.
ప్రతి పార్టీకి ఓ సోషల్ మీడియా క్యాంపెయిన్ వింగ్ ఒకటి ఉంటోంది ఇప్పుడు… ఇది ఒక పార్టీకి, ఒక నాయకుడికి పాజిటివ్ ఇమేజీ క్రియేట్ చేయడం కోసం గాకుండా… ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యనేతలపై దాడి చేస్తుంటుంది…
రకరకాల అబద్ధాలతో, గ్రాఫిక్కులతో, ఇప్పుడు ఎఐ సహకారంతో మీమ్స్, ఇమేజెస్, పోస్టులు క్రియేట్ చేసి,.. ఎదుటి పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురిచేయడం, నాయకుల్ని అభాసుపాలు చేయడం, నెగెటివిటీ పెంచడం వీటి పని…
Ads
ఇదొక దిక్కుమాలిన క్యాంపెయిన్… దీనికి ఆద్యుడు ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్… ఇప్పుడు మస్తు నీతులు చెబుతున్నాడు గానీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో అవాంఛనీయ పోకడల్ని ప్రవేశపెట్టి, దీన్ని ఓ పెద్ద దందాలా మార్చింది తనే… ఇక బోలెడు సంస్థలు పుట్టుకొచ్చాయి… ఎంతలా అంటే…
ప్రజాజీవితంలో ఉన్న ప్రతి నాయకుడు ఓ సోషల్ మీడియా వింగ్ లేదా వ్యక్తుల్ని నియమించుకుని పోషిస్తున్నారు… వాట్సప్ గ్రూపు, సోషల్ మీడియా పేజీలు, గ్రూపుల్లోకి ఈ అబద్ధాల్ని పుష్ చేయడం ఓ నిరంతర ప్రయాస… నిజానికి ఇవి పనిచేస్తాయా..? నిల్… అలా ఫలించే పక్షంలో బీఆర్ఎస్, వైసీపీ ఎందుకు ఓడిపోతాయి..? వందల కోట్లు కర్చు చేశాయి ఆ పార్టీలు…
అలాగని టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ శుద్దపూసలు కాదు… టీడీపీ అయితే మొదటి నుంచీ మీడియా, సోషల్ మీడియా కట్టుకథల్లో ఆరితేరిన దుకాణం అది… ఇప్పుడు కేసీయార్ మీద ఇంకోరకం ప్రచారం కొత్తగా స్టార్టయింది…
ఇది మరీ వికట ప్రచారం… సిద్ధాంతరీత్యా, తన పాలన విధానాల రీత్యా, ఓడిపోయాక ఇల్లుకదలని బాధ్యతారహిత ప్రజాజీవితం పట్ల, పాలనలో అవినీతి పెచ్చరిల్లిన తీరు పట్ల, ఇంకా అనేకానేక కారణాలతో తనతో విభేదించవచ్చు… విమర్శించవచ్చు… కానీ అదీ ఓ స్థాయి వరకే… పరిమితి దాటి తిట్లు, వెక్కిరింపులు, వెకిలి కూతలు, అబద్ధపు ప్రచారాల దాకా పోవద్దు…
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అయినా, ఇవ్వకతప్పని స్థితి క్రియేట్ చేసింది కేసీయారే… పలు కోణాల్లో తనను అభినందించొచ్చు… గౌరవించొచ్చు… కానీ మరీ ఇప్పుడు సాగుతున్న వెగటు ప్రచారం బాగాలేదు… ‘ముచ్చట’ ఈ ధోరణిని ఖండిస్తోంది… కారకులు, బాధ్యులు ఎవరైనా సరే…
ఫామ్ హౌజులో కేసీయార్ క్షుద్రపూజలు చేస్తున్నాడనీ, రేవంత్ రెడ్డి మీద చేతబడి వంటివి ప్రయోగిస్తున్నాడని ఓ వార్త… వర్తమాన కాలంలో ఏ పాలకుడికీ చేతగాని ఆయుత చండీయాగం చేసింది కేసీయార్… తను చాలా హోమాలు, యాగాలు చేశాడు, పక్కాగా శాస్త్రీయ పూజలకు కట్టుబడే వ్యక్తి తను… ఎప్పుడైనా వామాచార పద్ధతిలో రాజశ్యామల యాగం చేయించాడేమో గానీ మరీ తాంత్రిక క్షుద్ర పూజలు చేయించిన దాఖలాల్లేవు…
ఇక ఎవరో చింతలపూడి శకుంతల దేవి అట… గతంలో కేసీయార్ ‘క్లోజ్ ఫ్రెండ్’ అట, మస్తు కంపెనీలు పెట్టించాడట ఆమెతో అమెరికాలో… 2001 నుంచీ ప్రతి దసరాకు ఫామ్ హౌజుకు వస్తుందట… ఇక కేసీయార్ అమెరికాలో సెటిల్ అవుతాడట… వీటినే క్షుద్రపూజలు, తాంత్రిక ప్రచారాలు అంటారేమో బహుశా…
ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌజు ఎప్పటిది..? పైగా న్యూయార్కులో ఆమె ఇంటి పక్కనే ఇల్లు కొన్నాడట… నిజానికి తను విదేశాలకు వెళ్లడమే ఒకటీరెండుసార్లు అనుకుంటా… తన పదేళ్ల పాలనకాలంలోనూ ఇతర ముఖ్యమంత్రుల్లాగా ఎగబడి ఏవేవో దేశాలకు టూర్లు వెళ్లి వచ్చిన ఉదంతాలు లేవు, ఒకటీ అరా ఉంటాయేమో…
మరి ఈ నెగెటివ్ క్యాంపెయిన్ ఎవరు చేస్తున్నారు..? వెనుక ఉన్నది ఎవరు..? వచ్చే ఫాయిదా ఏమిటి..? ఏమో, కేసీయార్ భాషలోనే చెప్పాలంటే… అంతా బభ్రాజమానం భజగోవిందం..!!
Share this Article