మన హీరోల్ని… అంటే కేవలం టాలీవుడ్డు మాత్రమే కాదు… మొత్తం ఇండియన్ సినిమా అంతా అలాగే తగలడింది… హీరో ఉంటాడు… మానవాతీత భుజ, బుర్ర, రొమాంటిక్, సెంటిమెంట్ బల ప్రదర్శనలు బోలెడు చేస్తాడు… ప్రతి హీరో సూపర్ మ్యానే… జనానికి నచ్చట్లేదు… ఇదేం హీరోయిజంర భయ్ అని తిరస్కరిస్తున్నాడు… సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, చెత్తా రొటీన్ స్టోరీలను వద్దంటున్నాడు…
ఐనా సరే, హీరోలు కదా… వాళ్లు మారరు… ఆ పైత్యం గురించి ఎంత రాసినా తెగదు, ఒడవదు గానీ… ఆమధ్య అట్రాక్షన్ కోసం కథ డిమాండ్ చేయకపోయినా సరే, ముగ్గురు, నలుగురు హీరోయిన్లను కూడా ఇరికించడం మొదలుపెట్టారు… ఒకరితో డ్రీమ్ సాంగ్, ఇంకొకరితో ఐటం సాంగ్, మరొకరితో లవ్ సాంగ్ అన్నట్టు గుప్పించేవారు… అంతా అందాల ప్రదర్శనే… ప్చ్, వాటినీ జనం ఛీకొట్టడం మొదలుపెట్టారు… చివరకు బిడ్డ తరహా పాత్ర అయినా సరే హీరోతో డాన్స్ చేయించాల్సిందే అన్నట్టుగా మారింది…
ఇదీ వర్కవుట్ కావడం లేదని ఇక ‘పాన్ ఇండియా’ పైత్యం మొదలుపెట్టారు… అంటే దేశమంతా విడుదల చేస్తున్నారు కదా, వేర్వేరు భాషల్లోకి డబ్ చేసి… అఫ్‌కోర్స్ చాలా పాన్ ఇండియా సినిమాలను కూడా జనం తిరస్కరిస్తున్నారు… ఈమధ్య పలు తెలుగు సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే నార్త్‌లో దేకినోడే లేడు… డబ్బింగ్ ఖర్చులు బొక్క… ఓటీటీకో, శాటిలైట్ టీవీకో అమ్మి నాలుగు పైసలు చేసుకునే ఎత్తుగడ… అన్నీ పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయలు కాలేవురా బాబూ…
Ads
తరువాత మరో చిట్కా… మన హీరోయిజానికి అదనంగా మరో హీరోను జతకలపాలి… మన చిరంజీవికి ఏ బాలీవుడ్ ఖానో తోడవుతాడు… లేదంటే కొడుకు కలుస్తాడు… మరీ కాదంటే ఇంకో మాస్ హీరో రవితేజ కలుస్తాడు… ఇద్దరూ కలిసి నరుకుతారు తెరను… రజినీ కూడా అంతే కదా… ఆమధ్య ఏదో రొటీన్ మాస్ సినిమా కొట్టాడు కదా… అందులో కన్నడ, మలయాళ, హిందీ స్టార్లను పెట్టుకున్నాడు… ఏం..? రజినీ ఒక్కడు చాలడా సినిమా నడవడానికి..? అదేమంటే పాన్ ఇండియా ఫ్లేవర్, మార్కెట్ అంటారు… పోనీ, ఇదేమైనా వర్కవుట్ అవుతోందా..? టైగర్ చాలా నాసిరకం సినిమా… దాని గురించిన రివ్యూ కూడా అక్కర్లేదు ఇక్కడ…
సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి కత్రినా కైఫ్ కావాలి… అంతే… ఆమె అప్పట్లో మల్లీశ్వరి సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడూ అంతే… ఏ ఉద్వేగమూ ఆమె మొహంలో పలకదు… ఫాఫం, ఆమె మొహం అలాంటిది, ఆమె ఏం చేయగలదు..? త్వరలో రాబోయే మంచు ఆణిముత్యం భక్త కన్నప్ప (సినిమా పేరు అదేనా..?)కూ ఇదే మల్టీస్టారర్ ఇకారాలు తప్పడం లేదు… ప్రభాస్ శివుడట… నయనతార పార్వతి అట… కన్నడ, హిందీ, మలయాళ ఇండస్ట్రీల నుంచి కూడా కొందరు స్టార్లను కూడా ఇరికిస్తారుట… మరి మన మంచుముత్యం దేశవ్యాప్తంగా వెలగాలంటే ఈ అదనపు దీపాలు అవసరం కదా…
బాలీవుడ్‌లోనూ ఇదే దందా… ఒక సల్మాన్ ఖాన్‌కు ఒక షారూక్ ఖాన్ కలిస్తే టైగర్… అంతకుముందు షారూక్ ఖాన్‌కు అదేదో సినిమాలో సల్మాన్ ఖాన్ తోడు… ఇంకేదో బతుకమ్మ సినిమాలో సల్మాన్‌కు మన వెంకటేశ్ కలిశాడు… ఫలితం అట్టర్ ఫ్లాప్… టైగర్‌లో ఎన్టీఆర్ కూడా అన్నారు, ప్రచారం చేశారు… హృతిక్ ఎందుకున్నాడో తనకే తెలియదు… రాబోయే నాలుగో సీరీస్ సినిమాలో మన జూనియర్ కూడా కలుస్తాడట… ప్చ్, ఒక్క హీరో మాస్ మసాలా దున్నడం సరిపోవడం లేదు… ఇది *సామూహిక దున్నడం* పథకం…!!
Share this Article