Amarnath Vasireddy……… మనీ సైన్స్ – కామన్ సెన్స్…. ఆమె నిన్నటి తరం మేటి నటి . ఉండేది మద్రాస్ లో… అయినా మోజు పడి హైదరాబాద్ లో 18 ఎకరాల భూమి కొంది … 55 ఏళ్ళ క్రితం… మొత్తం మూడు ధపాలుగా… ఆమె దీనికోసం రెండు లక్షలా నలబై ఎనిమిది వేలు ఖర్చుపెట్టింది …
భూమి… అందునా హైదరాబాద్ నగరం నడిబొడ్డున { ఆమె 55 ఏళ్ళ క్రితం కొన్నప్పుడు అది నగర శివారు } . రేట్ పెరగదా ? 2016 లో ఆమె మరణించేనాటికి 18 ఎకరాల భూమి విలువ కనీసం 500 కోట్లు అయ్యింది . ఎక్కడ రెండున్నర లక్షలు . ఎక్కడ 500 కోట్లు ?
నిన్నటి పోస్ట్ లో మార్వాడీ ఆయన కొడుకు తో చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా … ” మనిషే మనీని సంపాదించాలంటే ఎలా ? ఒక దశ తరువాత మనీ మనీని సంపాదించాలి ” ఆ మేటి నటి హైదరాబాద్ లో… ఆమె మాజీ ప్రియుడు మద్రాస్ లో… ఇలాగే భూములపై పెట్టి రూపాయికి పది వేలు సంపాదించారు . ఇది కదా మనీ సైన్స్ ?
Ads
కాస్త ఆగండి . ఆమె మాజీ ప్రియుడి జీవితం గురించి మరో పోస్ట్ లో.. ఈ పోస్ట్ లో ఆమె గురించి .. అడవి కాచిన వెన్నెల అని ఒక సామెత . ఆమె హైదరాబాద్ గ్రేప్ గార్డెన్ కు ఇది అచ్చంగా సరిపోతుంది . ” నాకు హైదరాబాద్ లో అయిదు వందల కోట్ల ఆస్తి ఉంది” అనే తుత్తి తప్పించి ఆమెకు ఈ ఆస్తి ఏమైనా ఉపయోగపడిందా ?
తొలి రోజుల్లో అయితే… సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ కు వచ్చి తన ద్రాక్ష తోటలో గడిపి పోయేది . మరణానికి ఇరవై ఏళ్ళ ముందే రాజకీయాల్లో తలమునకలు . కనీసం ఐదేళ్లకు ఒకసారి వచ్చి ఒక రోజు గ్రేప్ గార్డెన్ లో ఉండలేని స్థితి . ఎందుకా ప్రాపర్టీ ? ఆమెకేమైనా ఉపయోగపడిందా ?
చనిపోవడానికి పదేళ్ల ముందు… ఆనాటి రాజకీయాల కారణంగా ప్రభుత్వం ” నీ భూమి అసైన్డ్ భూమి .. ఖాళీ చెయ్యవమ్మా” అంటూ నోటీసు ఇచ్చింది . పాపం .. ఆ వయసులో ఆమె బీపీ పెంచుకొంది. కోర్ట్ కెళ్ళింది . ఇలా బీపీ పెరగడానికి తప్పించి ఆమె కోట్ల విలువ భూమి ఆమెకు పూచిక పుల్ల స్థాయికి కూడా ఉపయోగం లేకపోయింది… హైదరాబాద్ భూమేనా ? ఆమెకు తరగని సంపద . (వందల కోట్లు, వందల ఎకరాలు, బంగళాలు, నగలు… ఆమె చెప్పుల జతలే వందల్లో… ఇప్పుడు ఆ హైదరాబాద్ ఆస్తి ఎవరి పాలైందో ఓ మిస్టరీ…)
” డబ్బు లేకుంటే వృద్ధాప్యంలో చూసే వారుండరు . కొడుకైనా కూతురైనా మన చేతిలో డబ్బుంటేనే ముసలి వయసులో మనల్ని గమనిస్తారు . ” అని కోట్ల మంది భారతీయ్యులు అనుకొంటారు . వృద్ధాప్యానికి ఆస్తులు డబ్బు ఒక ఆసరా అని ఆస్తులు కూడబెడతారు …
పాపం .. ఈమె పాలిట ఆస్తులే శాపం అయ్యింది . పక్కన చేరిన నంగనాచి … నెచ్చెలి అని నమ్మించి స్లో పాయిజన్ తో ఆరోగ్యాన్ని దెబ్బ తీసి చిత్రహింసలు పెట్టి చంపింది . పాపం దిక్కులేని చావు… ” రారే రాణులు .. వారేరి సిరి మూట గట్టుకుని పోవరే” విప్లవ నాయకీ .. మా తెలుగు పద్యం ఎప్పుడైనా విన్నావామ్మా ?
ఇంకో నిజ జీవిత కథ… విశాఖ పట్నంలో ఒక పెద్దాయన . కష్టపడి పైకొచ్చాడు . ఆస్తులు కూడబెట్టాడు . ఒకే కూతురు . ఆస్తులకు ఆమే వారసురాలు .
మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేసాడు . అల్లుడు గారు .. మహా స్మార్ట్ . ” నెలకు ఇరవై లక్షలు రెంట్ రూపంలోనే వస్తోంది . ఇది కాకుండా వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు . అందరూ కష్టపడితే ఎంజాయ్ చేసేది ఎవరు?” అనుకొన్నాడు . సంవత్సరానికి మూడు సార్లు ఫారిన్ టూర్లు .. కేసినోలు .. మద్యం .. నలబై వయసు వచ్చేటప్పటికి కిడ్నీ పోయింది .
పాపం వైజాగ్ పెద్దాయన తాను బతికుండగానే కూతురు విధవరాలయ్యింది . మనవడు తండ్రి దారిలో . తాను ఆస్తులిచ్చి కూతురికి తీవ్ర ద్రోహం చేసానని అర్ధమయ్యే నాటికి ఆయన వయస్సు ఆయన్ని కబళించింది . ప్రాప్తమున్న తీరానికి పడవ కదలి పోయింది .
మూడో కథ ! కృష్ణా జిల్లా రైతు .. వందల ఎకరాల పొలం . కొడుకుని బాగా చదివించాడు . కొడుకు ఇరవై అయిదేళ్ల ఏళ్ళ క్రితమే అమెరికాలో సెటిల్ . పెద్దాయన మొన్ననే కన్ను మూసాడు . ఇన్నాళ్లు ఇక్కడున్న ఆస్తులను తండ్రే చూసుకొనే వాడు . తానేమో రెండు – మూడేళ్లకు ఒకసారి ఇండియాకు . కొడుకు ఇప్పుడు కాలేజీలో . వాడికి కనీసం అయిదేళ్ళకొక్కసారి ఇండియాకు రావడం కూడా ఇష్టం లేదు .
యాభై వయసులో అమెరికా ఆయన ఆలోచిస్తున్నాడు . తనకొచ్చే రెంట్ డబ్బును అమెరికాకు తేవాలంటే 31 శాతం టాక్స్ ఇండియా ప్రభుత్వానికి కట్టాలి . ఇది కాకుండా అక్కడి టాక్స్ లు . పోనీ ఇండియాలో వచ్చిన డబ్బు అక్కడే రొటేట్ చేద్దామంటే ఈనాటి బినామీలే రేపటి ప్రాణాంతకులు అవుతారేమోనని భయం . తాను ఉన్నంత వరకు ఫరవాలేదు . తన కొడుక్కి తాతల భూమి సరిహద్దులు తెలియదు …
ఇప్పుడు భూమిని అమ్మేస్తేనేమో నలుగురిలో సిగ్గుచేటు . తండ్రి ఆత్మ ఘోషిస్తుందేమో అని భయం . ఇప్పుడైతే భూమి అమ్మి ఆ డబ్బును అమెరికాకు తీసుకొని వెళ్ళితే ఇరవై శాతం కాపిటల్ గెయిన్ టాక్స్ తో పోతుంది . భవిషత్తులో తన లాంటి పర్సన్ (ఇండియన్ అరిజిన్) ఇండియాలోని భూములను తరం మార్పిడి కారణంగా పెద్ద ఎత్తున అమ్మడం మొదలెడితే ఈ టాక్స్ యాభై శాతానికి ప్రభుత్వాలు పెంచేస్తాయి ? .. లేదా ఇంకేదేయినా కొత్త చట్టాలు వస్తాయేమోనని భయం .
ఇండియా ఆస్తులు.. పాపం .. యాభై వయసులోనే అమెరికా ఆయనకు బిపి పెంచి ఇన్సొమ్నియాకు దారి తీశాయి . దేవుడు చిత్రమైనోడు సుమీ { దేవుడికి ఎగ్స్ పార్టీ అయినోళ్లు ప్రకృతి / సోషల్ డైనమిక్స్ అనుకోండి } డబ్బు లేక పొతే కష్టం . ఎక్కువ డబ్బుంటే కష్టం . నిద్ర పట్టడానికి అమెరికా యాభై ఏళ్ళ ఆయన టాబ్లెట్ వేసుకొన్నాడు . నిద్ర పట్టేసింది . ..
” ఎర్రి నాగన్న .. బతకాలంటే డబ్బు కావాలిరా .. నిజం . డబ్బు సైన్స్ తెలిసుండాలి . అదీ నిజమేరా . ఆస్తులు సంపాదించాలి . అదీ నిజమంత నిజం . కానీ నీ కనీస అవసరాలకు మించి ఆస్తుల్ని కూడబెడితే అది సమాజం సొంతంరా . నీవు దానికి ధర్మకర్తవి మాత్రమే . కష్టపడు. డబ్బు సెన్స్ తో సంపాదించు . పరిశ్రమ / బిజినెస్ స్టార్ట్ చెయ్యి . అది నలుగురికీ ఉపయోగపడాలి . నా బావి …. నీరు నాది అనుకొని నువ్వూ తోడుకోక పొరుగు వారినీ తోడుకోనివ్వక పొతే అది పాచిపట్టిపోతుందిరా .
ఇదేరా జీవిత సారం – డబ్బు ధర్మం . డబ్బంతా నాకే కావాలి . డబ్బు సుఖం నాకే దక్కాలి అనుకొంటే డబ్బు మూటలే నిన్ను కాటేస్తాయి . తరతరాల ఆస్తులు ఉన్నా కుటుంబం , బంధుత్వం , పిల్లలని సరైన రీతిలో పెంచడం లాంటి సామాజిక సూత్రాలు పాటిస్తున్నారు కాబట్టే మార్వాడీలు… అంతకు మించి పార్సీలు హ్యాపీ గా లైఫ్ గడిపేస్తున్నారు . (ఓ దశ దాటాక జైన ధనికులు సన్యాసమే స్వీకరిస్తుంటారు) డబ్బు సైన్స్ ముఖ్యం . అంతకు మించి డబ్బు ధర్మం ఇంకా ముఖ్యం . మరిన్ని వివరాలు కావాలంటే ఇసోపనిషత్తు , భగవద్గిత , పతంజలి యోగ సూత్ర నాలుగో . భాగం చదువు “… కల ముగిసింది . అమెరికా ఆయనకు మెలకువ వచ్చింది . కలలో తనకు బోధ చేసింది ఎవరో ఇప్పటికీ ఆయనకు అర్థం కాలేదు …
Share this Article