Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…

June 3, 2023 by M S R

మొన్నామధ్య ఎక్కడో చదవబడినట్టు గుర్తు…  బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాసుడు నాటి ప్రభాస్-రాజమౌళి చిత్రం ఛత్రపతిని హిందీలో సినిమాగా తీసి, రిలీజ్ చేస్తే… మొదటివారం నెట్ షేర్ కోటి రూపాయలు వచ్చిందట… (అంటే రెండో వారం నడిచిందా అని చొప్పదంటు ప్రశ్న వదలకండి…) సదరు హీరో హిందీ ప్రాంతాల్లో ప్రమోషన్లకు వెళ్లివచ్చిన రవాణా, ఇతరత్రా మీడియా ఖర్చులు తిరిగొచ్చాయన్నమాట… మరి అరవయ్యో, డెబ్బయ్యో కోట్లు పెట్టారు కదా… వాటి సంగతేమిటి..?

అయ్య దగ్గర బొచ్చెడు సొమ్ము మూలుగుతోంది… ఇండస్ట్రీలో మస్తు రిలేషన్లున్నాయి… ఐనా సరే, హీరో గాకుండా తమాయించుకునుడు ఎట్లా..? తప్పలేదు… ఇప్పటిదాకా ఏవేవో సినిమాలు చేస్తూనే ఉన్నాడు… రాక్షసుడు అనే ఓ మోస్తరు సినిమా తప్ప అన్నీ ఫ్లాపులే… ఈసారి ఇక మరో బేకార్ నిర్ణయం తీసుకుని, ఇప్పటి ట్రెండ్ పాన్ ఇండియా కదా… పైగా తెలుగులో తీసి, ఆనక హిందీలోకి డబ్ చేయడం దేనికి..? కొడితే హిందీలోనే స్ట్రెయిట్‌గా ఒక సినిమా సాలిడ్‌గా కొట్టేసి, వీలయితే ఇతర భాషల్లోకి డబ్ చేస్తే సరి అనుకున్నాడు…

Ads

కొత్త కథ, కొత్త టేకింగ్, కొత్త వాళ్లు అనే రిస్క్ దేనికి… అందుకే నాటి తెలుగు హిట్ ఛత్రపతి హిందీ రైట్స్ తీసేసుకుని కుమ్మేస్తే సరి అనుకున్నట్టున్నాడు… ఎలాగూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ఛత్రపతి, అందులోనూ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ఛత్రపతి… ఆ ఇద్దరి ఇమేజీతో గట్టెక్కవచ్చు అనుకున్నాడు… కానీ ప్రభాస్ ఛత్రపతిని ఇప్పటికే చాలామంది హిందీ ప్రేక్షకులు చూసేసి ఉన్నారు… పైగా ప్రభాస్ ఎక్కడ..? బెల్లంకొండ శ్రీనివాసుడెక్కడ..? మొత్తం యవ్వారం ఎదురుతన్నింది… హిందీలో ఎవడూ దేకలేదు… దేకినవాళ్లు ఫాఫం ఇంకా కోలుకోలేదు…

nenu student

ఇక మరో స్వాతిముత్యం ఉంది కదా… గణేషుడు… తనకూ అర్జెంటుగా హీరో కావాలని గుల… రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ అని తీశాయి… తండ్రికి పరమానందం… హీరోయిన్‌గా అలనాటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ బిడ్డ అవంతిక దస్సానిని హీరోయిన్‌గా పెట్టారు… దీన్ని పొరపాటున హిందీలోకి గనుక డబ్ చేస్తే భాగ్యశ్రీ బిడ్డ అనేది అదనపు అట్రాక్షన్ అవుతుందని అనుకున్నట్టున్నారు… తీరా సినిమా చూస్తే ఈ గణేషుడికన్నా ఆ శ్రీనివాసుడే నయం అన్నట్టుంది…

బేసిక్‌గా ఇద్దరూ నటనలో ఓనమాలు కూడా నేర్చుకోలేదు… మానవ సహజమైన వందల ఉద్వేగాల్ని ఒకేరకంగా ప్రదర్శించడం మాత్రం తెలుసు… కాస్త చూడబుల్ ఫిజిక్, ఫైటింగులు, స్టెప్పులో కాస్త ఈజ్ ఉంటే చాలు, ఒక వారస హీరోకు ఇంతకుమించి ఏం కావాలి అనుకుంటున్నారేమో… తినగ తినగ వేము తీయగా ఉన్నట్టు… చూసీ చూసీ ప్రేక్షకులే హీరోలుగా ఆమోదిస్తారులే అనే నమ్మకం కావచ్చు బహుశా… మొదట్లో మట్టిముద్దల్లా ఉన్న వారస హీరోలు ఇప్పుడు అగ్రహీరోలుగా లేరా అని సమాధానపడ్డట్టున్నారు ఈ ఇద్దరు కూడా… కానీ ప్రేక్షకులు పాత రోజుల్లోనే ఉండిపోలేదు… ఎహెఫో అని తిరస్కరిస్తున్నారు… అదుగో ఆ పాయింట్‌లో బెల్లంకొండ బ్రదర్స్ రియాలిటీ గుర్తించలేనట్టుంది…

సినిమా సంగతికొస్తే… తెలుగు ప్రేక్షకుల టేస్ట్, అంచనాల మీద నిర్మాత, దర్శకుడికి చాలా తేలికపాటి అభిప్రాయాలున్నయ్… లేకపోతే సెల్ ఫోన్‌ను మరీ ఇదిగా సోదరప్రేమతో ప్రేమించడం ఏమిటి..? అది పోతే, తిరిగి తన దగ్గరకు రప్పించుకోవడానికి ఏకంగా పోలీస్ కమిషనర్ బిడ్డకే లైన్ వేయడం ఏమిటి..? ఆమె కూడా ఓ సెల్ ఫోన్ తరహాలో వెంటనే పడిపోవడం ఏమిటి..? తండ్రి రివాల్వర్ ఎత్తుకొచ్చేయడం ఏమిటి..? పిచ్చి లేస్తుంది కదా కథ చదువుతుంటే… మరిక థియేటర్‌లో చూసేవాడికి ఎలా ఉండాలి..? ఇక్కడ మొదలైన కథ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్‌డ్ అమౌంట్ల స్కామ్ దాకా చేరుకుంటుంది…

Ads

సరే, ఏదో భిన్నమైన కథ అనుకుందాం… టేకింగ్ బాగుంటే ఇంతకు మించి చెత్త కథలకు కూడా కాసులు రాలాయ్… ఈ సినిమాలో అదీ కొరవడింది… హీరోయిన్‌తో హీరో లవ్ ట్రాక్ కెమిస్ట్రీ కాదు కదా… ఏ సబ్జెక్టూ పండించలేకపోయింది… ఈ శుష్క దృశ్యాలలో పాపం భాగ్యశ్రీ బిడ్డ వెలవెలాబోయింది… ఇక బీజీఎంలు, సాంగ్స్ గట్రా మాట్లాడుకోకపోవడమే మంచిది… గణేషా… మరో సినిమా తీసేలోపు… నువ్వు తీస్తావ్… మాకు తెలుసు… ఇంకా చాలా డబ్బుంది మీ దగ్గర… ఈలోపు కాస్త నటనలో బేసిక్స్ నేర్చుకుంటే బెటర్ కదా… ఆలోచించు…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions