డిసెంబరు 6, 1959… దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్, జలవిద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభించడానికి అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చాడు… దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అధికారులు కొందరు ఆదివాసీ మహిళలను ఆయనకు స్వాగతం చెప్పడానికి పిలిచారు… వాళ్లు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న కూలీలు… వారిలో ఒక 15 ఏళ్ల యువతి ఉంది… పేరు బుద్ధిని మంఝిన్… ఆమె సంతాలి తెగకు చెందిన యువతి… (మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆ తెగ మహిళే… వాళ్ల కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి)…
అప్పటికప్పుడు నెహ్రూలో ఓ ఆలోచన… ప్రాజెక్టు వల్ల చాలామంది ఆదివాసీల భూములు పోయాయి… వాళ్లే కష్టపడి ప్రాజెక్టు నిర్మాణానికి పనిచేశారు… సో, వాళ్ల ప్రతినిధిగా ఆమెతో ‘బటన్’ నొక్కించి ప్రాజెక్టు ప్రారంభింపచేశాడు… ఓ కూలీ ఓ ప్రాజెక్టును ప్రారంభించడం అదే తొలిసారి… అందరూ చప్పట్లు కొట్టారు… ఆమె ఆయనకు దండ వేసింది… నెహ్రూ సరదా మనిషి కదా, నవ్వుతూ ఈ మర్యాదలు, గౌరవాలు దక్కాల్సిందే మీకే అంటూ ఆ దండను ఆమె మెడలో వేశాడు… ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు…
ఫంక్షన్ ఘనంగా జరిగింది… అందరూ హేపీ… ఆమె తిరిగి తన స్వస్థలానికి వెళ్లింది… ప్రస్తుతం అది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది… ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయన తన మెడలో దండ వేయడం, తనకు గొప్ప గుర్తింపు లభించిన ఆనందం ఆమెది… కానీ అదే ఆమెకు శాపంగా మారింది… జీవితాంతం వేధించింది… మొన్న శుక్రవారం ఆమె మరణించింది… అదీ వార్త… మరి ఆ సంఘటన ఆమె జీవితంలో కురిపించిన పిడుగులేమిటి..?
Ads
ఆమె డ్యామ్ ఫంక్షన్ తరువాత ఊరికి పోగానే ఊళ్లో పెద్దలు మీటింగు పెట్టారు… ‘‘నువ్వు ఆయన మెడలో దండ వేశావు, ఆయన నీ మెడలో దండ వేశాడు… చేతులు కలిపావు… అందుకని నువ్వు ఆయన భార్యవే… తను సంతాలీ తెగ పురుషుడు కాదు కాబట్టి నువ్వు చేసుకున్న ఈ పెళ్లి మన కట్టుబాట్లకు వ్యతిరేకం’’ అని చెప్పారు… ఆమె విభ్రాంతిలో మునిగిపోయింది… అంతే… ఒకసారి ఆమెను తన తెగ నుంచి వెలివేశాక ఇక ఎవరు పెళ్లిచేసుకుంటారు… ఎవరూ ముందుకు రాలేదు…
నెహ్రూ సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభించిన ఆమెను కనీసం ఆ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆదరించిందా..? లేదు… 1962లో… అంటే ఫంక్షన్ జరిగిన మూడేళ్లకే ఆమెను ఆ కూలీ కొలువు నుంచి కూడా ఊడబీకింది… ఆమెపై ఆ తెగ కోపమే దీనికీ కారణం… తరువాత ఆమెకు బతుకు కష్టమైంది… సామాజిక వెలి… బెంగాల్‌లోని పురూలియాకు వెళ్లింది ఏదో పని దొరుకుతుందని… అక్కడ సుధీర్ దత్తా అనే యువకుడు పరిచయం అయ్యాడు… పెళ్లి చేసుకోవడానికి అవే కులం కట్టుబాట్లు అడ్డుపడ్డాయి… భయపడ్డాడు… కానీ ఆమెతో సహజీవనం చేశాడు…
ఫలితం… ఓ బిడ్డ… రత్న అని పేరు పెట్టుకుంది… ఏళ్లు గడిచినా ఆ తెగ ఆమెను క్షమించలేదు, వెలిని వెనక్కి తీసుకోలేదు… మళ్లీ పాంచెట్ వచ్చేసింది… బతుకు దుర్భరంగా మారింది… కొన్ని పత్రికలు వార్తలు రాశాయి… అవి తన దృష్టికి రావడంతో రాజీవ్ గాంధీ ఆమెను తన దగ్గరకు రప్పించుకున్నాడు… ఆమె కొలువు మళ్లీ ఇవ్వాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను ఆదేశించాడు… కొలువు దొరికింది… బిడ్డదీ తన వంటి దుస్థితే… చివరకు ఒకతను దొరికాడు… పెళ్లి చేసింది… కూతురు, అల్లుడి దగ్గరే బతకసాగింది…
ఇన్నేళ్లు గడిచినా ఆ తెగ ఆమెపై విధించిన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు… జీవితాంతమూ వెలి ముద్రతోనే బతికిన ఆమె మొన్న శుక్రవారం గుండెపోటుతో మరణించింది… కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది… చివరకు మన మాజీ ప్రధాని నెహ్రూ గిరిజన భార్య ఏ సమాజ గౌరవానికీ నోచుకోకుండానే కన్నుమూసింది…!!
Share this Article