.
ట్రినిడాడ్, టొబాగో… మొన్న మోడీ వెళ్లొచ్చాడు ఆ దేశానికి… దాని జనాభా ఎంతో తెలుసా..? 14 లక్షలు… హైదరాబాదులో బోడుప్పల్ మున్సిపాలిటీతో సమానం… కానీ అదొక రిపబ్లిక్… అక్కడి అధ్యక్షురాలు, ప్రధానివి భారత మూలాలు… మోడీ పర్యటన వేళ హుందాగా, గౌరవంగా వ్యవహరించి, ఇండియాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించారు…
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… అంతటి చిన్న దేశమైనా సరే, ప్రధానికి లేదా అధ్యక్షురాలికైనా మాటకు విలువ ఉండాలి, సంయమనం ఉండాలి… ఆధారాలు ఉండాలి, తమ దేశం పరువు తీయకుండా ఉండాలి… పోనీ, ఆ దేశానికి ఏదైనా ప్రయోజనం ఉండాలి… నేపాల్ ప్రధాని ఒకాయన ఉన్నాడు… పేరు కేపీ శర్మ ఓలి… పైన చెప్పుకున్న సోయి ఏమాత్రం లేదు…
Ads
గతంలో నేపాల్ ఇండియాలో ఓ రాష్ట్రంలా ఉండేది… హిందూరాజ్యం… రాజరికం… భీకర మావోయిస్టులు అధికారంలోకి వచ్చారు, అట్టర్ ఫ్లాప్… చైనా చంకన చేరి, హిందూరాజ్యం పదం రద్దు చేసి, రాజ్యాంగం మార్చుకున్నారు… ఏమైంది..? ఇప్పుడు ఆ జనమే మళ్లీ రాజరికం కావాలని బజారుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు…
సరే, ఈ ఓలి మాటలకొద్దాం… రాముడు నేపాల్‌లోనే పుట్టాడు, చెప్పుకోలేక, అంటే ప్రచారం చేసుకోలేక పోయాం… తనే కాదు, శివుడు, విశ్వామిత్రుడు ఇక్కడే పుట్టారు, వాల్మీకి రామాయణమే చెప్పింది, దశరథుడి పుత్రకామేష్టి కూడా ఇక్కడే జరిగింది అంటాడు… ఇక్కడ కొన్ని అంశాలు…
- తను గతంలో ఏమన్నాడు..? రాముడు చిత్వాన్ జిల్లా థోరిలో పుట్టాడు అన్నాడు… ఇప్పుడేమో ఛతరాలో పుట్టాడు అంటాడు… రెండూ నేపాల్, ఇండియా సరిహద్దుల్లోనే ఉంటాయి… కానీ వాటి నడుమ చాలా దూరం… వాల్మీకీ రామాయణమే ఆధారం అనేవాడు తనే ముందుగా ఆ జన్మస్థలి ఏదో ఖరారు చేసుకోవాలి కదా… అబద్ధమైనా చాలా కాన్ఫిడెంటుగా చెప్పాలి… (సేమ్, అవే పేర్లతో జార్ఖండ్‌లో ఊళ్లున్నాయి…)
సరే, ఏదో చెప్పాడు… దాంతో ఏం ప్రయోజనం..? నిజంగానే తను చెప్పేవి రామజన్మభూములే అయినా సరే ఎవరు రావాలి పర్యటనకు..? భారతీయులు… అయోధ్యే రామజన్మభూమి అని విశ్వసించి, సుదీర్ఘ పోరాటం చేసి, అపురూపమైన భవ్య మందిరం నిర్మించుకున్నాక… ఇక దాన్ని కాదని ఓలి చెప్పిన చోట్లకు పరుగు తీస్తారా..? మరెందుకు ఈ కూతలు..?
నిజంగానే ప్రజలు విశ్వసిస్తే, ఇప్పటికే ఆ ప్రాంతాలకు విరగబడేవారు కదా… ఇండియా సరిహద్దుల్లోనే కదా ఉన్నవి ఆ ప్రాంతాలు… (ఐనా రాముడు పుట్టినప్పుడు ఇండియా ఏమిటి..? నేపాల్ ఏమిటి..? ఈ విభజన గీతలు ఏమిటి..? అదొక అఖండ కోసల రాజ్యం…)
పోనీ, రాముడు పుట్టిన చోట ఏమైనా ఆధారం ఉందా..? ఎస్, జానకి పుట్టిన మిథిల ఇప్పుడు నేపాల్‌లోనే ఉందని చాలామంది నమ్ముతారు… కాదు, కాదు, సీతామఢి అని ఇండియాలోనే మరొకటి ఉందనీ కొందరు నమ్ముతారు… ఐనా సరే, మిథిలలో సీత పుట్టిన చోట ఓ భవనం ఉంది… సీతారాముల పరిణయం జరిగినట్టు చెప్పే ఓ మండపం కూడా ఉంది…
రాముడి పరిణయాన్ని అక్కడ ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు, ఇండియన్స్ కూడా చాలామంది వెళ్తారు… నిజానికి స్పిరిట్యుయల్ టూరిజం ప్రమోట్ చేసుకోవాలంటే ఇది కాదు మార్గం… హిందువులు తరచూ సందర్శించే చాలా పుణ్యక్షేత్రాలున్నాయి ఆ దేశంలో.., మరీ ముఖ్యంగా పశుపతినాథ్ ఆలయం…
వాటికి ప్రాధాన్యం ఇచ్చి, డెవలప్ చేసుకోవాలి… ఈ వివాదాస్పద ప్రకటనలతో ఒరిగేదేమీ లేదు, అనవసరంగా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం తప్ప..!
Share this Article