నయనతార నటించిన అన్నపూరణి వివాదం తెలుసు కదా… రీసెంటుగా అందరికీ క్షమాపణలు చెప్పింది… ఇకపై ఇలాంటి తప్పులు చేయను అని లెంపలేసుకుంది… చాలా బరువైన హృదయంతో రాస్తున్నాను అంటూ బాబ్బాబు ఈసారి క్షమించేయండి అని విజ్ఞప్తి చేసుకుంది… ఎందుకు..?
ఆ సినిమా కథ విని అంగీకరించినప్పుడు ఆ సోయి లేదు… నటిస్తున్నప్పుడు లేదు… థియేటర్లలో రిలీజ్ చేస్తున్నప్పుడు లేదు… ఎక్కడో కేసు నమోదైనా కనీసం వెనక్కి తిరిగి చూసుకోవాలనే సోయి కూడా లేదు… విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెతోపాటు నిర్మాతలు (జీ స్టూడియోస్ కూడా) నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధి మోనికా షెర్గిల్ మీద కూడా కేసు పెట్టారు, నోటీసులు జారీ చేశారు…
Ads
పోనీ, థియేటర్లలో ఏమైనా పాసైందా అంటే అదీ లేదు… వరల్డ్ వైడ్ కలెక్షన్లు జస్ట్, 5 కోట్లు మాత్రమే… అందులో సగం ఆమె పారితోషికమే ఉంటుంది… ఈలోపు ఈ కేసు… మరోవైపు భర్త విఘ్నేశ్ శివన్‌కూ ఎల్ఐసీ లీగల్ నోటీసులు జారీ… సోషల్ మీడియాలో సినిమా మీద భారీ ట్రోలింగ్… ఆమె సగటు హిందువుల మనోభావాలను, మతవిశ్వాసాల్ని దెబ్బతీసినట్టుగా పోస్టులు వైరల్…
అసలు సినిమాలో అందరికీ రుచించని అంశం ప్రధానంగా ఒకటే… బిర్యానీ అద్భుతంగా రుచిగా రావడానికి, వంటల పోటీలో గెలవడానికి ఓ బ్రాహ్మణ పడతి ముస్లిం వేషధారణతో మాంసాహారం వండాలని సూచించిన ఆ క్లైమాక్స్…
అసలు మతానికీ వంటలకూ సంబంధం ఏమిటి..? వేషధారణకూ వంట అద్భుతంగా రావడానికి లంకె ఏమిటి..? సినిమా చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కింది… అంటే… దద్యోదనం బాగా వండాలంటే జంధ్యం వేసుకుని, పంచె గోచీ వేసుకుని, నొసటన నామాలు దిద్దుకుని, ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థించి వంట చేయాలా..? సరే, మళ్లీ ఆ మొత్తం కథలోకి ఎందుకులే గానీ… కథ, కథనం, క్లైమాక్స్ ఏమీ పట్టని నయనతారకు నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీలు ఆ సినిమాను తమ కంటెంటు నుంచి పీకేశారు… అది ఆమెకు భారీ షాక్…
(అవునూ, అన్నపూర్ణ అంటేనే ఆహారాన్నిచ్చే అమ్మ అని కదా… మళ్లీ ఆమెకు అన్నపూర్ణి లేదా అన్నపూరణి అనే పేరు దేనికి..? ఖచ్చితంగా లేడీయే అని చెప్పడానికి అలా ఆ ఆడ పేరును కూడా మరింత ఫిమేలైజ్ చేశారా..?)
సినిమాను ఎడిట్ చేసేవరకు తమ నిర్ణయంలో మార్పు లేదని నెట్‌ఫ్లిక్స్ తేల్చిపారేసింది… అదేమో కష్టం, ఆ క్లైమాక్స్ ఎడిట్ చేయడం కుదరదు… నేను గొప్పగా తీస్తున్నాను అనుకున్నాడు దర్శకుడు… కథ, క్లైమాక్స్ ముందే చూసుకోవల్సిన నయనతార గానీ, నిర్మాతలు గానీ లైట్ తీసుకున్నారు… అదీ అసలు సమస్య…
నిజానికి దర్శకుడో, నిర్మాతలో స్పందించలేదు… కానీ నయనతార మీదే ట్రోలింగ్ భారీగా సాగుతోంది… జీ5, నెట్‌ఫ్లిక్స్ తమ నిర్ణయానికి కట్టుబడ్డాయి… పెరుగుతున్న ఈ నెగెటివిటీ ఆమెకు భావి అవకాశాల్ని కూడా తగ్గిస్తాయి, ఓటీటీలు ఆమె ప్రతి సినిమాను ఇక స్కానింగ్ చేసి, ఏ వివాదమూ రాదని నమ్మితేనే కొంటాయి…
ఇక దీంతో తప్పనిసరై నయనతారే స్పందించింది… హైలీ పెయిడ్ సౌత్ ఇండియన్ ఫిమేల్ స్టార్ ఆమె.,. సో, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో క్షమాపణల పత్రం పొందుపరిచింది… నిజానికి నయనతార ఈ క్లైమాక్స్ వల్ల ఈ కష్టాన్ని ఊహించలేదు గానీ తను దేవుళ్ల పట్ల విశ్వాసే… నాస్తికురాలు కాదు.., ఒక సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన ఈ డయానా మరియమ్ కురియన్ అలియాస్ నయనతార ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్లను కించపరిచిన దాఖలాలు కూడా లేవు…
తమ పెళ్లయ్యాక కూడా తిరుమలకు వెళ్లొచ్చినట్టు గుర్తు… ఆ క్షమాపణపత్రంలో కూడా ఆ వివరణే ఇచ్చుకుంది… దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు తరచూ తిరుగుతాననీ చెప్పుకుంది… అదేసమయంలో ఒకసారి సెన్సార్ ఆమోదించాక ఆ సినిమా పట్ల ఓటీటీ వేదికల వ్యతిరేక నిర్ణయాలు ఎందుకని ప్రశ్నించింది… ఏ దశలోనూ ఓటమిని అంగీకరించకూడదనేది మా సినిమా స్పూర్తి అనీ చెప్పుకుంది… ఆమె మరిచిపోయిన సంగతి ఏమిటీ అంటే..? ప్రస్తుతం సోషల్ మీడియాయే సినిమాలను సెన్సార్ చేస్తోంది..!!
Share this Article