నట్టు… నక్సలైట్లకు నిధులు అందే రూట్స్‌ను కట్ చేస్తుండటం వల్ల నక్సలైట్లకు ఆర్థికంగా కటకట ఏర్పడి ఉండటమూ నిజమే కావచ్చు… ఐనాసరే, ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నారనే వార్తే ఒక విభ్రమకు గురిచేస్తోంది…
ఏదో నక్సలైట్ల స్థావరంపై దాడి చేసినప్పుడు 50, 100, 200, 500 ఫేక్ కరెన్సీ నోట్లతో పాటు ఓ నకిలీ నోట్ల ముద్రణ యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు… ఇది పట్టుబడటం ఇదే మొదటిసారి… ఆ ఫేక్ కరెన్సీని చెలామణీలోకి తెస్తున్నప్పుడు, అనేకమంది అమాయకులు పోలీసులకు చిక్కి కేసులపాలై ఇక్కట్ల పాలవుతారు… అంతిమంగా అది జనానికే నష్టదాయకం…
ఒక ఐఎస్ఐ మన దేశాన్ని ఆర్థికంగా డిస్టర్బ్ చేయడానికి ఓ పరోక్ష యుద్ధవ్యూహంగా భారీ ఎత్తున నకిలీ కరెన్సీ ప్రింట్ చేసి మన దేశంలోకి డంప్ చేస్తుంటుంది… నోట్ల రద్దు వెనుక కారణాల్లో ఇదీ ఒకటని చెబుతుంటారు… ఐనాసరే ఐఎస్ఐ ఆగదు, ఆగడం లేదు… అది ఉగ్రవాదం, అది ఓ దేశంపై పరోక్ష యుద్ధం… నక్సలైట్లు కూడా ఇలాగే సమర్థించుకుంటారా..? మరోవైపు రకరకాల మాఫియా గ్యాంగులు కూడా నకిలీ నోట్లను పకడ్బందీగా సొసైటీలోకి పంప్ చేస్తుంటాయి…
అబ్బే, ఏవో కొన్ని అవసరాల కోసమే స్వల్ప స్థాయిలో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాం అనే సమర్థన కూడా చెల్లదు… ఒకవైపు భారీగా కేడర్‌ను కోల్పోతోంది… కొత్త రిక్రూట్‌మెంట్లు లేవు… ముఖ్య నేతలే తలోదిక్కూ అయిపోతున్నారు… రక్షణే ఇప్పుడు గగనమైపోతోంది… ఈ స్థితిలో ఇలాంటి ఫేక్ కరెన్సీ ముద్రణ వంటి తప్పులు (?) ఉద్యమాన్ని ఇంకేవైపు తీసుకుపోనున్నాయో..! (డిస్‌క్లెయిమర్ :: పోలీసులు చెబుతున్న నకిలీ కరెన్సీ ముద్రణ అనే వార్త నిజమే అయ్యే పక్షంలో మాత్రమే…)
Share this Article