కమర్షియల్ మాస్ ఎంటర్‌టెయినర్ అంటే..? లెక్క ప్రకారం నాలుగు పాటలు పడాలి… నడుమ నడుమ అయిదు ఫైట్లు పడాలి… మధ్యలో ఓ ఐటం సాంగ్… ఫుల్లు ఎలివేషన్… హీరో అంటే వాడు ఈ నేలమీదకు దిగొచ్చిన దేవుడు అన్నట్టు ఉండాలి…… అంతేకదా, ఎన్నేళ్లుగా మన నిర్మాతలు, మన దర్శకులు, మన హీరోలు మనకు రుద్దీ రుద్దీ అలవాటు చేసిన నెత్తిమాశిన ధోరణి ఇదే కదా… కానీ..?
ప్రేక్షకుడు కళ్లు తెరిచాడు… ఏం చూడాలో, ఏది తన్ని తగలేయాలో అర్థం చేసుకుంటున్నాడు… ఇంకా మూర్ఖ ఫ్యాన్స్ అనే బెడ్డాతప్పాతాలు కనిపిస్తున్నా సరే, స్థూలంగా ప్రేక్షకుడు వేగంగా మారిపోతున్నాడు… ఈ చెత్తా రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములాను ఈడ్చి తంతున్నాడు… ఐనా సరే, కొందరు హీరోలు మాత్రం కళ్లు తెరవరు… గుడ్డిగా పాత పద్ధతే ఫాలో అవుతారు… కానీ కొత్త హీరోలకు ఏం పుట్టింది..? వాళ్లకూ అదే వ్యాధి దేనికి..?
‘‘నేను మీకు బాగా కావల్సిన వాడిని’’ అనే తాజా సినిమాను చూస్తే ఎవడికైనా ఇదే అనిపిస్తుంది… అదే పంథాలో ఉంది సినిమా… ఇది థియేటర్లకు కాదు కదా, ఓటీటీకి, టీవీకి కూడా వేస్టు… అరె… కోడి రామకృష్ణ బిడ్డ నిర్మాత అట… ఆమెకూ చెప్పేవాళ్లు లేరా..? సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా యాక్ట్ చేశాడు కదా… కాస్త హితవు చెప్పలేకపోయాడా ఆమెకు… అబ్బవరం కిరణ్ అనబడే కుర్ర హీరో పైత్యం ఇదంతా… ఎందుకంటే..? సినిమాకు స్క్రీన్‌ప్లే తనే… సంభాషణలూ తనే…
Ads
పైగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం… ఒక్క పాటా ఎక్కి చావదు… గతంలో ఈయన బాగా సినిమా సంగీతాన్ని ఉద్దరించాడు అంటారు మరి… హీరోయిన్‌ది ఓ విఫల ప్రేమగాథ.,.. ఆమె చెబుతూ ఉంటుంది… వీసమెత్తు కొత్తదనం కనిపించక, వినిపించక ప్రేక్షకుడు జుత్తు పీక్కుంటూ ఉంటాడు… ఖాళీ అయిపోయిన పర్సు చూసుకుని బోరుమంటుంటాడు… ఇంటర్వెల్ అయ్యాక సెకండ్ దెబ్బ రెడీ… హీరో భగ్న ప్రేమగాథ… మధ్యమధ్యలో బాబా భాస్కర్ అనబడే ఓవరాక్షన్ కేరక్టర్ తగిలి మన గాయాల్ని ఇంకా గెలుకుతూ ఉంటుంది…
ఆమె బాధను మరిచిపోవడానికి తాగుతూ ఉంటుంది… తాగి పడిపోతూ ఉంటుంది… ఫాఫం, హీరోకు ఇదే పని… ఆమె ఫుల్లు తాగిందా లేదా చూసుకోవడం, తన క్యాబ్‌లో తీసుకెళ్లి తన రూమ్‌లో డ్రాప్ చేయడం… తాగినవేళల్లో ఎవరూ ఆమెను కిడ్నాప్ చేయకుండా ఫైట్లు కూడా చేస్తుంటాడు… అలా అలా రెండు భగ్న ప్రేమకథల నడుమ కొత్త ప్రేమబంధం స్టార్టవుతుంది… మనస్సులు విప్పుకుంటారు… ఇద్దరి పాత కథలకూ నడుమ ఓ లింకు……
అవును మరి, చదువుతుంటేనే మీకు అంత కోపం పొంగుకొస్తుంటే, బోలెడంత డబ్బు థియేటర్ వాడి బొంద మీద పెట్టిన ప్రేక్షకుడికి ఎంత కోపం రావాలి..?! ఇలాంటి సినిమాల మీద అర్జెంటుగా ఓ పిల్ వేస్తే బాగుండు అనిపిస్తున్నదా..? గుడ్… గో ఎహెడ్… చెడ్డ ఆలోచన మాత్రం అస్సలు కాదు… అప్పుడు మీరే ‘‘అందరికీ బాగా కావల్సినవాడు’’ అనిపించుకుంటారు…!!
Share this Article