Nancharaiah Merugumala………. శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్ బోస్ రాజు….. ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం……, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!……………………………………………………
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పెరిగి సరిహద్దు రాష్ట్రంలోని రాయచూరు జిల్లా మాన్వీకి వలసపోయిన ఈ రాజు గారు పెద్ద రైతు. రైతే రాజు అనే మాటలపై ఆయనకు విశ్వాసం లేదు. అందుకే ఆయన నిజంగా రాజు కాలేడు కాబట్టి మంత్రి కావాలనుకున్నాడు. గోదావరి రాజులకు ఇష్టమైన, తమకెంతో మేలు చేసిన కాంగ్రెస్ రాజకీయాల్లో రాయచూరు జిల్లాలో పైకొచ్చారీయన. 2014కు ముందు రెండుసార్లు రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక– అప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ దెగ్గిర అదే..నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ వద్ద పలుకుబడి కారణంగా ఆయన 2014లో అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు ఎన్నికయ్యారు.
దాదాపు 74 ఏళ్ల బోసు రాజు సొంతూరు పక్కనున్న పాలకోడేరులో అప్పటి ఎసెసెల్సీ పాసయ్యారు. తర్వాత మద్రాసు పోయి 1967లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లమా సంపాదించారు. తన తోటి కోస్తా జిల్లాల కమ్మలు, రెడ్లు, కాపులు, రాజుల మాదిరిగానే రాయచూరు జిల్లా మాన్వీ చేరుకుని వ్యవసాయంలోకి దిగారు. నడింపల్లి సుబ్బరాజు గారబ్బాయిలా పశ్చిమ గోదావరిలో వ్యవసాయం చేయలేదు. చేపల చెరువులు తవ్వించి ‘అగ్నికుల క్షత్రియుడి’గా కులం మారలేదు. ఆయన కర్ణాటకలో స్థిరపడ్డాక బడా రైతులా డబ్బు సంపాదనతో ఆగిపోలేదు.
Ads
సాగు నుంచి రాజయకీయాల్లోకి…
……………………..
స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో చేతులు పెట్టి రెండుసార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ కాలంలోనే మన తెలంగాణ మున్నూరు కాపు సోదరుడు, జాతీయ బీసీల నాయకుడు వి.హనుమంతరావు గారి కంటే భిన్నమైన రీతిలో గాంధీ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. 2018లో ఈ పలుకుబడితోనే ఆయన ఏఐసీసీ కార్యదర్శి అయ్యారు. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా తరచు హైదరాబాద్ రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ కొత్త బోస్ రాజు గారు బాగా పరిచయమయ్యారు.
అంతకు ముందు నర్సాపురం ఎంపీగా పనిచేసిన అల్లూరి సుభాష్ చంద్ర బోస్ ఒక్కరే… పేరు చివర రాజు లేకున్నా పవర్ ఫుల్ హైకమాండ్ మనిషిగా తెలుగోళ్లకు బాగా తెలుసు. ఇందిరమ్మ పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టక ముందు ఆయనతో కలిసి ఈ అల్లూరి బోస్ ‘రాజు గారు’ దిల్లీ నగరం వెలుపల ఉన్న ఢాబాల్లో తిని, తాగేవారనే గొప్ప ప్రచారం ఉండేది.
మళ్లీ ఇన్నాళ్లకు పశ్చిమ గోదావరి జిల్లా మూలాలున్న నడింపల్లి ఎస్ బోస్ రాజు గారు కోస్తా జిల్లాలకు చెందిన అన్ని కులాలోళ్లూ గర్వపడేలా నెమ్మదిగా పైకి వచ్చారు. 74 సంవత్సరాల వయసులో ఈ గోదారి రాజు 75 ఏళ్ల సిద్ధరామయ్య కేబినెట్ లో మొదటిసారి చోటు సంపాదించడంలో గొప్పేముందని మీరు అడగొచ్చు. కేవలం రెండుసార్లు విధానసభకు, ఒకసారి విధానపరిషత్తుకు గెలిచి, ప్రస్తుతం ఏ చట్టసభ సభ్యత్వం లేకున్నా మంత్రి కావడం బోస్ రాజు గారి గొప్పతనమే.
కాంగ్రెస్ యువరాజు, యువరాణిగా పరిగణించే ఇద్దరు హైకమాండ్ సభ్యులతో ఈ మోగల్లు రాజుగారు దగ్గరవ్వడమే ఊహకు అందని విషయం. కాంగ్రెస్ హైకమాండుకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అనుసంధాన కర్తగా బోస్ రాజు గారు పనిచేయడమే ఆయన ప్రతిభకు తార్కాణం, మొన్న రాయచూరు జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి బోసు రాజుగారికి టికెట్ నిరాకరించారు. చివరి నిమిషంలో ఆయన కొడుకు, రాజకీయ వారసుడు రవి బోస్ రాజుకు రాయచూరు సిటీ టికెట్ కాంగ్రెస్ ఇస్తుందని వార్తలొచ్చాయిగాని ఆ పని జరగలేదు. రవికి బదులు ఓ ముస్లిం అభ్యర్థికి సీటు ఇవ్వడంతో ఆయన గెలవడమేగాక జిల్లాలోని ఆరు సీట్లలో నాలుగు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది.
బోసురాజు గారి కుటుంబ త్యాగంతో కాంగ్రెస్ బలం పెరిగిందట!
…………………………………………
బోస్ రాజు కుటుంబం త్యాగం, వారి ప్రచారం వల్ల ముస్లింలు ఏక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని పార్టీ నాయకత్వం కూడా నమ్మింది. ఇలా ఆయన కన్నడ కేబినెట్ మంత్రి కాగలిగారు. కాపులకు రాజ్యాధికారం కావాలని, ఇప్పటికే సీఎం పదవికి తమ కులాలకు దక్కకపోవడం అన్యాయం అని భావించే గోదావరి జిల్లాల కాపు సోదరులు పైన చెప్పిన రాజు గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది శానా ఉంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సముదాయంలో నడింపల్లి బోస్ రాజు గారి వంటి ఒక్క నాయకుడు అవతరించినా ఈ సామాజికవర్గాలకు రాజ్యాధికారం ఖాయంగా సొంతమవుతుంది.
తమ పక్కనే ‘కూల్’గా మంచి ‘మొబిలిటీ, స్టెబిలిటీ, ఎబిలిటీ’తో అన్ని రంగాల్లో విపరీతంగా ఎదిగిపోయిన ఈ తెలుగు రాజులను (క్షత్రియ అనే పదం వద్దులెండి. ఎందుకంటే బోస్ రాజు గురించి కన్నడ పత్రికల్లో, ఇంగ్లిష్ మీడియలో కూడా తెలుగు రాజు కమ్యూనిటీ అని రాశారు.) కాపులు ఆదర్శంగా తీసుకుంటే మంచిదని బెంగళూరుకు చెందిన రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపులు ఇప్పుడు రెడ్లు, కమ్మల మార్గంలో పరిగెత్తే తమ ధోరణికి స్వస్తి పలికి ‘రాజమార్గం’లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.
తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు (2014–20) శాసనమండలి సభ్యుల టీఏ–డీఏ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న బోస్ రాజు గారు ఆ సభ్యత్వం ముగిసిన మూడేళ్లకు మంత్రి కావడం రాజుల బ్రాండ్ వాల్యూ పెంచే పరిణామం. భీమవరం చుట్టుపక్కల రాజుల్లో బైర్రాజు రామలింగరాజు (సత్యం), కనుమూరు రఘురామకృష్ణంరాజు (ఎంపీ) వంటి అనుమానాస్పద రాజులే ఉండరనీ, తన వంటి పదునైన చొరవ, లౌక్యం ఉన్న నాయకులు కూడా ఉంటారని ఏడు పదులు నిండిన తర్వాత బోస్ రాజు గారు నింపాదిగా నిరూపించారు…
Share this Article