నారప్ప అనే సినిమా తీశారు కదా, త్వరలో ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు… అందులో వెంకటేష్ హీరో… అసురన్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్… ఇది అందరికీ తెలిసిందే కదా… ట్రెయిలర్ రిలీజ్ చేశారు మొన్న… రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ ఉన్నయ్… సో, నిర్మాతలూ హేపీ… ట్రెయిలర్ చూస్తుంటే సీన్లు బాగానే చిత్రీకరించారనీ, అవసరమైన ఎమోషన్లు, సీన్ల నాణ్యత గురించి దర్శకుడు కాస్త తపించాడనీ తెలుస్తూనే ఉంది… ఎటొచ్చీ భాష విషయంలోనే అసంతృప్తి… మనస్సులు చివుక్కుమనిపించేలా ఉంది… మన తెలుగు నిర్మాతలు, దర్శకులు ఇంకా మారలేదు… మారడం ఇష్టం లేదు… ఒక ప్రాంత మాండలికాన్ని ఒక పాత్రకు ఎంచుకున్నప్పుడు, అందులో విరుపు, సొగసు ముందుగా సదరు నటుడికి అర్థం కావాలి… లేదంటే ఆ యాసను అపహాస్యం చేసినట్టే లెక్క… తెలిసి చేసినా, తెలియక చేసినా… ముందుగా ఒక మిత్రుడి అభిప్రాయం చదవండి…
మౌ ళి….. నారప్ప సినిమా రీమేక్ అనంతపురం జిల్లా నేపథ్యంలో తీస్తున్నారని మొదట ప్రకటించారు. కానీ ట్రైలర్ చూస్తే ఆ మాటల్లో ఎక్కడా మా అనంతపురం యాస కనపల్యా…
Ads
ఇది ఎప్పుడూ ఉన్న విమర్శే కదా… ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణ… తరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ భాషల్ని, ఈ యాసల్ని ఖూనీ చేసింది… సీమ అనగానే రక్తపాతాలు, వేటకొడవళ్లు, నాటుబాంబులు… ఉత్తర కోస్తా అనగానే పనిమనుషులు… తెలంగాణ అనగానే ఆకురౌడీలు, లేదా కమెడియన్లు… ఇక ఆ పాత్రలు పోషించే నటీనటులు వాడే అత్యంత కృతకమైన భాష… డైలాగ్ రైటర్లకు ఆయా మాండలికాలు ఏమీ తెలియవు… కోట్లకుకోట్లు ఖర్చుపెడతారు కదా సినిమా నిర్మాణానికి… ఆయా ప్రాంతాల యాస తెలిసిన ఎవరైనా రైటర్లతో రాయించుకోవచ్చు కదా… పోనీ, నటీనటులకు ఈ యాస పలకడం చేతకాదనుకుందాం, డబ్బింగ్ పెట్టొచ్చు కదా… మళ్లీ ఇక్కడ ఇగో సమస్య… అన్నింటికీ మించి, మనమెలా తీసినా చూస్తారులే అనే ఓ తేలికతనం… తెలంగాణ వచ్చాక కాస్త తెలంగాణ భాష పట్ల, తెలంగాణ పాత్రల పట్ల జాగ్రత్త కనబడుతోంది… కొంచెమే… కానీ సీమ, ఉత్తరకోస్తా సంస్కృతి, భాషల మీద మునుపటి వివక్ష, కించపరిచే ధోరణి అలాగే కొనసాగుతోంది… సాగుతూనే ఉంది..!!
Share this Article