.
Gopi Reddy Yedula ….. “నేనూ… నా నల్లకోటు – కథలు”
“ఎవరైతే మాట్లాడలేరో, ఎవరైతే ఏమీ చెప్పుకోలేరో వాళ్ళ మాటలు వినడమే పాలకులూ, న్యాయమూర్తులూ చేయాల్సింది. వాళ్లే ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తారు” అని బలంగా చెబుతుంది ఈ పుస్తకం. “చెప్పుకోలేని వాళ్ళ బాధ” అనే కథ ఈ పుస్తకం ఆత్మ.
Ads
రాజేందర్ జింబో గారి “నేనూ… నా నల్లకోటు – కథలు” వ్యంగ్యాన్ని మిళితం చేసి సమాజంలోని అవలక్షణాలను చిత్రించిన కథలు. గాడిద పాత్ర ద్వారా, బేతాళుడి పాత్ర ద్వారా వివక్షలను వివరించిన విధానం బాగుంది. ఎక్కువగా న్యాయ, పోలీసు వ్యవస్థల పనితీరు పట్ల కథనాలు ఉన్నాయి. ఆ వ్యవస్థలోని వ్యవస్థీకృత లోపాలను ఎత్తి చూపిన విధానం బాగుంది. ఈ కథలు అన్నీ వారి అనుభవంలోనివే.
“ఖడక్ సెల్యూట్” అనే కథ నన్ను పట్టేసింది. ఈ కథలో ప్రొబేషనరీ డీఎస్పీ కోర్టుకు సెల్యూట్ చేసి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. డీఎస్పీ వచ్చిన విషయాన్ని మేజిస్ట్రేట్ గమనించలేదు. ఆ తర్వాత డీఎస్పీని చూసిన మేజిస్ట్రేట్ అసహనంగా ఫీలయ్యాడు. డీఎస్పీ ఒక చీటింగ్ కేసులోని ముద్దాయిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఖడక్ సెల్యూట్ పెట్టకుండా కూర్చున్నందుకు కోపంగా ఉన్న మేజిస్ట్రేట్ ముద్దాయిని కస్టడీకి ఇవ్వకుండా కేసును వాయిదా వేశారు.
ఇలా ఎందుకు జరిగింది అనేది ప్రాసిక్యూటర్ ద్వారా తెలుసుకున్న డీఎస్పీ “మేజిస్ట్రేట్ కు ఇంత ఈగో అవసరమా?” అంటాడు. “పైకి వెళ్లిన కొద్దీ ఈగో విస్తృతం అవుతుంది” అంటాడు ప్రాసిక్యూటర్. కోర్టులో ఉచ్చరించే ‘మిలార్డ్’ అనే సంబోధన ఫ్యూడల్ సంస్కృతికి నిదర్శనం అనే ప్రశ్నను లేవనెత్తారు ఈ కథ ద్వారా.
ఇలాంటి సంస్కృతి చాలా డిపార్టుమెంటుల్లో రకరకాల పద్ధతుల్లో ఉంది. అందులో ఒకటి మా పోలీసు డిపార్టుమెంటులో కింది స్థాయి వాళ్ళని కూర్చోమని చెప్పకపోవడం. కానిస్టేబుల్ ను ఎస్సై కూర్చోమనడు, ఎస్సైని సీఐ కూర్చోమనడు. ఇలా పై దాకా ఉంటుంది.
ఒకసారి మేము మా అసోసియేషన్ మీటింగులో డీజీపీ గారికి ఈ విషయం మీద మెమోరాండం ఇచ్చాం. ‘సిబ్బందిని కూర్చో బెట్టి మాట్లాడాలి’ అని కోరాం. అప్పుడు డీజీపీ గారు “మీ అసోసియేషన్ లో కానిస్టేబుల్ నుండి సీఐ వరకూ సభ్యులు కదా! ఈ సమావేశానికి వచ్చిన ఎస్సైలు, సీఐలు నిలబడండి అన్నారు. సుమారు వందమంది నిలబడ్డారు. “మీరు మీమీ స్టేషన్లలో సిబ్బందిని కూర్చోబెడుతున్నారా?” అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. ఎవరూ కూర్చోబెట్టడం లేదు అనేది బహిరంగ రహస్యమే.
“చూడండి.. తన ముందుకు వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టడం అనేది సంస్కారానికి చెందిన విషయం. దానికి ఉత్తర్వులు ఇవ్వాల్సి రావడమే దురదృష్టం” అని చెప్పి ఆ తరువాత సెట్ కాన్ఫరెన్సులో ‘సిబ్బందిని కూర్చోబెట్టి మాట్లాడాలి’ అని అధికారులకు సూచనలు ఇచ్చారు డీజీపీ గారు.
దీనికి భిన్నంగా కొందరు అధికారులు తమ దగ్గరికి వచ్చిన సిబ్బందిని అందరినీ కూర్చోబెట్టే మాట్లాడతారు. మేము కూర్చోకపోతే వాళ్ళు లేచి నిలబడతారు. పోలీసు వ్యవస్థలోని అలాంటి మానవీయ అధికారులు, ఈ పుస్తక రచయిత లాంటి న్యాయ కోవిదులు ధ్వజమెత్తితే తప్ప ‘ఫ్యూడల్ సంస్కృతులు’ మాసిపోవు.
న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, జుడీషియల్ అకాడెమీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ గా, డైరెక్టర్ గా, పోలీసు అకాడెమీలో, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా పని చేసిన అనుభవజ్ఞులు, పేరు గాంచిన కవి, రచయిత రాజేందర్ జింబో రాసిన ఈ కథలు వ్యవస్థలోని అసమానతలను నిలదీస్తాయి. సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ముందుమాటతో వెలువడింది ఈ పుస్తకం…
Share this Article