.
సినిమా రిలీజయ్యాక కనీసం రెండుమూడు రోజులు రివ్యూల్ని ఎవరూ రాయకుండా కట్టడి చేస్తే ఎలా ఉంటుందని టాలీవుడ్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు ఓ వార్త కనిపించింది… ప్రొఫెషనల్ రివ్యూయర్ల మీద ఆంక్షలు పెడితే అది భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్టు అవుతుంది… కోర్టులే ఒప్పుకోవు…
కాకపోతే కావాలని కక్షలతో, దురుద్దేశాలతో రివ్యూ బాంబింగ్ జరుగుతోందని ఆధారాలతో ఏమైనా వాదిస్తే తప్ప..! మాలీవుడ్ కొంతమేరకు ఈ న్యాయపోరాటం చేసింది గానీ అదేమీ వర్కవుట్ అయినట్టు లేదు… ఐనా సోషల్ మీడియాను ఎవరు, ఎలా ఆపగలరు..?
Ads
సినిమా అనేది కూడా సరుకే… మార్కెట్‌లోకి వచ్చిన సరుకు నాణ్యత మీద రివ్యూ తప్పకుండా ఉంటుంది… ఉండాలి… డబ్బు పెట్టి కొంటున్న సరుకు కాబట్టి, డబ్బు కష్టార్జితం కాబట్టి…
నాని హిట్ సినిమా వస్తుంది కదా… తనూ ఎక్కడో మాట్లాడుతూ పదిరోజులాగి, కలెక్షన్లు లేకపోతే డిజాస్టర్ అని రాయాలట… ఫస్టే డిజాస్టర్ అని రాయొద్దట… ఈ పదిరోజుల్లో అమాయక ప్రేక్షకులను థియేటర్లకు లాగి, నిలువు దోపిడీ చేసి, పర్సులు ఖాళీ చేసి పంపించేస్తారు… అంతేనా నానీ..? (ఐనా ఇప్పుడు పెయిడ్ పాజిటివ్ రివ్యూల ట్రెండ్ కూడా స్టార్ట్ చేశారట కదా… అది సరిపోదా…)
ఐనా ఎవరైనా సినిమా ఇలా ఉంది, అలా ఉంది అని రాస్తారు గానీ, మొదటి రోజే డిజాస్టర్, బ్లాక్ బస్టర్ అని రాస్తారా..? ఐనా కలెక్షన్లకు సినిమా నాణ్యతకూ సంబంధం ఏముంది..? ఎస్, హీరోల నడుమ ఉన్న వైరంతో ఫ్యాన్స్ కావాలని హెచ్‌డీ ప్రింట్లు నెట్‌లో రిలీజ్ చేయించడం, నెగెటివ్ రివ్యూలు రాయించడం గట్రా కొత్తగా కనిపిస్తోంది… అది మాత్రం ఓ దరిద్రమే… కానీ దానికీ కారకులు మీరే కదా నానీ, అంటే మీ హీరోలే కదా…
నువ్వే చెబుతున్నావుగా… తక్కువ రేటింగ్స్ ఉన్నవీ బాగా క్లిక్కయినవి ఉన్నాయని… మరెందుకు జడుపు..? ఒకవైపు నువ్వే చెబుతున్నావు, హిట్ సినిమాలో హింస ఎక్కువ అనీ, నీ కొడుకును కూడా థియేటర్‌కు తీసుకోపోననీ… మరెందుకు ప్రేక్షకుడు రావాలి నీ సినిమాకు..? అదీ పర్సులు ఖాళీ చేసుకుని…! (రాబోయే నీ ప్యారడైజ్ సినిమా మరోరకం మసాలా జానర్ అట కదా…)
నిఝంగా నీవు చెబుతున్న క్రియేటివ్ హింస నచ్చితే, మౌత్ టాక్ బాగుంటే ఆ జానర్ ఇష్టపడే వాళ్లు వస్తారు, కానీ ముందే రివ్యూయర్ల కలాలకు బేడీలు ఎందుకు వేయడం..? మొన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫంక్షన్‌లో విజయశాంతి అయితే నెగెటివ్ రివ్యూలపై మరీ రెచ్చిపోయింది…
సినిమా బాగాలేకపోతే సైలెంటుగా ఉండాలట, కానీ ఏమీ రాయొద్దట… అలా రాస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటుందట… అదేమిటో మరి… టాలీవుడ్ ఇండస్ట్రీ గానీ రేవంత్ రెడ్డి గానీ అలాంటి కొరడా ఏమైనా ఇచ్చారా..? నిజానికి ఆ సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్… లేడీ అమితాబ్ అని పదే పదే పత్రికలు రాసే విజయశాంతి ఇమేజ్ నయాపైసా ఉపయోగపడలేదు సినిమాకు…
నిజానికి ఈ విజయశాంతి సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయోనని సాక్‌నిల్క్ రికార్డులు చూస్తే పాపం అనిపించింది… తొలిరోజు 3.4 కోట్లు, తరువాత వీకెండ్స్ పుణ్యమాని రెండో రోజు 1.95 కోట్లు, మూడో రోజు 2.1 కోట్లు అంతే… తరువాత 97 లక్షలకు, ఆ మరుసటి రోజు మరీ 78 లక్షలకు పడిపోయింది…
హైప్ క్రియేట్ చేసి, ప్రచారానికే బోలెడు ఖర్చు పెట్టినా సరే… సినిమాలో దమ్ము లేదు కాబట్టి అలా చతికిలపడిపోయింది… నాగవంశీలు, విజయశాంతిలు, నానీలకు ఓ చిన్నమాట… చిన్న హీరో ప్రియదర్శి నటించిన… ఎవరో ముక్కూమొహం తెలియని నటులు హీరోహీరోయిన్లుగా చేసిన కోర్టు అనే సినిమా వసూళ్లు ఎంతో తెలుసా..? 57.5 కోట్లు…! (నీ సినిమాయే కదా)…
తమన్నాతో తీసిన సినిమా ఓదెల-2 మీద కూడా బాగా హైప్ క్రియేట్ చేశారు… దాని వసూళ్లు కేవలం 4.3 కోట్లు… అర్థమైంది కదా… స్టార్‌డమ్స్, హైపులు, మితిమీరిన ప్రచార ఆడంబరాలు సినిమాల్ని నడిపించవు… కథలో దమ్ముండాలి… అది ఉన్నప్పుడు నెగెటివ్ రివ్యూలు ఎవడైనా కావాలని రాసినా సరే, సినిమా విజయాన్ని అవి ఆపలేవు… అదీ సంగతి…
Share this Article