Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!

May 11, 2026 by M S R

.

నిన్నటి ప్రధాని మోడీ పర్యటన పరోక్షంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఉపయుక్తం కాబోతోందా..? ఇప్పుడు తెలంగాణ, ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఇదే చర్చ… నిన్నటి మోడీ పర్యటన, మీటింగ్ సక్సెసైందా లేదానేది కాదు… మోడీ వంటి ప్రధాని నోటి వెంట వచ్చే ఒక మాట, వేసే ఒక అడుగు వెనుక ఓ మర్మం ఉంటుంది… ఓ వ్యూహం ఉంటుంది కాబట్టి చర్చ…

ప్రత్యేకించి హైదరాబాాదులో ఉన్న పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇళ్లకు వెళ్లి దాదాపు రెండుగంటలకుపైగా గడిపి… పనిలోపనిగా రాజకీయ వ్యవహారాలు, హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు, రాబోయే సాధారణ ఎన్నికల నాటిని అనుసరించాల్సిన వ్యవహారాలు కూడా చర్చించడంతో ఇది పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది… నిజంగానే దీనికి విశేష ప్రాధాన్యం ఉంది…

Ads

ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఓ కూటమి… సక్సెసైంది… తెలంగాణలో కూడా ఇక కూటమి తరఫున రాజకీయాలు ప్రారంభించబోతున్నట్టేనా..? మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఉపఎన్నికల నాటికి ఈ కూటమి తరఫున చర్చలు, ప్రయత్నాలు ఏమీ లేవు… చంద్రబాబు సైలెంటుగా ఉన్నాడు… కానీ విశ్వనగర ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇంపార్టెంట్…

ఎందుకంటే..? ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీయార్ మోడీని ప్రసన్నం చేసుకోవడానికి, మోడీ కరుణిస్తే విలీనానికీ ప్రయత్నిస్తున్నాడు… ఈమాట ఎవరో కాదు అన్నది ఆయన బిడ్డ కవిత… రాష్ట్ర బీజేపీలోని తన కోవర్టులు కూడా రెడీ రెడీ అంటున్నారు… కానీ చంద్రబాబుకు అది నచ్చదు… ఏపీలో చంద్రబాబుతో, తెలంగాణలో కేసీయార్‌తో కలిసి నడవడం బీజేపీకే దెబ్బ… ఒక కమలం ఒరలో రెండు పరస్పర ప్రత్యర్థి కత్తులు ఇమడవు కూడా… (ఒకే ఎన్డీయేలో టీడీపీ, బీఆర్ఎస్ ఉండలేవు…)

ఎంతోకొంత తెలంగాణలో తెలుగుదేశానికి ఓట్లున్నాయి… మళ్లీ పూర్వ వైభవం వచ్చేంత సీన్ లేదు గానీ… ఉనికి కోసం కొంత ఎదగాలనేది చంద్రబాబు ప్లాన్… దానికి బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలనేది ఆలోచన… తద్వారా కమ్మ, కాపు సెటిలర్ల వోట్లు, తెలంగాణలోని తెలుగుదేశం- బీజేపీ సంప్రదాయ వోట్లు కలిసొస్తే… మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పవచ్చునని ప్లాన్…

అయితే అదంత సులభం కాదు… అది తనకూ తెలుసు… తెలంగాణ సమాజం చంద్రబాబు పట్ల ఈరోజుకూ విముఖమే… తన ఎవరితో కలిసి వస్తే వాళ్లకు అది దెబ్బ… అందుకని బీజేపీలోని ఓ సెక్షన్ నథింగ్ డూయింగ్, తెలుగుదేశం వద్దు, అది ఏపీకి మాత్రమే పరిమితమైన కూటమి, అంతే… పోతేగీతే కేసీయార్‌తోనే పోదాం అంటారు కొందరు… (నిజానికి సొంతంగా ఎదగడమే కరెక్టు మార్గం, తమిళనాడు ఫలితాలు చెప్పిన గుణపాఠం కూడా అదే)…

ఎంతసేపూ ఏదో ఓ పార్టీకి తోకగా ఉండిపోతే, ఇంకెప్పుడు సొంతంగా జెండా ఎగరేస్తాం అనేది సగటు బీజేపీ అభిమాని బాధ కూడా… ఈ స్థితిలో బీజేపీ డైలమా… కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఏకంగా ప్రధాని వెళ్లి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చలు జరపడంతో ఆట రసకందాయంలో పడుతోంది… ఒకవేళ నిజంగానే ఏపీ కూటమే తెలంగాణలో పోటీచేస్తే… రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది… (ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపికి బీ టీమ్ అనే ప్రచారాన్ని జనంలోకి బలంగానే తీసుకుపోయింది)…

ఎలాగంటే..? బీఆర్ఎస్ ఎంతసేపూ తన సోషల్ మీడియా మాయలోనే గిరగిరా తిరుగుతోంది తప్ప, జనంలో ఆదరణ ఏమీ రావడం లేదు… ఉపఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు చెప్పిన నిజం అదే… సో, ఒకవైపు తెలంగాణ సమాజం ఇష్టపడని జనసేన, తెలుగుదేశంతో కూడిన బీజేపీ కూటమి, మరోవైపు ఈరోజుకూ తెలంగాణ సమాజంలో వ్యతిరేకత తగ్గని బీఆర్ఎస్… ఇదీ రేవంత్ రెడ్డి అనుకూలం… (తెలంగాణపై ఆంధ్రా పార్టీల పెత్తనం అనే క్యాంపెయిన్‌కు ఛాన్స్ దొరుకుతుంది… ఇక్కడ గురువు, శిష్యుడు కథలు చెల్లవు)…

తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మాని బాధపడిన ప్యూర్ ఆంధ్రా పవన్ కల్యాణ్, తెలంగాణ ఏర్పడటానికి వ్యతిరేకంగా నానా ప్రయత్నాలు చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకి చంద్రబాబు… వాళ్లతో బీజేపీ కలిసొస్తే అది బీజేపీకే దెబ్బ… జనం ఆ రెండు పార్టీల తెలంగాణ వ్యతిరేక ధోరణులను మరిచిపోలేదు..,

సరే, బీజేపీ- బీఆర్ఎస్ కలిసొస్తే..? అప్పుడిక స్ట్రెయిట్ ఫైట్… తెలంగాణ కాంగ్రెస్‌కు మరింత మేలు… ఎటొచ్చీ జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ మంచి ఫైట్ ఇస్తుంది… నాయకత్వ లోపాలున్నాయి గానీ నగర బీజేపీకి మోడీ ఫ్యాక్టర్ పెద్ద ప్లస్ పాయింట్… (తల్లీబిడ్డ బాపతు వ్యాఖ్యల నెగెటివ్ ఇంపాక్ట్ ఏమీ లేదు పెద్దగా)…  ఇక బీఆర్ఎస్ పెద్దగా పోటీ ఇవ్వలేదు… అదొక్కటే రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకోవాల్సిన అంశం..!

ఇక్కడే మరొకటీ… తమిళ అన్నామలైలాగే బండి సంజయ్ దూకుడు ధోరణి పార్టీకి తెలంగాణలో ఉపయోగపడాలి నిజానికి… కానీ, కొడుకు చేష్టలు, కేసులు, డర్టీ వ్యవహారాలతో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది… ఇది తనకూ నష్టం, సమర్థనకు పార్టీకీ కష్టం..! ఎలా దిద్దుకోవాలో సంజయే ఆలోచించుకోవాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …
  • ఇది యూనివర్శల్… ఇంత భట్టీయం పుస్తకం మరొకటి లేదు…
  • ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…
  • మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions