పెద్ద పెద్ద పాలన వ్యవహారాలు కాదు… చిన్న చిన్న సేవ వ్యవహారాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది… ట్రాఫిక్ చాలాన్ల దగ్గర నుంచి అత్యవసర సేవల దాకా..! వందలు, వేల కోట్ల జీతాలిస్తూ ఉద్యోగుల్ని, సిస్టమ్‌ను రన్ చేస్తున్నా సరే, కీలక స్థానాల్లో తిష్ఠ వేసే ఉన్నతాధికారులకు ఈ సేవాలోపాలు పట్టవు… అవి అంతిమంగా ప్రభుత్వం మీద, అనగా పాలక పార్టీని కూడా ప్రభావితం చేస్తుంటాయి…
అదేమో రాజకీయ నాయకులకు అర్థం కాదు… ఉదాహరణకు… కరెంటు బిల్లులు… తెలంగాణలో (ఏపీలో కూడా) గతంలో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, కొన్ని బ్యాంకుల పేమెంట్స్ యాప్స్ నుంచి వినియోగదారులు బిల్లులు చెల్లించేవాళ్లు… చాలా సులభం, పైగా కొత్త బిల్లు రాగానే ఆ యాప్స్ అలర్ట్ చేసేవి… ఎక్కడికీ పోనవసరం లేకుండా రెండు మూడు క్లిక్కులతో పనైపోయేది… చాలామంది ఆటోమేటిక్ పేమెంట్ ఆప్ట్ చేసుకున్నారు కూడా…
తరువాత ఏమైంది..? కరెంటు సేవల డొల్ల నాణ్యత గురించి తెలిసిందే కదా… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ బిల్ పేమెంట్ సిస్టంలోకి తెలంగాణ డిస్కమ్స్ చేరలేదు… విపరీతమైన నిర్లక్ష్యం… (మన రెగ్యులేటరీ కమిషన్ సభ్యులకు సేవల్లో నాణ్యత అనేది అస్సలు పట్టదు, అదొక విషాదం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఏమైనా మార్పులుంటాయేమో అని చూస్తే… ప్చ్, పట్టించుకున్నవారేరీ..?)
Ads
జులై ఒకటి నుంచి ఈ పేమెంట్ యాప్స్ నుంచి బిల్లులు చెల్లించడం బంద్ అయిపోయింది… అబ్బే, మా తప్పేమీ లేదు, ఇదంతా ఆర్బీఐ చేసింది అని ఓ దిక్కుమాలిన స్టేట్‌మెంట్ ఇచ్చి కరెంటోళ్లు చేతులు దులుపుకున్నారు… ఈ శాఖకు మంత్రి కూడా ఉన్నట్టు లేదు… అఫ్‌కోర్స్, ఉన్నా గతంలో ఎవరైనా పట్టించుకుంటే కదా… అసలు కరెంటు సబ్జెక్టే సంక్లిష్టం…
ఓ ట్వీట్ కొట్టేసి, చేతులు దులుపుకోవడం నిజంగా దుర్మార్గమైన నిర్లక్ష్యం… అసలు ఎందరు చదువుతారు ఈ డిస్కమ్స్ ట్వీట్స్…? పైగా మేం ఏదో బార్ కోడ్ పబ్లిష్ చేస్తాం బిల్లుల మీద అని ఓ ప్రకటన… అదయ్యేదీ లేదు, పొయ్యేదీ లేదు… అసలు వినియోగదారుల గ్రీవియెన్స్ పట్టించుకునేవాడేడి..? ఇప్పుడు కొత్తగా మరో సమస్య…
డిస్కమ్స్ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తే… అవేమో సదరు వినియోగదారుల ఖాతాల్లోకి జమకావడం లేదు… చాలా కంప్లయింట్లు… గతంలో కేసీయార్ పాలనలో ఇలాంటి ఇష్యూస్ సోషల్ మీడియాలో కనిపిస్తే ఎవరో ఒకరు బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసేవాళ్లు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుపోయి ఇష్యూ సార్టవుట్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు… ఇప్పుడదీ దిక్కులేదు…
భారత్ బిల్ పేమెంట్ సిస్టంలోకి దేశంలోని 94 పవర్ యుటిలిటీలు చేరితే… తెలంగాణ డిస్కమ్స్ ఏం చేస్తున్నట్టు..? సరే, తరువాతైనా పరిష్కారాలు ఆలోచించాలి కదా..? నిల్…! పైగా మా యాప్స్ ద్వారా, మా వెబ్‌సైట్ల ద్వారా చెల్లించండి అని ఏదో ఉద్దరించినట్టు ప్రకటనలు… వాళ్లెప్పుడైనా పే చేస్తే కదా లోపాలేమిటో తలకెక్కేది… మరి మీ యాప్స్ ద్వారా, మీ వెబ్‌సైట్ల ద్వారా పే చేస్తే ఖాతాలకు ఆ డబ్బు జమకావడం లేదు, కరెంట్ క్షేత్ర సిబ్బంది కటింగ్ ప్లేయర్లు పట్టుకుని ఇంటికొస్తారు… వినియోగదారుడు ఏం చేయాలి..? నెవ్వర్, హెల్ప్ లైన్లు, మన్నూమశానం ఏమీ చేయవు…
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, అధికారుల నిర్వాకాల పుణ్యమాని కరెంటు కోతలు, సమస్యలు పెరిగిపోయాయనే భావన జనంలో బాగా వచ్చేసింది… నిజంగానే ట్రాన్స్‌కో, డిస్కమ్స్ పనితీరు బాగాలేదు… దానికితోడు సేవాలోపాలు కూడా తోడైతే… ముందే చెప్పుకున్నాం కదా… చిన్న చిన్న విషయాలు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతకు దారితీస్తాయని… ఎటొచ్చీ అసలు సమస్య ఏమిటంటే… దీన్ని కూడా గుర్తించే సోయి లేకపోవడం..!!
Share this Article