.
ఫస్ట్ లాంగ్వేజ్ కాదు… లాంగ్వేజే ఫస్ట్! రాజకీయం అంటే అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి కూడా. లేకపోతే అది రాజకీయం అనిపించుకోదు. ఇప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం మీద అనుకూల- వ్యతిరేక చర్చలే.
కులం, మతం, ప్రాంతం, దేశం, భాష, ఆచారాల్లాంటివి భావోద్విగ్న అంశాలు. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుందన్నది ఆ సోపు ప్రకటనలో ట్యాగ్ లైన్. భావోద్విగ్న అంశాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయం ఉండి తీరుతుంది.
Ads
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలను కాసేపు పక్కన పెడదాం. “భాషలన్నీ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అభివృద్ధి చెందినవే…అన్ని భాషలూ గొప్పవే…భాషల మధ్య వైరం సృష్టించవద్దు”- అన్నది ప్రధాని మోడీ హితవచనం.
ఏ ఉద్దేశంతో హిందీని భుజానికెత్తుకున్నారో కానీ…అది అటు తిరిగి, ఇటు తిరిగి బి జె పి పాలిత రాష్ట్రాల్లో కూడా వేడి పుట్టిస్తోంది. ఉత్తరాదిలో అనేక భాషలను హిందీ చంపేసిందన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటన మీద సీరియస్ చర్చ జరగకుండా జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, ఎంత కట్టడి చేసినా ఎక్కడో, ఎవరో ఒకరు ఏదో ఒకటి అనకపోరు. అది పెద్దల మెడకు చుట్టుకోకపోదు. అలా ఒకానొక ఆర్ ఎస్ ఎస్ పెద్దాయన సురేష్ భయ్యాజీ జోషి బాంబేలో ఉన్నవారు మరాఠీ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పనిలేదన్న మాట పుట్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు.
ఇప్పుడు రాజకీయ మార్కెట్లో భాష మంచి డిమాండు ఉన్న వస్తువు. దాంతో మహారాష్ట్ర ప్రతిపక్షాలు వెంటనే భయ్యాజీ మాటలను అందుకున్నాయి. మరాఠీ పురుటి గడ్డ మీద మరాఠీని వద్దని అధికార పార్టీకి చోదక శక్తి అయిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయిన ఒక మరాఠీ అంటారా? అనచ్చా? హమ్మా! అని పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి.
ఇదేదో పుట్టి ముంచే విషయంలా మారుతుందని గ్రహించి సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ శాసనసభలో బాంబేతో పాటు మహారాష్ట్ర మొత్తంలో మరాఠీ నేర్చుకోవాల్సిందేనని…మరాఠీ విలువను తగ్గించే ప్రసక్తే లేదని ప్రకటించారు.
భిన్న భాషలవారికి ఆశ్రయమైన మహానగరాల్లో ఒక భాష అనేముంది? అన్న విశాల విశ్వ భావనతో భయ్యాజీ ఆదర్శ ప్రవచనం చేయబోయారు. తన ఆదర్శ వచనాలు రాష్ట్రంలో అగ్గి రాజేయగానే…అయ్యయ్యో నేనెందుకు మరాఠీని వద్దంటాను? పైగా నా మాతృభాష మరాఠీ…అని నాలుక కరుచుకున్నారు.
త్రిభాషా సూత్రం అని కేంద్రం హిందీ పాట అందుకోగానే పంజాబ్ లో పంజాబీని తప్పనిసరి చేశారు. తెలంగాణాలో తెలుగును తప్పనిసరి చేశారు. తమిళనాడు సంగతి సరే సరి.
డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళంలో ఇంజనీరింగ్, మెడికల్ పాఠ్యపుస్తకాలు తయారు చేయించడం మీద స్టాలిన్ దృష్టి పెట్టాలని హితవు పలికారు.
కొస మెరుపు:-
మిగతావారి సంగతేమో కానీ… భాష విషయంలో రెచ్చగొడితే తమిళులు రాత్రికి రాత్రే ఇంజనీరింగ్, మెడికల్ విద్య పాఠాలను తమిళంలో రాయించగలరు.
ఇప్పుడు రాజకీయ పాఠాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది? అన్న అప్షన్ కాదు… లాంగ్వేజే ఫస్ట్ అన్న కంపల్షన్ అయ్యింది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article