.
‘‘నీ పో మోనే విజయ’’… కేరళలో రేవంత్ రెడ్డి ప్రయోగించిన ఈ సెటైరిక్ స్లోగన్ ఎంత పేలిందంటే… ఎనభయ్యేళ్ల వృద్దాప్యంలోనూ సీఎం కుర్చీ వదలని, వచ్చే టరమ్ కూడా ఆశించే పినరై విజయన్‌కు గట్టిగా సెగ తగిలింది… ఉడుక్కున్నాడు… ఎదురుదాడికి దిగాడు… కానీ ఆ ఎదురుదాడి పేలవంగా ముగిసిపోయింది… ఇప్పుడే కేరళ ఎన్నికల ప్రచారం ముగిసింది కదా… ఈసారి హైలైట్ రేవంత్ రెడ్డి ప్రచారమే…
నిజానికి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ రెండూ ఇండికూటమి… యాంటీ బీజేపీ… కానీ కేరళ ఈక్వేషన్లు వేరు… పేకాట పేకాటే… కాకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే గెస్ట్ వక్తలు ఏదో అలా వస్తారు, ఏవో నాలుగు మాటలు చెబుతారు, వెళ్లిపోతారు… విజయన్ మీద కూడా స్వరాష్ట్రంలో పెద్దగా విమర్శల దాడి ఉండేది కాదు… కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడ అడుగుపెట్టాడో సెగ బాగా తగిలింది…
Ads
అన్నట్టు… పైన చెప్పిన హైలైట్ స్లోగన్ ఏమిటంటే… మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘నరసింహం’ సినిమాలోని ఫేమస్ పంచ్ డైలాగ్… నేమం నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో రేవంత్ మాట్లాడుతూ.., “Nee po mone Vijaya” (వెళ్లిపో విజయ) అంటూ పినరయి విజయన్ రాజకీయ ‘ఎక్స్‌పైరీ డేట్’ ముగిసిపోయిందని ప్రకటించాడు… ఇది కేరళలో బాగా పేలింది… ‘‘ఇక చాల్లే దిగిపో, ఇక వెళ్లిపో’ అనేవి ఆ స్లోగన్ అర్థాలు… రాజకీయ పరిభాషలో… ‘‘ఉద్దరించావు గానీ ఇక చాలించు’’ అని…
దీంతో ఈసారి ప్రచారం యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ అన్నట్టు గాకుండా… “పినరయి వర్సెస్ రేవంత్” అన్నట్లుగా మారిపోయింది… Ra_Re… అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకునే ప్యూర్, రేర్, కోర్ బాపతు నినాదం కాదు ఇది… రాహుల్- రేవంత్ అని… ఫస్ట్ విడతలో వెళ్లినప్పుడు… తెలంగాణ మోడల్‌ను ప్రమోట్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి, ఈ మోడల్ పాటించండి, డెవలప్ అవుతారు అన్నట్టు విసిరాడు మాటల్ని…
విజయన్‌కు ఊపిరాడలేదు… తెలంగాణతో పోలిస్తే కేరళం ఏయే అంశాల్లో ముందంజలో ఉందో గణాంకాలు ఏకరువు పెట్టాడు… దీంతో రేవంత్ రెడ్డి అదే సోషల్ మీడియా ద్వారా ‘‘కేరళ అభివృద్ధికి 60 ఏళ్లు… అందులో మా యూడీఎఫ్ పాత్ర కూడా ఉంది, అంతా నువ్వే ఉద్దరించలేదు… మా తెలంగాణలో కేసీయార్ పాత లెక్కల్ని, నీ పాత దోస్తానాతో ఏకరువు పెడితే ఎలా..? ఇదుగో ఇదీ తెలంగాణ సంక్షేమ మోడల్’’ అని గణాంకాలతో తిరుగుదాడికి దిగాడు…
అంతేకాదు, ఇతర సీపీఎం నాయకుల టైపు కాదు విజయన్… అల్లుడికి మంత్రి పదవి, బిడ్డ కంపెనీకి చెల్లింపులు, సాక్షాత్తూ సీఎంవో సాయంతో గల్ఫ్ నుంచి ‘విదేశాంగ శాఖ ప్రోటోకాల్ బాక్సుల్లో’’ బంగారం స్మగ్లింగ్… అన్నింటికీ మించి శబరిమల (అయ్యప్ప గోల్డ్ ప్లేట్ల కుంభకోణం) గోల్డ్ స్కామ్… బోలెడు మరకలు… కేరళలో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు విజయన్ మరకల మీద…
తొలిసారి రేవంత్ రెడ్డి అవన్నీ ఎన్నికల ప్రసంగాల్లో దట్టించాడు… చివరకు విజయన్ వశపడక… డ్యాష్ రేవంత్ రెడ్డీ అంటూ ఉడుక్కుంటూ కౌంటర్లు స్టార్ట్ చేశాడు… అంటే ఏ రీతిలో ఎల్డీఎఫ్‌ను రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టాడో అర్థమవుతోంది…
రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ప్రదర్శించిన మరో తెలివి ఏమిటంటే..? పినరై విజయన్ అవినీతిని మోడీ మెడలో వేయడం… ఒకే దెబ్బకు రెండు పిట్టలు… విజయన్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని, విజయన్‌కు మోడీయే గాడ్ ఫాదర్ అనీ, అందుకే తనపై సీబీఐ, ఈడీ గట్రా దృష్టి పెట్టవు అని ఆరోపించడం… ‘మోడీ బ్రదర్స్’ అని ముద్రవేయడం… కేరళలో ఎల్డీఎఫ్‌కు వోటేస్తే కేంద్రంలో మోడీకి వోటేసినట్టేనని ప్రచారం చేయడంతో విజయన్‌కు ఊపిరాడలేదు…

ఎప్పుడైతే తెలంగాణ మోడల్ అనే ప్రచారాన్ని తిప్పికొడుతూ విజయన్ ట్వీట్లు కొట్టాడో… రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా ఏకంగా ఆరుపేజీల బహిరంగ లేఖ విడుదల చేశాడు… కేరళ మీడియా దానికి మస్తు ప్రయారిటీ ఇచ్చింది… అందులో ప్రధానమైంది… తెలంగాణ రీసెంటుగా సాధించిన 10.1 శాతం జీడీపీ వృద్ధి… అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాధించిందనీ చెప్పాడు… అంతేకాదు, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే తెలంగాణ మోడల్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని తనే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించేశాడు..,
కొచ్చిలో ఈమేరకు యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన రేవంత్, కేరళలో “చీకటి యుగం” ముగిసి “స్వర్ణ యుగం” ప్రారంభం కాబోతుందని ధీమా వ్యక్తం చేశాడు… మహిళలకు నెలకు రూ. 1,000 ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి ఐదు ప్రధాన హామీలను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాడు…
రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగుకు, ప్రతి పంచ్‌కు పినరయి విజయన్ కూడా “Dash mone Revanth” అంటూ ఘాటుగానే స్పందిస్తున్నా… అది పేలవంగా ఉంది… ఏదేమైనా, ఒక పరాయి రాష్ట్రానికి చెందిన నాయకుడు వచ్చి స్థానిక ముఖ్యమంత్రిని ఇంతగా డిఫెన్స్‌లో పడేయడం కేరళ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి… ఏప్రిల్ 9న జరగబోయే పోలింగ్‌లో ఈ దూకుడు యూడీఎఫ్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి…
Share this Article